మనిషి మాట రహస్యం పక్షి పాటలో ఉందా?
—సూర్య ప్రకాష్ జోశ్యుల
“పక్షి పాట లో… మనిషి మాట పుట్టుకకు సంబంధించిన ఒక చిన్న క్లూ దాగి ఉందా?”. సమాధానం ఆ పక్షి పాటలో వినిపించకపోవచ్చు. అది మనకు కనిపించని దాని DNAలో రాసి ఉండొచ్చు.అదేంటనేది శాస్త్రవేత్తలు బ్రేక్ చేస్తున్నారు.
చెట్టుపై ఒక పక్షి మధురంగా పాట పాడుతోంది. మనకు అది కేవలం కిలకిలారావంలా అనిపిస్తుంది. కానీ ఆ పాట వెనుక ఒక పెద్ద శాస్త్రీయ రహస్యం ఉంది. ఆ పాట్రన్ ని అర్దం చేసుకుంటున్నారు.
ఒక మనిషి మాట్లాడటం నేర్చుకుంటాడు.
ఒక పక్షి పాట పాడటం నేర్చుకుంటుంది.
ఇద్దరి మధ్య వేల మైళ్ల దూరం ఉన్నట్టు అనిపిస్తుంది. ఒకటి మనిషి మెదడు. మరొకటి ఓ చిన్న పక్షి మెదడు.కానీ శాస్త్రవేత్తలను ఇప్పుడు ఆలోచిస్తున్న విషయం మాత్రం ఒక్కటే ఇద్దరూ “వినడం… గుర్తుపెట్టుకోవడం… నేర్చుకోవడం… తిరిగి పలకడం” అనే ఒకే ప్రక్రియను ఉపయోగిస్తున్నారా?. ఉపయోగిస్తే అది ఎలా జరుగుతోంది. ఈ ప్రశ్నలకు సమాధానం వెతుకుతూ అమెరికాలోని రాక్ఫెల్లర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు జీబ్రా ఫించ్ అనే చిన్న పాటల పక్షి జీనోమ్‌ను తొలిసారిగా పూర్తిగా మ్యాప్ చేశారు.
అందులో ఇంతకుముందు గుర్తించని 2,710 జీన్లు బయటపడ్డాయి. గతంలో చదవలేకపోయిన దాదాపు 9 కోట్ల DNA బేస్ పెయిర్లు కూడా ఇప్పుడు జీనోమ్లోకి వచ్చాయి. పక్షి జీనోమ్‌లోని అత్యంత చిన్న క్రోమోజోమ్స్‌ను కూడా పూర్తిగా మ్యాప్ చేయగలిగారు.
అసలు ఇందులో మనిషికి ఏం ఉపయోగం?
ఇదే ఈ పరిశోధనలో అసలు ఆసక్తికరమైన విషయం. జీబ్రా ఫించ్ సాధారణంగా శబ్దం చేయడం మాత్రమే కాదు. ఇతర పక్షుల శబ్దాన్ని విని, దాన్ని నేర్చుకుని, సాధన చేసి తన పాటను మార్చుకుంటుంది. మనిషి కూడా అలాగే భాష నేర్చుకుంటాడు.
పిల్లవాడు పెద్దవాళ్లు మాట్లాడటం వింటాడు. ఆ శబ్దాలను గుర్తుపెట్టుకుంటాడు. తర్వాత తానే పలకడానికి ప్రయత్నిస్తాడు. అంటే వినడం, జ్ఞాపకం పెట్టుకోవడం, నేర్చుకోవడం, అనుకరించడం వంటి ప్రక్రియలు మనిషి భాషలోనూ, ఈ పక్షి పాటలోనూ కనిపిస్తాయి.
అందుకే శాస్త్రవేత్తలు ఇప్పుడు ఈ పక్షి DNAలో శబ్దాన్ని నేర్చుకునే సామర్థ్యానికి సంబంధించిన జీన్లు ఏవి? అవి మెదడులో ఎలా పనిచేస్తాయి? అనే ప్రశ్నలను మరింత ఖచ్చితంగా పరిశీలించవచ్చు.
భవిష్యత్తులో ఇది మనిషిలో భాష, మాట, జ్ఞాపకశక్తి, మెదడు నేర్చుకునే విధానం గురించి కొత్త విషయాలను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడవచ్చు.
మాట్లాడటంలో లేదా భాష నేర్చుకోవడంలో సమస్యలు ఎదురయ్యే కొన్ని మానవ పరిస్థితులపై పరిశోధనలకు కూడా కొత్త మార్గాలు తెరవొచ్చు. అయితే ఇప్పుడే ఏదైనా కొత్త మందు లేదా చికిత్స వచ్చిందని మాత్రం అర్థం కాదు. ఇది ఆ దిశగా పరిశోధనకు ఉపయోగపడే కొత్త జన్యు మ్యాప్ మాత్రమే.
మరి పక్షి ఏం పాడుతుందో తెలుస్తుందా?
ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఉంది. ఈ పరిశోధనతో పక్షి పాటకు మనుషుల భాషలో అర్థం ఏమిటో ఇంకా తెలియదు. కానీ “పక్షి ఆ పాటను ఎలా నేర్చుకుంటుంది?” అనే ప్రశ్నకు సమాధానం వెతికే మార్గం మాత్రం మరింత స్పష్టమైంది. ఇదే ఈ పరిశోధనలో అసలు ప్రాధాన్యం.
మనిషి తన గురించి తెలుసుకోవడానికి ఎప్పుడూ మనిషినే అధ్యయనం చేయాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు… ఒక చిన్న పక్షి DNAను పూర్తిగా చదివితే కూడా, మనిషి మెదడు ఎలా నేర్చుకుంటుంది? మనిషి మాట ఎలా పుట్టింది? అనే ప్రశ్నలకు కొత్త ఆధారాలు దొరకొచ్చు.








