Jamais Vu లాంటి వింత పరిస్థితి మీకెప్పుడైనా వచ్చిందా?
—సూర్య ప్రకాష్ జోశ్యుల
ఓ రోజు రాత్రి.
మీరు మీ ఇంటి తలుపు తీసి లోపలికి వెళ్లారు.
అదే ఇల్లు. అదే గోడలు. అదే సోఫా. టేబుల్ మీద ఎప్పటిలాగే మీ కీస్ ఉన్నాయి. అన్నీ మీకు తెలుసు.
అంతలో హాల్లో ఒక మహిళ కనిపిస్తుంది. ఆమె మిమ్మల్ని చూసి నవ్వుతుంది. “వచ్చారా?” ఆ గొంతు మీకు పరిచయమే. అయితే ఆమె ఎవరో మాత్రం గుర్తు రావడం లేదు. మీరు ఆమెను చూస్తూనే ఉంటారు.
ఆమె దగ్గరకు వస్తుంది. “ఏమైంది?” అని అడుగుతుంది. మీరు సమాధానం చెప్పలేరు. ఎందుకో తెలియదు. కానీ లోపల ఒక చిన్న భయం మొదలవుతుంది. ఈమె నా ఇంట్లో ఎందుకు ఉంది? ఆమె మీ దగ్గరకు వచ్చి మీ చేయి పట్టుకోబోతుంది. మీరు ఒక్కసారిగా చేయి వెనక్కి తీసుకుంటారు. ఆమె ముఖంలో అయోమయం.మీ గుండెల్లో భయం. అప్పుడు మీ చూపు గోడపై ఉన్న ఒక ఫొటోపై పడుతుంది.
మీరు. ఆమె. మీ పిల్లాడు. ఆ ఫొటోను చూస్తూనే మెదడులో ఏదో ఒక్కసారిగా క్లిక్ అవుతుంది. “అరే… ఈమె నా భార్య.” ఆమె పేరు గుర్తొస్తుంది. ఆమెతో గడిపిన సంవత్సరాలు గుర్తొస్తాయి. ఆ ఇల్లు మళ్లీ మీ ఇల్లులా అనిపిస్తుంది. అంతా మామూలైపోతుంది.
కానీ ఆ కొన్ని సెకన్లలో అసలు ఏం జరిగింది?
మీరు ఆమెను మర్చిపోలేదు. ఆమె పేరు మీ జ్ఞాపకం నుంచి చెరిగిపోలేదు. మీ వివాహం గురించి మీకు తెలియకుండా పోలేదు. అయితే… మీకు అత్యంత పరిచయమైన మనిషి ఒక్కసారిగా పరాయివాడిలా ఎందుకు అనిపించాడు? ఇలాంటి విచిత్రమైన అనుభూతికి ఒక పేరు ఉంది. అదే Jamais Vu. ఫ్రెంచ్లో Jamais Vu అంటే “ఎప్పుడూ చూడనిది”.
Déjà Vu గురించి వినే ఉంటారు. అందులో కొత్తగా జరుగుతున్న సంఘటన ఇదివరకే జరిగినట్టుగా అనిపిస్తుంది. Jamais Vuలో మాత్రం దానికి పూర్తి వ్యతిరేకం. ఎన్నిసార్లో చూసినదే… మొదటిసారి చూసినట్టుగా అనిపిస్తుంది.
ఎందుకిలా జరుగుతుంది?
సాధారణంగా మన మెదడు అలా పనిచేయదు. మన కళ్ల ముందు కనిపించే ప్రతి వస్తువును ప్రతిసారీ మొదటిసారి చూస్తున్నట్టుగా ప్రాసెస్ చేస్తే… మన జీవితమే గందరగోళంగా మారిపోతుంది. అందుకే మెదడు ఒక తెలివైన పని చేస్తుంది. ఇంతకుముందు చూసినదాన్ని గుర్తుపెట్టుకుంటుంది. దాని రూపాన్ని, దానితో ఉన్న అనుభవాన్ని, దాని అర్థాన్ని కలిపి “ఇది నాకు తెలుసు” అనే ఒక పరిచయ భావనను తయారు చేస్తుంది.
ప్రతిరోజూ కనిపించే మీ ఇంటిని చూసినప్పుడు..“ఇది నాలుగు గోడలు, ఒక తలుపు, కొన్ని కిటికీలు” అని కొత్తగా విశ్లేషించాల్సిన అవసరం ఉండదు. మెదడు వెంటనే చెబుతుంది— “ఇది నా ఇల్లు.” మీ భార్యను చూసినప్పుడు కూడా ఆమె ముఖంలోని ప్రతి లక్షణాన్ని మొదటి రోజు చూసినట్టుగా విశ్లేషించదు. గుర్తిస్తుంది.
“ఈమె నాకు తెలిసిన మనిషి.” అని చెప్తుంది. అదే విధంగా మన కారు, మన రోడ్డు, మన ఆఫీస్, మన పేరు… మన చుట్టూ ఉన్న ప్రపంచంలో చాలా భాగాన్ని మెదడు ముందే గుర్తించి, పరిచయమైనదిగా మనకు అందిస్తుంది. అంటే మనం ప్రపంచాన్ని ప్రతిరోజూ కొత్తగా చూడటం లేదు. మన మెదడు గతాన్ని ఉపయోగించి… వర్తమానాన్ని పరిచయం చేస్తోంది. ఇది సరిగ్గా పనిచేస్తున్నంతకాలం మనకు ఆ ప్రక్రియ కనిపించదు.
కానీ ఒక్క క్షణం…
ఆ పరిచయాన్ని ఇచ్చే ప్రక్రియలోనే చిన్న తడబాటు వస్తే? అప్పుడు…తెలిసినదే తెలియనిదిగా మారుతుంది. ఇదే Jamais Vuలోని అసలు వింత. ఇది కేవలం మనుషుల విషయంలోనే కాదు. రోజూ వెళ్లే రోడ్డు ఒక్కసారిగా కొత్తగా అనిపించవచ్చు. ఎన్నిసార్లో చదివిన పదం అర్థం లేని అక్షరాల సమూహంలా కనిపించవచ్చు. మన సొంత పేరే పరాయి పదంలా అనిపించవచ్చు.అంటే AIలా మన మెదడు కూడా ‘Overload’ అవుతుంది. అప్పుడు జరిగేది ఇదే.
ఈ విషయమై న్యూరోసైకాలజిస్టులు అకీరా ఓ’కానర్, క్రిస్ మౌలిన్ వంటి పరిశోధకులు ప్రయోగాలు చేశారు. వాళ్లు చేసిన ప్రయోగం చాలా సింపుల్. విద్యార్థులకు తెలిసిన ఒకే పదాన్ని పదేపదే రాయమన్నారు.అలా రాస్తూంటే ఒక దశలో ఆ పదం తమకు విచిత్రంగా అనిపిస్తే రాయడం ఆపేయమన్నారు. దాదాపు 70 శాతం మంది నిజంగానే ఆపేశారు. సగటున ఒక నిమిషం… లేదా సుమారు 33 సార్లు ఆ పదాన్ని రాసిన తర్వాత ఇలా జరిగింది.
ఈ విషయంలో అత్యంత సులభమైన ప్రయోగం మనమే చేసుకోవచ్చు. ఒక కాగితం తీసుకోండి. మీ పేరు రాయండి. మళ్లీ రాయండి. మళ్లీ.అలా 20, 30 సార్లు రాస్తూ ఉండండి. కొంతసేపటికి ఆ పదాన్ని చూస్తే… “ఇది నిజంగా నా పేరేనా?” అనే వింత అనుమానం రావచ్చు. అక్షరాలు తప్పుగా ఉండవు. పేరు కూడా అదే.
కానీ దాని అర్థం, దాని పరిచయం కాసేపు దూరమైనట్టుగా అనిపిస్తుంది. పరిశోధకులు ఇదే విషయాన్ని ప్రయోగశాలలో పరీక్షించి నిరూపించారు.
దీని వల్ల నష్టమా..
సాధారణంగా ఈ పరిస్దితులు వల్ల, లాభ, నష్టాలు ఏమీ లేదు. అయితే ఇలాంటి అనుభవాలు తరచుగా రావడం, ఎక్కువసేపు కొనసాగడం లేదా ఇతర neurological లక్షణాలతో కలిసి ఉండటం సాధారణ Jamais Vuగా తీసుకోకూడదు.
ఫైనల్ గా..
మన మెదడు మనకు కనిపించే ప్రపంచాన్ని కేవలం చూపించదు. ముందుగా గుర్తిస్తుంది, పరిచయం చేస్తుంది. ఒక క్షణం ఆ గుర్తింపు తప్పిపోతే… మనకు తెలిసిన ప్రపంచమే కొత్తగా కనిపిస్తుంది. మొదటి సారి చూసినట్లుగా అనిపిస్తుంది. అంతే.








