లోన్ కట్టలేదని ఇంటికొచ్చి బెదిరిస్తున్నారా? RBI కొత్త రూల్ ఏం చెప్తోంది?
— సూర్య ప్రకాష్ జోశ్యుల
ఒక EMI మిస్ అయింది. వెంటనే ఫోన్ మోగుతుంది. ఒకసారి కాదు.. పదిసార్లు. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి అనే తేడా లేకుండా కాల్స్. ఆ తర్వాత వాట్సాప్ మెసేజ్‌లు. చివరికి ఇంటికి వచ్చి కుటుంబ సభ్యుల ముందే పరువు తీసే ప్రయత్నం. ఇలాంటి రికవరీ వేధింపులు చాలా మంది రుణగ్రహీతలకు కొత్త విషయం కాదు. కానీ ఇకపై రుణం బకాయి ఉందన్న కారణంతో ఇష్టమొచ్చినట్టు ఒత్తిడి చేయడానికి బ్యాంకులు, NBFCలు, వారి రికవరీ ఏజెంట్లకు అంత స్వేచ్ఛ ఉండదు.
భారతీయ రిజర్వ్ బ్యాంక్ రికవరీ ప్రక్రియను మరింత క్రమబద్ధం చేసే కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. ఈ మార్పులు 2027 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. అసలు ఇందులో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. RBI ఇప్పుడు “రుణం వసూలు చేయాలి” అనే దానితో పాటు “ఎలా వసూలు చేయాలి?” అన్నదానిపైనా స్పష్టమైన గీత గీస్తోంది.
ఇక రాత్రివేళ రికవరీ కాల్స్‌కు చెక్
కొత్త రూల్ ప్రసారం సాధారణ అప్పు తీసుకున్న వాళ్లకు నేరుగా కనిపించే మార్పు కాల్స్ విషయంలో ఉంటుంది. రికవరీ ఏజెంట్లు ఉదయం 8 గంటల కంటే ముందు, సాయంత్రం 7 గంటల తర్వాత రుణగ్రహీతలను సంప్రదించకూడదు. అంటే రాత్రి 10 గంటలకు, 11 గంటలకు వరుసగా ఫోన్లు చేసి EMI కట్టమని ఒత్తిడి చేయడం రూల్స్ కు విరుద్ధం.
ఇది కేవలం ఫోన్ కాల్స్‌కు సంబంధించిన విషయం మాత్రమే కాదు. రుణ వసూలు పేరుతో బెదిరించడం, అసభ్యకరంగా మాట్లాడటం, పదేపదే కాల్స్ లేదా మెసేజ్‌లతో మానసిక ఒత్తిడి తీసుకురావడం, కుటుంబ సభ్యులు లేదా ఇతర వ్యక్తుల ముందు రుణగ్రహీతను అవమానించడం వంటి పద్ధతులకు RBI స్పష్టమైన అడ్డుకట్ట వేస్తోంది. సోషల్ మీడియాలో ఫొటోలు లేదా బకాయి వివరాలను పెట్టి పరువు తీయడం వంటి చర్యలు కూడా రికవరీ ప్రక్రియలో అనుమతించబడవు.
ఇంటికి వస్తే.. ముందే సమాచారం ఇవ్వాలి
రికవరీ ఏజెంట్ అకస్మాత్తుగా ఇంటి తలుపు తట్టి నిలబడే రోజులు కూడా మారుతున్నాయి. కొత్త ఫ్రేమ్‌వర్క్ ప్రకారం, రుణగ్రహీత లేదా గ్యారంటర్‌ను మొదటిసారి వ్యక్తిగతంగా కలవడానికి ముందు ముందస్తు సమాచారం ఇవ్వాలి. డిజిటల్ కాంటాక్ట్ వివరాలు అందుబాటులో ఉంటే SMS లేదా ఈమెయిల్ ద్వారా కనీసం ఒక రోజు ముందుగా సమాచారం ఇవ్వాలి.
ఇక్కడ మరో ముఖ్యమైన మార్పు ఉంది. బ్యాంకు తన రికవరీ బాధ్యతను బయటి ఏజెన్సీకి అప్పగించినంత మాత్రాన బాధ్యత నుంచి తప్పించుకోలేదు. ఏజెంట్ ఎలా ప్రవర్తిస్తున్నాడు, అతను RBI నిబంధనలు పాటిస్తున్నాడా లేదా అన్నదానిపై సంబంధిత regulated entity పర్యవేక్షణ బాధ్యత కొనసాగుతుంది. అంటే “అతను మా ఏజెంట్ కాదు.. బయట ఏజెన్సీ” అని చెప్పి బ్యాంకు చేతులు దులుపుకోవడానికి అవకాశం ఉండదు.
ప్రతి రికవరీ కాల్‌కూ రికార్డు
ఇప్పటి వరకు రికవరీ ఏజెంట్ ఏమన్నాడు, ఎప్పుడు ఫోన్ చేశాడు అన్నది నిరూపించడం కొన్నిసార్లు కష్టంగా ఉండేది. కొత్త వ్యవస్థలో రికవరీకి సంబంధించిన కమ్యూనికేషన్‌పై రికార్డింగ్, రికార్డు నిర్వహణకు మరింత ప్రాధాన్యం ఇస్తున్నారు. కాల్ రికార్డులు, సమయం, సంబంధిత వివరాలను నిర్దిష్ట కాలం పాటు భద్రపరచాల్సిన బాధ్యత కూడా lendersపై ఉంటుంది.
దీని వెనుక అసలు ఉద్దేశం ఇదే. రుణగ్రహీత ఒక ఫిర్యాదు చేస్తే “అలా ఏమీ జరగలేదు” అని చెప్పడం కంటే.. నిజంగా ఏం జరిగిందో రికార్డుల ఆధారంగా పరిశీలించే అవకాశం ఉండాలి.
EMI కట్టలేదని మీ ఫోన్‌ను వెంటనే బ్లాక్ చేయలేరు
ఇక అసలు సంచలనమైన భాగం మొబైల్ ఫోన్లు, ట్యాబ్లెట్లు, ల్యాప్‌టాప్‌ల EMIల విషయంలో. ఒక డివైజ్‌ను రుణం ద్వారా కొనుగోలు చేశారని మాత్రమే చెప్పి EMI మిస్ అయిన వెంటనే దాన్ని పూర్తిగా బ్లాక్ చేయడం కుదరదు.
RBI frameworkలో lender ఇలాంటి technology-based restrictionను ఉపయోగించాలనుకుంటే gradual approach పాటించాలి. ముందుగా రుణగ్రహీతకు default సరిదిద్దుకునే అవకాశం ఇవ్వాలి. ముఖ్యమైన ఫంక్షన్లను పూర్తిగా నిలిపివేయకూడదు. ముఖ్యంగా incoming calls, internet access, emergency SOS, ప్రభుత్వ లేదా public-safety notifications వంటి essential functionalitiesను రక్షించాల్సి ఉంటుంది.
అంటే “ఒక్క EMI మిస్ అయింది.. నీ ఫోన్ ఇక పనిచేయదు” అనే విధానం కాదు. రుణగ్రహీతకు notice, cure period ఇచ్చిన తర్వాతే నిర్దిష్ట పరిస్థితుల్లో graduated restrictions అమలు చేయవచ్చు.
EMI చెల్లించిన తర్వాత కూడా ఫోన్ లాక్‌లోనే ఉంటే?
ఇక్కడే ₹250 అనే సంఖ్య ఆసక్తికరంగా మారుతుంది.
రుణగ్రహీత బకాయి చెల్లించిన తర్వాత deviceపై పెట్టిన restrictionsను lender గరిష్ఠంగా ఒక గంటలోపు తొలగించాలి. అన్యాయంగా restriction విధించినా, లేదా చెల్లింపు తర్వాత దాన్ని తొలగించడంలో ఆలస్యం జరిగినా, నిర్దిష్ట పరిస్థితుల్లో lender గంటకు ₹250 చొప్పున compensation చెల్లించాల్సి ఉంటుంది.
అంటే ఇది “EMI ఆలస్యంగా కట్టినందుకు బ్యాంకు మీకు ₹250 ఇస్తుంది” అనే అర్థం కాదు. చెల్లింపు అయిన తర్వాత కూడా అన్యాయమైన device restriction కొనసాగితే, ఆ తప్పిదానికి సంబంధించిన compensation mechanism ఇది. ఈ తేడాను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.
మరి “జైలుకే” అన్నది నిజమేనా?
ఇక్కడే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న హెడ్డింగులకు, అసలు RBI నిబంధనలకు మధ్య తేడా కనిపిస్తుంది.
RBI కొత్త recovery frameworkను ఉల్లంఘించినందుకు ప్రతి recovery agentకు ఆటోమేటిక్‌గా “జైలు శిక్ష” విధించే కొత్త నిబంధనను ప్రకటించలేదు. RBI ప్రధానంగా regulated entitiesపై conduct, monitoring, documentation, grievance redressal, recovery-agent behaviour వంటి అంశాల్లో బాధ్యతను పెంచుతోంది.
అయితే ఒక recovery agent బెదిరింపు, హింస, బలవంతం లేదా ఇతర ప్రత్యేక నేరాలకు పాల్పడితే అది వేరే విషయం. అలాంటి సందర్భాల్లో సాధారణ క్రిమినల్ చట్టాలు కూడా వర్తించవచ్చు. కానీ “RBI కొత్త రూల్ ప్రకారం రికవరీ ఏజెంట్ ఇలా చేస్తే నేరుగా జైలుకే” అని చెప్పడం మాత్రం సరైన వివరణ కాదు.
అసలు RBI తాజా మార్పుల వెనుక ఉన్న పెద్ద కథ ఇదే. రుణం తీసుకున్న వ్యక్తి డబ్బు తిరిగి చెల్లించాల్సిన బాధ్యత నుంచి తప్పించుకోలేడు. అదే సమయంలో, ఆ డబ్బు వసూలు చేయడానికి అతని గౌరవం, వ్యక్తిగత గోప్యత, కుటుంబం, ఫోన్ లేదా మానసిక ప్రశాంతతను తాకట్టు పెట్టడానికి lenderకూ హక్కు లేదు.
రుణం బకాయి కావచ్చు.. కానీ రుణగ్రహీత హక్కులు బకాయి కావు. అదే RBI కొత్త recovery framework చెప్పే అసలు సందేశం.








