రెండే గంటల్లో మీ ఇన్‌స్టాలో వీడియో ఉంచాలో, తీసేయాలో తేల్చేస్తారు!
—సూర్య ప్రకాష్ జోశ్యుల
మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో పోస్ట్ చేశారు. అది ఏదో ఒక కారణంతో దానిపై కంప్లైంట్ వచ్చింది. అయితే ఆ వీడియో తీసేయటానికి ,నిర్ణయం తీసుకోవటానికి గతంలో లాగ ఇక రోజంతా సమయం ఉండదు. కేవలం రెండు గంటల్లోనే… ఆ వీడియో ఉండాలా? తీసేయాలా? అనేది తేల్చాల్సి ఉంటుంది.
సోషల్ మీడియా వినియోగించే ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేసేలా కేంద్ర ప్రభుత్వం IT Rulesను మరింత కఠినతరం చేసింది. ఇకపై నగ్నత, మార్ఫింగ్, ఇంపర్సనేషన్ వంటి సున్నితమైన కంటెంట్‌పై ఫిర్యాదు వస్తే సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు రెండు గంటల్లో చర్య తీసుకోవాలి. ప్రభుత్వం లేదా కోర్టు నుంచి చట్టవిరుద్ధ కంటెంట్ తొలగించాలనే ఆదేశం వస్తే మూడు గంటల్లోనే దాన్ని తొలగించాలి.
ఇప్పటివరకు ఇలాంటి కొన్ని ఫిర్యాదులకు 24 గంటల వరకు సమయం ఉండేది. ఇప్పుడు ఆ సమయం భారీగా తగ్గింది.
అసలు ఎందుకు ఇంత వేగం?
దీని వెనుక ప్రధాన కారణం AI, Deepfakeలు. ఇప్పుడు ఒక వ్యక్తి ముఖాన్ని మరో వీడియోలో పెట్టడం, ఎవరో మాట్లాడినట్టుగా AIతో వాయిస్ తయారు చేయడం, అసలు జరగని సంఘటన జరిగినట్టుగా వీడియో రూపొందించడం చాలా సులభమైపోయింది. అలాంటి వీడియో ఒకసారి సోషల్ మీడియాలోకి వస్తే… అది నిజమో కాదో తేలేలోపే లక్షల మందికి చేరిపోవచ్చు.
అందుకే ప్రభుత్వం…
“తర్వాత తొలగించడం కాదు… వెంటనే గుర్తించి ఆపాలి” అనే విధానాన్ని తీసుకొస్తోంది. ఇక AI కూడా మీ కంటెంట్‌ను గమనిస్తుంది కొత్త నిబంధనల్లో AI-generated కంటెంట్‌కు స్పష్టమైన లేబుళ్లు, గుర్తించగలిగే సమాచారం ఉండాలని చెబుతున్నారు. భారత్‌లో 50 లక్షలకుపైగా యూజర్లు ఉన్న పెద్ద సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు కొన్ని రకాల అత్యంత హానికరమైన కంటెంట్‌ను AI ఆధారిత టూల్స్‌తో ముందుగానే గుర్తించే వ్యవస్థలను కూడా ఏర్పాటు చేయాల్సిన పరిస్ధితి వచ్చింది.
అంటే…
ఇక సోషల్ మీడియాలో ఒక వీడియోను మనుషులు మాత్రమే చూడరు. AI కూడా దాన్ని పరిశీలిస్తుంది. అది ప్రమాదకరమైనదిగా కనిపిస్తే… దానిపై వేగంగా చర్య తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఒక వీడియో నిజమైనదా? Deepfakeనా? అభ్యంతరకరమైనదా? కాదా? ఇలాంటి నిర్ణయాన్ని రెండు గంటల్లో తీసుకోవడం అంత సులభం కాదు.
ఒకవేళ ఏఐ తప్పుగా అర్థం చేసుకుంటే? నిజమైన వీడియోనే పొరపాటున తొలగిస్తే? లేదా ఎవరో ఫిర్యాదు చేసినంత మాత్రాన ఒక కంటెంట్‌పై తొందరపడి చర్య తీసుకుంటే? ఇదే విషయంలో విమర్శలు మొదలయ్యాయి.
ప్రతిపక్ష నేతలు ఈ నిబంధనలను ప్రభుత్వం విమర్శించే కంటెంట్‌ను తొలగించడానికి కూడా ఉపయోగించే అవకాశం ఉందని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం మాత్రం ఈ చర్యలు Deepfakeలు, అక్రమ కంటెంట్, ఆన్లైన్ దుర్వినియోగాన్ని అరికట్టడానికేనని చెబుతోంది.
అసలు మార్పు ఇదే…
ఇప్పటివరకు సోషల్ మీడియా కంపెనీలు ప్రధానంగా ఒక పని చేసేవి. మీరు పెట్టిన కంటెంట్‌ను ఇతరులకు చూపించడం. ఇకపై వాటిపై మరో బాధ్యత పెరుగుతోంది. ఆ కంటెంట్ ఉండాలా? తీసేయాలా? అనే నిర్ణయాన్ని కూడా చాలా వేగంగా తీసుకోవాలి. అందుకే ఈ కొత్త రూల్‌ను కేవలం “24 గంటల గడువును 2 గంటలకు తగ్గించారు” అని చూడటం సరిపోదు. AI, Deepfakeల కాలంలో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు క్రమంగా కంటెంట్‌ను చూపించే వేదికల నుంచి… కంటెంట్‌పై నిర్ణయం తీసుకునే గేట్‌కీపర్లుగా మారుతున్నాయి.








