ఇంట్లోనే పెంచే 6 హెర్బ్స్.. ఆరోగ్యానికి కూడా బోలెడు లాభాలు!
వంటల్లో రుచి, సువాసన పెంచేందుకు ఉపయోగించే కొన్ని హెర్బ్స్ మార్కెట్లో విరివిగా లభిస్తాయి. అవసరానికి మించి కొనుగోలు చేస్తే అవి త్వరగా వాడిపోవడం, మళ్లీ కొనాల్సి రావడం సాధారణమే. అయితే కొద్దిపాటి స్థలం, ఒకటి రెండు కుండీలు, సరైన వెలుతురు ఉంటే ఈ హెర్బ్స్‌లో చాలావాటిని ఇంట్లోనే సులభంగా పెంచుకోవచ్చు. అవసరమైనప్పుడు తాజా ఆకులను కోసుకుని వంటల్లో ఉపయోగించుకోవడంతో పాటు తరచూ ప్యాకెట్లు కొనుగోలు చేసే ఖర్చును కూడా తగ్గించుకోవచ్చు. ఇంటి బాల్కనీ లేదా కిటికీ పక్కనే పెంచుకోగల ఆరు విలువైన హెర్బ్స్ ఇవే.
బాసిల్ పెంపకం

బాసిల్ (Basil) ఇంట్లో సులభంగా పెంచుకోగల మొక్కల్లో ఒకటి. పాస్తా, సూప్‌లు, సలాడ్లు వంటి వంటకాలకు ఇది మంచి సువాసనను ఇస్తుంది. రోజుకు కొన్ని గంటలు సూర్యకాంతి అందే ప్రదేశంలో ఉంచి, మట్టి పూర్తిగా ఎండిపోకుండా నీరు పోస్తే చాలు. పైభాగంలోని ఆకులను తరచుగా కోయడం వల్ల కొత్త కొమ్మలు పెరుగుతాయి..
రోజ్మేరీ సంరక్షణ

రోజ్మేరీ (Rosemary) ఈ మొక్కను ఇంట్లో పెంచుకుంటే చాలా కాలం ఉపయోగించుకోవచ్చు. దీనికి నీరు ఎక్కువగా అవసరం ఉండదు. నీరు నిలిచిపోని మట్టి, మంచి సూర్యకాంతి ఉంటే చక్కగా పెరుగుతుంది. బంగాళాదుంపలు, కూరగాయలు, సూప్‌లు, బేక్ చేసిన వంటకాలకు దీని ఆకులు ప్రత్యేకమైన రుచిని ఇస్తాయి.
థైమ్, ఒరిగానో

థైమ్ (Thyme) కూడా తక్కువ స్థలంలో పెంచుకోవడానికి అనువైన హెర్బ్. చిన్న కుండీలోనే పెంచవచ్చు. మితమైన నీరు, తగినంత వెలుతురు అందిస్తే చాలు. దీని ఆకులను తాజాగానే కాకుండా ఎండబెట్టి కూడా కొంతకాలం నిల్వ చేసుకోవచ్చు. కూరగాయలు, సూప్‌లు, పాస్తా, ఇతర వంటకాల్లో రుచిని పెంచేందుకు ఉపయోగిస్తారు.
ఒరిగానో (Oregano) ఇటాలియన్ వంటకాల్లో విస్తృతంగా ఉపయోగించే హెర్బ్. పిజ్జా, పాస్తా, సలాడ్లు, సూప్‌లకు ఇది మంచి సువాసనను అందిస్తుంది. చిన్న కుండీలో పెంచుకోవచ్చు. మొక్క కొద్దిగా పెరిగిన తర్వాత కొమ్మలను కత్తిరించడం వల్ల మరింత దట్టంగా పెరిగే అవకాశం ఉంటుంది.
మింట్, సేజ్ మొక్కలు

మింట్ (Mint) మన ఇళ్లలో సులభంగా పెంచుకోగల మరో ఉపయోగకరమైన మొక్క. పుదీనా టీ, చట్నీలు, రైస్ వంటకాలు, పానీయాల్లో విరివిగా ఉపయోగిస్తారు. ఇది వేగంగా విస్తరించే స్వభావం కలిగి ఉండటంతో ప్రత్యేకమైన కుండీలో పెంచడం మంచిది. మట్టిలో తేమ ఉండేలా చూసినా, నీరు నిలిచిపోకుండా జాగ్రత్త పడాలి.
సేజ్ (Sage) సాధారణ వంటింటి మొక్క కాకపోయినా, కొన్ని ప్రత్యేక వంటకాల్లో దీనికి మంచి డిమాండ్ ఉంటుంది. సేజ్‌కు మంచి వెలుతురు, నీరు సులభంగా బయటకు వెళ్లే మట్టి అవసరం. మొక్కను ఒకసారి బాగా స్థిరపరిస్తే ఆకులను అవసరానికి అనుగుణంగా కోసుకుని ఉపయోగించుకోవచ్చు.
ఇలా మార్కెట్లో ఖరీదుగా లేదా తక్కువ పరిమాణంలో లభించే హెర్బ్స్‌ను ఇంట్లోనే పెంచుకుంటే వంటకు అవసరమైనప్పుడు తాజాగా కోసుకుని ఉపయోగించే అవకాశం ఉంటుంది. అంతేకాదు, ఇంటి బాల్కనీ లేదా కిటికీ పక్కన పచ్చదనం పెరగడంతో పాటు మొక్కల సంరక్షణ ఒక మంచి అలవాటుగా కూడా మారుతుంది.








