300 శ్లోకాల రహస్యం: గణపతి ముని కలమా… రమణ మహర్షి మౌనమా?
—సూర్య ప్రకాష్ జోశ్యుల
చరిత్రలో కొన్ని సంఘటనలు ఉంటాయి.
వాటిని పూర్తిగా నమ్మలేం. అని కొట్టిపారేయలేం కూడా. ఎందుకంటే వాటి వెనుక ఉన్న వ్యక్తులు సాధారణమైన వారు కాదు. అలాంటి ఒక సంఘటనే ఉమా సహస్రం పూర్తి అయిన రోజు. ఒక ప్రశ్నతో ఈ కథ మొదలవుతుంది.
ఒక మనిషి మేధస్సు ఒక్కసారిగా ఆగిపోతే… మరో మనిషి మౌనం దాన్ని మళ్లీ ప్రవహింపజేయగలదా? భారతీయ ఆధ్యాత్మిక చరిత్రలో ఈ ప్రశ్నకు సమాధానంగా తరచూ చెప్పబడే సంఘటన ఇదే.
కావ్యకంఠ గణపతి ముని…
సంస్కృత సాహిత్యంలో అసాధారణ ప్రతిభ. ఆయనకు పదాలు వెతుక్కోవాల్సిన అవసరం ఉండేది కాదు. పదాలే ఆయనను వెతుక్కుంటూ వచ్చేవని సమకాలీనులు చెప్పేవారు. అలాంటి మహాకవి దేవీ మహిమను కీర్తిస్తూ వెయ్యి శ్లోకాలతో “ఉమా సహస్రం” రచించాలని సంకల్పించారు. అది కేవలం ఒక గ్రంథం కాదు. తన సాధనకు, తన భక్తికి, తన జీవితానికే ఒక శిఖరాగ్రం.
అంతేకాదు… ఒక నిర్దిష్ట రోజున ఆ రచనను సమర్పిస్తానని కూడా ప్రకటించారు. కానీ విధి మరో పరీక్ష పెట్టింది. 700 శ్లోకాల వరకు రచన ప్రవాహంలా సాగింది. అక్కడే ఆగిపోయింది. రోజులు గడుస్తున్నాయి. సమర్పణ తేదీ దగ్గరపడుతోంది. మిగిలింది కేవలం 300 శ్లోకాలే. కానీ ఒక్క శ్లోకం కూడా ముందుకు రావడం లేదు. సాధారణ రచయిత అయితే అది “రైటర్స్ బ్లాక్” కావచ్చు.
కానీ జీవితమంతా శ్లోకాలలోనే శ్వాసించిన ఒక మహాకవికి ఇది అసాధారణమైన నిశ్శబ్దం. ఆ సమయంలో గణపతి ముని అరుణాచలంలో భగవాన్ రమణ మహర్షి సమక్షంలో కూర్చొన్నారు .రమణ మహర్షి ఎలాంటి ఉపన్యాసం చేయలేదు. ఏ మంత్రం చెప్పలేదు. ఏ సూచన ఇవ్వలేదు. ఆయన మౌనంగానే ఉన్నారు. అక్కడి నుంచే ఈ కథ చరిత్ర నుంచి మిస్టరీగా మారుతుంది.
కొంతసేపటికి గణపతి ముని ఒక్కసారిగా శ్లోకాలు చెప్పడం ప్రారంభించారు.
ఆగకుండా…ఆలోచన అనేది లేకుండా..వరుసగా… మిగిలిన 300 శ్లోకాలన్నీ నిరవధికంగా ప్రవహించాయి. వేగం చాలా ఎక్కువగా ఉండటంతో ఒకరి చేత కాదు, పలువురు లేఖకులు కలిసి వాటిని రాసుకున్నారని చరిత్ర చెప్తోంది. చివరి శ్లోకం పూర్తయ్యాక రమణ మహర్షి నెమ్మదిగా ఒక ప్రశ్న అడిగారని సంప్రదాయం చెబుతుంది.
“అన్నీ రాసుకున్నారా?”
గణపతి ముని సమాధానం ఒక్కటే.
“అవును.”
కానీ అసలు సంఘటన అక్కడితో ముగియలేదు. కొంతకాలం తర్వాత గణపతి ముని చెప్పిన మాటే ఈ ఘటనను చరిత్రలో ప్రత్యేకంగా నిలబెట్టింది. ఆ చివరి 300 శ్లోకాలు తన సాధారణ మేధస్సు నుంచి వచ్చినవి కావని… అవి భగవాన్ అనుగ్రహంతో వెలువడ్డాయని ఆయన వ్యాఖ్యానించినట్లు రమణాశ్రమానికి చెందిన గ్రంథాలు నమోదు చేశాయి.
ఇక్కడే రెండు ప్రపంచాలు విడిపోతాయి.
భక్తుడు ఈ సంఘటనను చూస్తే…ఇది గురువు అనుగ్రహం. ఒక చైతన్యం మరో చైతన్యంలో ప్రవహించిన క్షణం. పరిశోధకుడు చూస్తే… ఇది అసాధారణమైన ఆధ్యాత్మిక అనుభవాన్ని నమోదు చేసిన చారిత్రక వృత్తాంతం. ఈ రెండు దృక్కోణాల్లో ఏది నిజమో నిరూపించడం కష్టం. కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితంగా నిజం. 700 శ్లోకాల దగ్గర ఆగిపోయిన రచన… కొన్ని గంటల్లో వెయ్యి శ్లోకాల మహాగ్రంథంగా పూర్తయింది. అదే ఉమా సహస్రం.
అందుకే ఈ సంఘటనను రమణ మహర్షి–గణపతి ముని సంబంధంలో ఒక మలుపుగా భావిస్తారు. అది గురువు మాటల వల్ల జరిగిన మార్పు కాదు. మౌనం వల్ల జరిగిందని విశ్వసిస్తారు. చరిత్రలో చాలా గురువులు బోధించారు. కొంతమంది అద్భుతాలు చేశారని చెబుతారు. కానీ…ఒక మాట కూడా మాట్లాడకుండా, మరో మనిషి ఆలోచనను పూర్తి చేశాడని విశ్వసింపజేసిన గురువులు మాత్రం చాలా అరుదు. అందుకే ఈ సంఘటన ఇప్పటికీ ఒక ప్రశ్నగానే మిగిలిపోయింది.
ఆ 300 శ్లోకాలు గణపతి ముని రాశారా? లేక… ఆయన ద్వారా ఇంకేదో రాయించిందా? ఆ ప్రశ్నకు సమాధానం చరిత్ర ఇవ్వదు. ప్రతి పాఠకుడి విశ్వాసమే ఇస్తుంది.








