ఆకాశాన్ని చూస్తున్నారా? లేక ఆకాశమే మిమ్మల్ని చూస్తోందా?
—శివ దువ్వూరు
రాత్రి.
ఇంటి టెర్రస్ మీద ఒంటరిగా నిలబడి ఉన్నారు.
కింద నగరం నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటోంది. దూరంగా ఏదో వాహనం శబ్దం. ఎక్కడో ఒక ఇంట్లో టీవీ శబ్దం. ఇంకెక్కడో కుక్క మొరుగుతోంది.
కానీ మీరు మాత్రం పైకి చూస్తున్నారు. ఆకాశం వైపు. మొదట ఒక నక్షత్రం కనిపిస్తుంది. తర్వాత ఇంకొకటి. మరికొన్ని. కాసేపటికి… వాటిని లెక్కించడం మానేస్తారు. ఇలా చూస్తూ ఉంటే ఒక విచిత్రమైన అనుభూతి మొదలవుతుంది.
ఆకాశం అక్కడ ఉంది… మీరు ఇక్కడ ఉన్నారు అనే తేడా కాస్త తగ్గిపోతుంది. మీరు ఆకాశాన్ని చూస్తున్నట్టుగా ఉండదు. ఆకాశంలో మీరు కూడా ఒక భాగమైపోయినట్టుగా అనిపిస్తుంది. మీరు చిన్నవాళ్లమైపోయామన్న భావన కాదు. అంతకంటే విచిత్రమైనది. “నేను” అనే భావం కాసేపు పలుచబడినట్టుగా ఉంటుంది. మనకంటే చాలా పెద్దదైన దేనిలోనో మనం ఒక చిన్న భాగమన్న అనుభూతి.
ఇలాంటి అనుభూతిని మనోవిజ్ఞాన శాస్త్రంలో awe లేదా self-transcendent experience వంటి భావనలతో వివరిస్తారు. అలా ఎందుకు జరుగుతుంది. ఆకాశంలో కలిసిపోయినట్టుగా మనకు ఎందుకు అనిపిస్తుంది? బహుశా… మనకు, ఆకాశానికి మధ్య మనం అనుకున్నంత దూరం లేకపోవచ్చు. ఒక్కసారి మీ చేతిని చూడండి. చర్మం. ఎముకలు. రక్తం. మెదడు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? మీ తల్లిదండ్రుల నుంచి. వారి తల్లిదండ్రుల నుంచి. అలా వెనక్కి వెళ్తూ పోతే… జీవ పరిణామం దగ్గరకు చేరుతాం.
అక్కడి నుంచి భూమి దగ్గరకు. భూమి నుంచి సౌర వ్యవస్థ దగ్గరకు. అక్కడి నుంచి నక్షత్రాల దగ్గరకు. ఇంకా వెనక్కి వెళ్తే… విశ్వం దగ్గరకు. అంటే మీరు మీ శరీరం గురించి ప్రశ్న అడిగితే… ఆ ప్రశ్న మిమ్మల్ని చివరికి విశ్వం దగ్గరకు తీసుకెళ్ళి ఆపుతుంది. ఇదే ఈ కథలోని మొదటి మలుపు. మనకు కనిపించే విశ్వం ఒకప్పుడు నక్షత్రాలు లేని దశలో ఉంది.
కాలం గడిచింది. వాయువులు చేరాయి. మొదటి నక్షత్రాలు వెలిగాయి. నక్షత్రాల లోపల అణు సంయోగ ప్రక్రియలు జరిగాయి. కొత్త మూలకాలు ఏర్పడ్డాయి. కొన్ని భారీ నక్షత్రాలు చివరికి తమ జీవితాన్ని ముగించాయి. వాటి మరణం, పేలుళ్లు, నక్షత్ర గాలులు… అంతరిక్షంలోకి పదార్థాన్ని చల్లాయి. ఆ పదార్థం తర్వాతి తరాల నక్షత్రాలు, గ్రహాల నిర్మాణంలో భాగమైంది. అలా ఒక దశలో… ఒక చిన్న గ్రహం ఏర్పడింది. భూమి. నీరు వచ్చింది. వాతావరణం ఏర్పడింది. రసాయనాలు సంక్లిష్టమయ్యాయి. ఎక్కడో, ఎప్పుడో… జీవానికి దారితీసిన ప్రక్రియలు మొదలయ్యాయి.
మొదట జీవంకి తన గురించి ఏమీ తెలియదు. అది కేవలం జీవించింది. తింది. పెరిగింది. పునరుత్పత్తి చేసుకుంది. పరిణామం చెందింది. కానీ కోట్ల సంవత్సరాల ప్రయాణం తర్వాత… జీవంలో మరో విచిత్రమైన లక్షణం పుట్టింది. అది తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మాత్రమే కాదు… తనను తాను కూడా గమనించడం మొదలుపెట్టింది. ఇదే చైతన్యం. మొదట భయపడింది. తర్వాత ఆశ్చర్యపోయింది. ఆ తర్వాత… ప్రశ్నలు అడగడం మొదలుపెట్టింది.
నక్షత్రాలు ఎందుకు ఉన్నాయి? గ్రహాలు ఎలా పుట్టాయి? విశ్వం ఎప్పుడు మొదలైంది? దానికి అంతం ఉందా? ప్రకృతి ఎందుకు కొన్ని నియమాలను పాటిస్తుంది? అసలు ఈ నియమాలు ఎందుకు ఉన్నాయి?
అలాగే ఇవన్ని అడుగుతున్న మనిషి విశ్వం బయట నిలబడి విశ్వాన్ని పరిశీలించడం లేదు. మనిషి స్వయంగా విశ్వంలో భాగం. ఇక్కడే “The Strange Loop” మొదలవుతుంది. విశ్వం నుంచి వచ్చిన పదార్థం… విశ్వాన్ని పరిశీలిస్తోంది. అంటే… ఒక అర్థంలో, విశ్వం తన గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తోంది. అదే మనకు తెలియకుండానే మనం మన మూలాన్ని గుర్తు చేసుకుంటున్న క్షణం కావచ్చు. మనకు, విశ్వానికి మధ్య గీత కాసేపు చెరిగిపోవడం కావచ్చు. ఎందుకంటే మనమే ఈ విశ్వం.
ఫైనల్ గా…
“మనం విశ్వాన్ని చూస్తున్నామని అనుకుంటాం. కానీ ఒక కోణంలో చూస్తే… విశ్వమే తనను తాను మన కళ్లతో చూస్తోంది.” ఇదే Strange Loop.








