అడవి బిడ్డలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్..!
ఆంధ్రప్రదేశ్లోని గిరిజన ప్రాంతాల అభివృద్ధి, అడవి బిడ్డల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ నిరంతర పర్యవేక్షణలో ఏజెన్సీ ప్రాంతాల రహదారి పనుల్లో స్పష్టమైన పురోగతి కనిపిస్తోంది. గిరిజన గ్రామాలకు శాశ్వత రవాణా సౌకర్యం కల్పించాలనే లక్ష్యంతో చేపట్టిన ‘అడవితల్లి బాట’ పథకం ఇప్పుడు మైదాన ప్రాంతాల తరహాలోనే కొండ కోనల్లోనూ అభివృద్ధి వెలుగులను నింపుతోంది.
ఈ భారీ ప్రాజెక్టును రెండు దశల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తోంది. ‘అడవితల్లి బాట’ తొలి దశలో భాగంగా రూ. 1,005 కోట్ల భారీ వ్యయంతో 1,069 కిలోమీటర్ల మేర రహదారుల అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. దీనికి అదనంగా ప్రాజెక్టును మరింత విస్తరిస్తూ ‘అడవితల్లి బాట 2.0’ ను కూడా తీసుకువచ్చారు. దీని ద్వారా మొత్తం బడ్జెట్ను రూ. 2,078 కోట్లకు పెంచి, ఏకంగా 2,310 కిలోమీటర్ల మేర గిరిజన రోడ్ల అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నారు. అధికారుల నిరంతర శ్రమ, ప్రభుత్వం అందించిన నిధులతో ఈ విస్తరణ పనుల్లో ఇప్పటికే రికార్డు స్థాయిలో 905 కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణం పూర్తి కావడం గమనార్హం.
మరోవైపు పెండింగ్ పనులపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. గిరిజన ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి ప్రధాన అడ్డంకిగా మారే అటవీ శాఖ అనుమతుల విషయంలో ఎలాంటి జాప్యం జరగకుండా ఆయా శాఖల అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకోవాలని సూచించారు. ప్రస్తుత వర్షాల కారణంగా ఆటంకాలు ఉన్న చోట మినహాయించి, మిగిలిన అన్ని ప్రాంతాల్లో పనులను వేగంగా కొనసాగించాలని ఆదేశించారు. అత్యవసర సమయాల్లో గిరిజనులను ఆసుపత్రులకు చేర్చడానికి డోలీలు వాడే దుస్థితిని పూర్తిగా తుడిచేసి, “డోలీ రహిత ఆంధ్రప్రదేశ్” సాధించడమే మన అందరి లక్ష్యం కావాలని, ఇందులో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.








