అర్థరాత్రి సీఎంకు రిషభ్ పంత్ సంచలన మెసేజ్..!
భారత స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్(Rishab Pant) సోషల్ మీడియా వేదికగా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీకి అర్థరాత్రి వేళ చేసిన ఒక వింత విజ్ఞప్తి ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీ నుండి తన నివాసాన్ని స్వస్థలమైన ఉత్తరాఖండ్‌కు మార్చాలని అనుకుంటున్నానని, అక్కడ ఇల్లు కట్టుకోవడానికి పెద్ద స్థలం కోసం గత మూడేళ్లుగా ప్రయత్నిస్తున్నా దొరకడం లేదని పంతే స్వయంగా తన ‘ఎక్స్’ (X) ఖాతాలో పేర్కొన్నాడు. ఈ క్రమంలోనే తనకు భూమిని కేటాయించేలా సహాయం చేయాలంటూ సీఎం ధామీని ట్యాగ్ చేస్తూ పంత్ వరుస పోస్టులు పెట్టాడు.
అయితే, ఈ సుదీర్ఘమైన పోస్ట్‌లో రిషభ్ పంత్ రాసిన ఇంగ్లీష్ వాక్యాల్లో తీవ్రమైన వ్యాకరణ దోషాలు (Grammatical Errors), స్పెల్లింగ్ తప్పులు ఉండటం నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేసింది. అంతటితో ఆగకుండా, తదుపరి చేసిన మరో పోస్ట్‌లో అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు గాను ప్రభుత్వం తరఫున ఆ భూమిని తనకు ‘గిఫ్ట్’ గా ఇస్తే బాగుంటుందని, ఒకవేళ అలా కుదరకపోతే ప్రభుత్వ ధరల ప్రకారమే కొనుగోలు చేయడానికి అనుమతించాలని పంత్ అడిగాడు.
సొంత రాష్ట్రంలో మొదటి ఇల్లు కట్టుకోవాలని ఆశపడుతున్న తనకు సహాయం చేయాలంటూ అర్థరాత్రి 12:46 గంటలకు పంత్ ఈ ట్వీట్లు చేశాడు. శ్రీలంకతో జరగబోయే కీలక టెస్ట్ సిరీస్‌కు పంత్ సిద్ధమవుతున్న తరుణంలో, అర్థరాత్రి వేళ ఇలాంటి తప్పుల తడకల పోస్టులు పెట్టడంపై క్రికెట్ ఫ్యాన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. “అర్థరాత్రి ఒంటి గంటకు పంత్ మద్యం మత్తులో ఉన్నాడా? ఇన్ని తప్పులతో ఇలాంటి వింత కోరికలు కోరుతున్నాడేంటి? మ్యాచ్‌లపై దృష్టి పెట్టకుండా ఈ గొడవేంటి?” అంటూ నెటిజన్లు తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్లు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుండగా, దీనిపై ఉత్తరాఖండ్ సీఎం కార్యాలయం నుండి ఎలాంటి అధికారిక స్పందన రాలేదు.








