ప్రధాని మోదీని కుటుంబ సమేతంగా కలిసిన ఎంపీ కలిశెట్టి
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)తో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు (Kalisetti Appala Naidu) మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. విజయనగరం చేనేత కార్మికులు రూపొందించిన ప్రత్యేక వస్త్రాలను ప్రధానికి కానుకగా ఆయన అందజేశారు. ఈ సందర్భంగా చేనేత కళాకారుల నైపుణ్యాన్ని, వారి సేవలను మోదీ అభినందించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌లోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ (Bhogapuram International Airport) ప్రారంభోత్సవ కార్యక్రమం ప్రస్తావనకు వచ్చింది. ఆ కార్యక్రమం ఎంతో అద్భుతంగా నిర్వహించారని ప్రధాని ప్రశంసించారు.
ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ (Minister Nara Lokesh)ను ప్రత్యేకంగా అభినందించారు ప్రధాని. మంత్రి లోకేశ్‌కు ఆర్గనైజేషన్ స్కిల్స్ బాగున్నాయని ఆయన కితాబిచ్చారు. ఈ సందర్భంగా ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు క్రమశిక్షణను కూడా మోదీ కొనియాడారు. సమావేశాల సమయంలో ఎంపీ కలిశెట్టి రోజూ పార్లమెంట్‌కు సైకిల్ (Bicycle)పై వస్తుండటాన్ని తాను గమనించానని, ప్రజాప్రతినిధిగా ఆయన క్రమశిక్షణ కలిగిన నాయకుడని అభినందించారు. ఈ భేటీలో ఎంపీ కుమార్తె కలిశెట్టి నిఖిల కూడా పాల్గొన్నారు. ప్రధాని పాలనను భారత్‌తో పాటు విదేశాల్లోని జెన్-జీ తరం గర్వంగా భావిస్తోందని ఆమె తెలిపారు.








