సుప్రీంకోర్టుకు చేరిన రైతులు Vs Lay’s చిప్స్ కేసు, అసలేం జరిగింది?
—సూర్య ప్రకాష్ జోశ్యుల
మీరు సూపర్మార్కెట్లో Lay’s చిప్స్ ప్యాకెట్ కొనుగోలు చేస్తున్నప్పుడు… అందులో వాడిన ఆలుగడ్డ వెనుక ఒక పెద్ద న్యాయపోరాటం నడుస్తోందని ఊహించి ఉండరు. ఆ పోరాటం ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు గడప దాటి సుప్రీంకోర్టుకు చేరింది.
అక్కడ వివాద విషయం కొంచెం గమ్మత్తు అయినదే. ఒక కంపెనీ ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన ఆలుగడ్డ రకాన్ని రైతు తన పొలంలో పండిస్తే… ఆ ఆలుగడ్డపై హక్కు రైతుదా?ఆ వంగడాన్ని డవలప్ చేసిన కంపెనీదా?
ఇదే ప్రశ్న చుట్టూ వివాదం మొదలైంది. ఈ క్రమంలో PepsiCo, రైతు సంఘాలు, విత్తన హక్కులు, రైతుల స్వేచ్ఛ—అన్నీ ఒకే న్యాయపోరాటంలోకి వచ్చాయి.
వివాదం ఏమిటి..
కంగారు పడకండి.. ఈ వివాదం సాధారణ ఆలుగడ్డ గురించి కాదు. FL 2027గా పిలిచే ఒక ప్రత్యేక ఆలుగడ్డ రకం చుట్టూనే మొత్తం కథ తిరుగుతోంది. దీన్ని చిప్స్, వేఫర్స్ తయారీకి అనుకూలంగా అభివృద్ధి చేశారు. సాధారణ ఆలుగడ్డలతో పోలిస్తే ఇందులో తేమ శాతం తక్కువగా ఉండటం వల్ల వేయించినప్పుడు చిప్స్ తయారీకి ఇది అనుకూలంగా మారుతుంది.
మరి తేడా ఎక్కడ
రైతు దృష్టిలో ఇది కేవలం ఒక ఆలుగడ్డ పంట. కంపెనీ దృష్టిలో మాత్రం ఇది ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన వాణిజ్య పంట రకం. ఇక్కడే అసలు ఘర్షణ మొదలవుతుంది.
‘ఈ రకం మాది’ అంటున్న కంపెనీ
2001లో వచ్చిన Protection of Plant Varieties and Farmers’ Rights Act కింద ఈ రకంపై తమకు ప్రత్యేక హక్కులు ఉన్నాయని పెప్సికో వాదిస్తోంది. 2016లో FL 2027కు సంబంధించిన రిజిస్ట్రేషన్ పొందినందున, దాని ఉత్పత్తి, విక్రయం, మార్కెటింగ్‌పై తమకు బ్రీడర్ హక్కులు ఉన్నాయని సంస్థ చెబుతోంది.
సరళంగా చెప్పాలంటే…
ఒక కంపెనీ ఒక ప్రత్యేక విత్తన రకాన్ని అభివృద్ధి చేసి రిజిస్టర్ చేసుకుంటే, ఆ రకాన్ని ఇతరులు వాణిజ్యపరంగా సాగు చేయడాన్ని ఎంతవరకు ఆపగలదు? ఇదే ఇప్పుడు కోర్టు ముందు ఉన్న కీలక ప్రశ్న.
రైతు సంఘాల వాదన ఇంకా పెద్దది. భారత చట్టమే రైతులకు కొన్ని ప్రత్యేక హక్కులు ఇచ్చిందని వారు చెబుతున్నారు. విత్తనాలను పండించుకోవడం, భద్రపరచుకోవడం, ఉపయోగించడం, కొన్ని పరిస్థితుల్లో విక్రయించడం కూడా రైతులకు చట్టపరంగా రక్షించబడిన హక్కులేనని వారు వాదిస్తున్నారు.
ముఖ్యంగా PPV&FRA చట్టంలోని Section 39ను వారు ప్రస్తావిస్తున్నారు.
వారి వాదనలో అసలు పాయింట్ ఇదే:
బ్రీడర్‌కు హక్కు ఇచ్చిన చట్టమే రైతుకూ రక్షణ ఇచ్చినప్పుడు… ఆ రెండు హక్కుల్లో ఏది పైచేయి? ఇది కేవలం ఒక ఆలుగడ్డ రకంపై తగాదా కాదు. కోర్టు ముందు ‘రైతు vs కంపెనీ’ కంటే పెద్ద ప్రశ్న. ఈ కేసు అందుకే ఆసక్తికరంగా మారింది.
ఒక వైపు కొత్త విత్తన రకాలను అభివృద్ధి చేయడానికి కంపెనీలు పెట్టే పరిశోధన, పెట్టుబడి ఉంది. ఆ పెట్టుబడికి రక్షణ లేకపోతే కొత్త వంగడాలను అభివృద్ధి చేయడానికి ప్రైవేట్ సంస్థలు ఎందుకు ముందుకు వస్తాయన్న ప్రశ్న ఉంది.
మరో వైపు…
భారత వ్యవసాయానికి వెన్నెముక అయిన రైతు తన పొలంలో పండించిన విత్తనంపై ఎంతవరకు స్వేచ్ఛ కలిగి ఉండాలి? ఇది కేవలం చట్టపరమైన ప్రశ్న కాదు. ఇది ఆహార వ్యవస్థపై కూడా ప్రభావం చూపే ప్రశ్న. ఇక్కడే ‘Food Sovereignty’ అనే మాట వస్తుంది. రైతు సంఘాలు ఈ కేసును కేవలం వ్యక్తిగత రైతుల వివాదంగా చూడటం లేదు.
ఒక ఆహార పంటకు సంబంధించిన విత్తన రకంపై ఒక కార్పొరేట్ సంస్థకు విస్తృత నియంత్రణ లభిస్తే, భవిష్యత్తులో వ్యవసాయంలో రైతుల స్వతంత్రత ఎంతవరకు మిగులుతుందన్న ప్రశ్నను వారు లేవనెత్తుతున్నారు.
ఎందుకంటే విత్తనం అంటే కేవలం విత్తనం కాదు. అది తదుపరి పంటకు ఆరంభం. విత్తనంపై నియంత్రణ పెరిగితే పంటపై నియంత్రణ పెరుగుతుంది. పంటపై నియంత్రణ పెరిగితే… ఆహార వ్యవస్థపై కూడా ప్రభావం పడుతుంది. అందుకే ఈ కేసులో ‘బ్రీడర్ హక్కులు’ అనే న్యాయ పదం వెనుక ఆహార సార్వభౌమత్వం అనే చాలా పెద్ద అంశం దాగి ఉంది.
అయితే పెప్సికో వాదన కూడా వేరేలా ఉంది
సాధారణ రైతులను లక్ష్యంగా చేసుకుని తాము వ్యవహరించడం లేదని కంపెనీ చెబుతోంది. పోటీ చిప్స్ తయారీ సంస్థల ప్రయోజనాల కోసం రక్షిత ఆలుగడ్డ రకాన్ని పెద్ద ఎత్తున వాణిజ్యపరంగా సాగు చేసే సందర్భాల్లోనే తాము చర్యలు తీసుకుంటున్నామని సంస్థ వాదిస్తోంది.
అంటే కంపెనీ వాదనలో ఇది రైతు హక్కులపై దాడి కాదు… తమ మేధో సంపత్తి, బ్రీడర్ హక్కుల పరిరక్షణ.ఇదే సమయంలో రైతుల వాదనలో ఇది ఒక కంపెనీ హక్కు vs రైతు చట్టబద్ధమైన హక్కుగా మారింది.
ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెబుతుందనేదే కీలకం
ఢిల్లీ హైకోర్టు పెప్సికోకు అనుకూలంగా గతంలో ఇచ్చిన రక్షణను పునరుద్ధరించడంతో రైతు సంఘాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఇప్పుడు దేశ అత్యున్నత న్యాయస్థానం ముందున్న ప్రశ్న FL 2027 ఆలుగడ్డ రకానికి మాత్రమే పరిమితం కావడం లేదు. ఒక రక్షిత మొక్కల రకాన్ని రైతు తన పొలంలో పండించినప్పుడు బ్రీడర్ హక్కులు ఎక్కడ మొదలవుతాయి? రైతు హక్కులు ఎక్కడ మొదలవుతాయి?
ఆ గీత ఎక్కడ గీయాలి?
దానికి వచ్చే సమాధానం భవిష్యత్తులో వందలాది విత్తన రకాలు, వేలాది రైతులు, అనేక వ్యవసాయ కంపెనీలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇదే Lay’s ప్యాకెట్ వెనుక దాగిన పెద్ద కథ.








