రాజమండ్రి ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్
రాజమహేంద్రవరం (Rajamahendravaram)లో మద్యం మత్తులో యువకులు కారుతో ఢీకొట్టడంతో పీజీ వైద్య విద్యార్థిని బ్రెయిన్ డెడ్ అయిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) తీవ్రంగా స్పందించారు. ఈ ఘాతుకానికి పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. తప్పు చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించరాదని, వారికి చట్ట ప్రకారం కఠిన శిక్షలు పడేలా చూడాలని స్పష్టం చేశారు. బాధితురాలు డాక్టర్ ప్రియాంక (Dr. Priyanka,) ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని, ఆమెకు అవసరమైన అత్యుత్తమ వైద్య సహాయం అందించాలని సూచించారు.
అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి ఈ ఘటనపై సమీక్ష నిర్వహించారు. ఘటన జరిగిన తీరును, నిందితుల అరెస్టు వివరాలను అధికారులు ఆయనకు వివరించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మెడికోలు ప్రియాంక, ఉమేష్( Umesh) ల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. నిందితులను ఇప్పటికే అరెస్టు చేశామని అధికారులు తెలపగా, విచారణ వేగవంతం చేసి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని దిశానిర్దేశం చేశారు.








