రేవంత్ సోదరుడికి ఫ్యూచర్ సిటీలో భూమి… రాజకీయ సెగ!
హైదరాబాద్ శివార్లలో తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ ప్రాజెక్టు చుట్టూ ఇప్పుడు రాజకీయ వివాదం ముసురుకుంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాల పరిధిలో ‘టెసెరాక్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్’ అనే డిఫెన్స్ స్టార్టప్ కంపెనీకి 5 ఎకరాల పారిశ్రామిక భూమిని కేటాయించడం తీవ్ర దుమారానికి దారితీసింది. ఈ వ్యవహారంపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బిఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం పరాకాష్టకు చేరింది.
బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ భూకేటాయింపుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బహిరంగ మార్కెట్లో దాదాపు రూ.200 కోట్ల విలువ చేసే 5 ఎకరాల అత్యంత విలువైన భూమిని ప్రభుత్వం కేవలం రూ.7 కోట్లకే టెసెరాక్ కంపెనీకి కట్టబెట్టిందని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డి ఈ కంపెనీకి చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారని చెప్పారు. అందుకు సంబంధించిన లింక్డ్ఇన్ ప్రొఫైల్స్, అంతర్జాతీయ సంస్థలు, అమెరికన్ కాన్సులేట్ ప్రతినిధులతో జరిగిన సమావేశాల వివరాలను ఆధారాలుగా చూపించారు. కేవలం లక్ష రూపాయల మూలధనం ఉన్న కంపెనీకి వందల కోట్ల విలువైన భూమిని ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై గవర్నర్, లోకాయుక్తను ఆశ్రయించనున్నట్లు తెలపారు. అంతేకాక, దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
అయితే కేటీఆర్ ఆరోపణలను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తీవ్రంగా ఖండించారు. ఈ కేటాయింపుల్లో ఎలాంటి నిబంధనల ఉల్లంఘన జరగలేదని ఆయన స్పష్టం చేశారు. టెసెరాక్ కంపెనీకి ముఖ్యమంత్రి సోదరుడికి ఎలాంటి సంబంధం లేదని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సలహా కమిటీ నిబంధనల ప్రకారం, పూర్తిగా పారదర్శకంగానే భూకేటాయింపు ప్రక్రియ ముగిసిందని వెల్లడించారు. గత ప్రభుత్వంలో జరిగిన భూ అక్రమాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే బిఆర్ఎస్, బీజేపీలు కలిసి నాటకాలు ఆడుతున్నాయని ఆరోపించారు.
దీనిపై వివాదం ముదరడంతో టెసెరాక్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ సైతం స్పందించింది. తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (TGIIC) నిబంధనల ప్రకారమే భూమి పొందినట్లు తెలిపింది. భూ కేటాయింపు ప్రక్రియ పూర్తయ్యేందుకు 15 నెలల సమయం పట్టిందని, ప్రభుత్వం నిర్ణయించిన రుసుములను చెల్లించామని పేర్కొంది. డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (DPIIT) గుర్తింపు పొందిన డిఫెన్స్ స్టార్టప్‌గా తమ భవిష్యత్ విస్తరణ ప్రాజెక్టుల కోసమే ఈ స్థలం తీసుకున్నామని స్పష్టం చేసింది.
ఫ్యూచర్ సిటీకి అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం యత్నిస్తున్న సమయంలో ఈ వివాదం తలెత్తడం ప్రభుత్వ ఇమేజ్‌కు సవాలుగా మారింది. మంత్రి శ్రీధర్ బాబు టెసెరాక్తో కొండల్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని ప్రకటిస్తున్నప్పటికీ, సోషల్ మీడియా ఆధారాలు, అంతర్జాతీయ ప్రతినిధుల సమావేశాల పోస్టుల్లో ఆయన పేరు కనిపించడం ప్రభుత్వ డిఫెన్స్‌ను కొంత బలహీనపరిచింది. అదే సమయంలో, ప్రతిపక్షం చూపుతున్న మార్కెట్ విలువకు, ప్రభుత్వం పారిశ్రామిక ప్రాజెక్టులకు కేటాయించే రాయితీ ధరలకు వ్యత్యాసం ఉండటం సహజమే అయినప్పటికీ.. స్వయంగా సీఎం కుటుంబ సభ్యుల పేర్లు వినిపించినప్పుడు పారదర్శకత మరింత ప్రాధాన్యత సంతరించుకుంటుంది. ప్రభుత్వ నిబంధనలు సరిగ్గానే పాటించారా లేదా అనేది నిష్పాక్షిక విచారణ ద్వారా తేలితే తప్ప ఈ పొలిటికల్ హీట్ తగ్గేలా కనిపించడం లేదు.








