తెలంగాణలో ‘కమల మంత్రం’
తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకోవడమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ తన వ్యూహాలకు పదును పెడుతోంది. దక్షిణ భారతదేశంలో కర్ణాటక తర్వాత పట్టు సాధించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న కమలనాథులు, ఈసారి ఎలాగైనా తెలంగాణ గద్దెనెక్కాలనే స్పష్టమైన దిశానిర్దేశంతో ముందుకెళ్తున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ వేదికగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సమక్షంలో జరిగిన కీలక సమీక్షా సమావేశం, రాబోయే రోజుల్లో బీజేపీ అనుసరించబోయే రాజకీయ వ్యూహానికి ఒక స్పష్టమైన రోడ్‌మ్యాప్‌ను అందించింది.
తెలంగాణ బీజేపీకి ప్రధాన ప్రతిబంధకంగా మారిన పాత, కొత్త నేతల మధ్య విభేదాలను, అంతర్గత కలహాలను వెంటనే పక్కన పెట్టాలని పార్టీ అధిష్ఠానం స్పష్టం చేసింది. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, డీకే అరుణ, కొండ విశ్వేశ్వర్ రెడ్డి, లక్ష్మణ్, రఘునందన్ రావు సహా ముఖ్య నేతలందరూ ఒకే తాటిపైకి వచ్చి పోరాడాలని అధిష్టానం స్పష్టం చేసింది. గతంలో కరీంనగర్, మేడ్చల్ అర్బన్, వికారాబాద్ జిల్లాల పార్టీ అధ్యక్షుల నియామకంపై నలుగుతున్న వివాదాలను సైతం బండి సంజయ్, ఈటల రాజేందర్, కొండ విశ్వేశ్వర్ రెడ్డిల సూచనలకు ప్రాధాన్యం ఇస్తూ సర్దుబాటు చేయడం ద్వారా పార్టీ శ్రేణుల్లో ఐక్యతను నింపే ప్రయత్నం జరిగింది.
భవిష్యత్తులో బిఆర్ఎస్ లేదా ఇతర పార్టీలతో పొత్తులు ఉంటాయనే ప్రచారాలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు ముగింపు పలికారు. రాబోయే ఎన్నికల్లో జీహెచ్ఎంసీ సహా ఏ ఎన్నికల్లోనైనా తెలంగాణలో ఏ ఇతర పార్టీతోనూ పొత్తు ఉండదని, ఒంటరిగానే పోటీ చేస్తామని తేల్చి చెప్పారు. జాతీయ స్థాయిలో ఎన్డీయే భాగస్వామ్య పక్షాలతో సమీకరణాలు వేరైనా, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు, పార్టీ స్వయం సమృద్ధి దృష్ట్యా ఒంటరి పోరాటమే శ్రేయస్కరమని పార్టీ భావిస్తోంది. గత ఎన్నికల్లో 119 నియోజకవర్గాల్లో గణనీయమైన ఓటు బ్యాంకు సాధించామని, నియోజకవర్గాల పునర్విభజన అనంతరం సీట్ల సంఖ్య పెరిగితే సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత సత్తా సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను, ప్రజల్లో ఉన్న అసంతృప్తిని క్షేత్రస్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యంగా బీజేపీ కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ప్రధానంగా ఫీజు రీయింబర్స్మెంట్ అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు, యువత సమస్యలపై పార్టీ అసెంబ్లీ కన్వీనర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి నాయకత్వంలో ధర్నాలు, నిరసనలు చేపడుతోంది. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలైన ‘ప్రధాన మంత్రి ఆవాస్ యోజన’ వంటి ఫలాలను పేదలకు చేరకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటోందనే అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని నిర్ణయించారు.
మండల స్థాయి నుంచి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల వరకు ప్రతి నెలా నిలకడగా సమీక్షలు నిర్వహిస్తూ, ప్రతీ మూడు నెలలకోసారి కేంద్రీయ నేతలు రాష్ట్రాన్ని సందర్శించేలా పక్కా ప్రణాళిక రూపుదిద్దుకుంది. నేతల మధ్య ఉన్న చిన్న చిన్న భేదాభిప్రాయాలు పక్కనబెట్టి, వ్యూహాత్మకంగా ముందుకు సాగితే తెలంగాణ పీఠం దక్కడం అసాధ్యమేమీ కాదని కమలనాథులు భావిస్తున్నారు.








