బనకచర్లకు బ్రేక్.. రేవంత్ రెడ్డి విజయమేనా..?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన పోలవరం–బనకచర్ల నదీ అనుసంధాన ప్రాజెక్టు ప్రతిపాదనలను కేంద్ర పర్యావరణ శాఖకు చెందిన నిపుణుల అప్రైజల్ కమిటీ తిరస్కరించి వెనక్కి పంపడం తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారింది. ఈ నిర్ణయం వెలువడిన వెంటనే రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా వేడి రాజుకుంది. దీన్ని సీఎం రేవంత్ రెడ్డి సాధించిన విజయంగా కాంగ్రెస్ శ్రేణులు జోరుగా ప్రచారం చేసుకుంటున్నాయి. అయితే ఈ రాజకీయ క్రెడిట్ వార్ వెనుక ఉన్న సాంకేతిక, చట్టపరమైన కోణాలను పరిశీలిస్తే అసలు విషయం బోధపడుతుంది.
బనకచర్లకు బ్రేక్ పడడాన్ని కాంగ్రెస్ వర్గాలు తమ ప్రభుత్వ పొలిటికల్ విక్టరీగా వర్ణిస్తున్నప్పటికీ, ఇది కేవలం రాజకీయ పోరాటం వల్ల వచ్చిన ఫలితం కాదు. గోదావరి జలాల తరలింపుపై తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు వ్యక్తపరిచిన తీవ్ర అభ్యంతరాలు, గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్ నిబంధనలే ఇక్కడ కీలక భూమిక పోషించాయి. కింది, ఎగువ రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడాల్సిన రాజ్యాంగ బాధ్యత కేంద్రంపై ఉండటంతోనే ఈ నిర్ణయం తీసుకుంది. కాబట్టి తెలంగాణ వేసిన ఒత్తిడి ఒక కారణమే అయినప్పటికీ, ఇది కేవలం ఒక నేత విజయం కంటే చట్టబద్ధమైన సాంకేతిక కారణాల వల్ల జరిగిన సహజసిద్ధ పరిణామంగా చూడాలి.
కేంద్ర నిపుణుల కమిటీ ప్రతిపాదనలను తిప్పి పంపడం అంటే ప్రాజెక్టు శాశ్వతంగా రద్దయినట్లు కాదని గ్రహించాలి. ఏ మెగా నదీ అనుసంధాన ప్రాజెక్టుకైనా ఒక చట్టబద్ధమైన కార్యాచరణ ఉంటుంది. కేంద్ర జల సంఘం (CWC) ద్వారా శాస్త్రీయంగా నీటి లభ్యత ధృవీకరణ పొందకుండానే పర్యావరణ అనుమతుల కోసం వెళ్లడమే ఏపీ ప్రభుత్వ పరంగా జరిగిన ప్రాథమిక సాంకేతిక లోపం. ఒకవేళ సరైన అనుమతులు లేకుండా ముందడుగు వేస్తే, భవిష్యత్తులో గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) లేదా సుప్రీంకోర్టు పరిధిలో పిటిషన్లు దాఖలై ప్రాజెక్టుపై శాశ్వత స్టే వచ్చే ప్రమాదం ఉంది. ఈ కోణంలో చూస్తే, కేంద్రం నిర్ణయం ప్రాజెక్టుకు మున్ముందు ఎదురయ్యే లీగల్ చిక్కులను నివారించే ముందస్తు రక్షణ చర్యగానే ఉపయోగపడుతుంది.
రాయలసీమ దాహార్తిని తీర్చేలా గోదావరి నుంచి 200 టీఎంసీల వరద నీటిని మళ్లించి, దాదాపు 80 లక్షల మందికి తాగునీరు, 3 లక్షల హెక్టార్లకు సాగునీరు అందించడం ఆంధ్రప్రదేశ్‌కు అత్యంత వ్యూహాత్మక అవసరం. ఇటువంటి భారీ ప్రాజెక్టుల నిర్మాణంలో తొందరపాటు, రాజకీయ అజెండాల కంటే చట్టబద్ధమైన అడుగులే ముఖ్యం. ఈ దిశగా అన్ని చిక్కుముడులను విప్పుకుంటూ అడుగులు వేసేందుకు ఏపీ ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. ఈ విషయంలో తెలంగాణ కాంగ్రెస్ వైఖరి తొందరపాటు అనే చెప్పొచ్చు.








