మూడు సినిమాలు.. మూడు స్ట్రాటజీలు: బాక్సాఫీస్‌లో గెలిచేదెవరు?
ఒకప్పుడు కొత్త సినిమా వస్తోందంటే నెల ముందు నుంచే ప్రిపరేషన్స్ మొదలయ్యేవి. అలాగే సినిమా కు వెళ్లాలి అనిపించటానికి కూడా పెద్దగా కారణాలు వెతికేవారు కాదు. హీరో నచ్చాడు. ట్రైలర్ బాగుంది. ఫ్రెండ్స్ వెళ్తున్నారు. అంతే… ఇలాంటి కారణాలు చాలు. టికెట్ బుక్ చేసుకునేవాళ్లు. కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితి మారిపోయింది.
“థియేటర్లోనే చూడాలా? కొంచెం ఆగితే OTTలో వస్తుందిగా…”,
ఇది ఇప్పుడు చాలా మంది ప్రేక్షకుల మనసులో ముందుగా వచ్చే ఆలోచన. అందుకే ఒక సినిమాకు హిట్ టాక్ రావడం కంటే ముందు, అది ప్రేక్షకుడిని థియేటర్ని లాక్కు రావడానికి సరైన కారణం ఇవ్వగలగాలి.
ఎందుకంటే కోవిడ్ తర్వాత ఈ మార్పు మరింత స్పష్టంగా కనిపిస్తోంది. ఇంట్లోనే కొత్త సినిమాలు చూసే అవకాశం పెరిగింది. టికెట్ ధరలు, పార్కింగ్, ఫుడ్ ఖర్చులు కలిపి థియేటర్‌కు వెళ్లడం ఒక చిన్న ఫ్యామిలీ ఈవెంట్‌గా మారింది. దాంతో ప్రేక్షకుడు కూడా తన ఎంపికలో మరింత సెలెక్టివ్ అయ్యాడు.
“సినిమా బాగుంటుందా?” అనేది ఇప్పుడు ఒక్కటే ప్రశ్న కాదు. “ఈ సినిమాను థియేటర్లోనే ఎందుకు చూడాలి?” అనేదే అసలు ప్రశ్నగా మారింది. ఈ మారిన ప్రేక్షకుడి ముందుకు ఇప్పుడు మూడు వేర్వేరు సమాధానాలతో మూడు సినిమాలు వస్తున్నాయి.
ఒకటి అంటోంది “నా కథ విను.”
మరొకటి అంటోంది… “నా ఎమోషన్ ని ఫీల్ అవ్వు.”
ఇంకొకటి చెబుతోంది… “నా విజువల్స్‌ను పెద్ద స్క్రీన్‌పై చూడు.”.మూడు సినిమలు మూడు విభిన్నమార్గాలు ఎంచుకున్నాయి. ఆ మూడు సినిమాలే విశ్వనాథ్ & సన్స్, ఇరుముడి, టాక్సిక్.
ఈ మూడు సినిమాలు. మూడు వేర్వేరు ఫార్ములాలు. కానీ ప్రేక్షకుడి ప్రశ్న మాత్రం ఒక్కటే…
“నా టికెట్ డబ్బుకు ఏ సినిమా నిజంగా న్యాయం చేస్తుంది?” అని. ఇదే ఇప్పుడు ఈ మూడు సినిమాల బాక్సాఫీస్ పోటీని ఆసక్తికరంగా మారుస్తున్న విషయం.
ఓపెనింగ్ ఎవరిది? లాంగ్ రన్ ఎవరిది?
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చూస్తే… ఓపెనింగ్ పరంగా టాక్సిక్‌కు పైచేయి అయ్యేటట్లు కనిపిస్తోంది. ఎందుకంటే మొదటి రోజు ప్రేక్షకుడిని థియేటర్‌కు తీసుకురావడానికి స్టార్ పవర్, హైప్, పాన్ ఇండియా అట్రాక్షన్, విజువల్ స్కేల్ అన్నీ ఉన్నాయి.
అయితే సస్టెయినబిలిటీ విషయంలో మాత్రం విశ్వనాథ్ & సన్స్‌కు మంచి అవకాశం ఉంది. ఎందుకంటే కంటెంట్ కనెక్ట్ అయితే ఫ్యామిలీ ఆడియన్స్, మౌత్ టాక్, రిలేటబిలిటీ సినిమాను ముందుకు తీసుకెళ్లగలవు.
ఇరుముడి మాత్రం వైల్డ్ కార్డ్. ఎమోషన్ అనుకున్న స్థాయిలో వర్కవుట్ అయితే అంచనాలను దాటిపోవచ్చు.
అయితే ఇక్కడో విషయం గుర్తు పెట్టుకోవాలి, ప్రేక్షకుడు ఇప్పుడు సినిమాను కేవలం సినిమా కోసం చూడటం లేదు.
తన సమయానికి విలువ ఇవ్వాలి. తన డబ్బుకు విలువ ఇవ్వాలి. తన కుటుంబంతో వెళ్లినప్పుడు మంచి ఎక్సపీరియన్స్ ఇవ్వాలి. అంటే ఇంట్లో OTTలో చూసే అవకాశం ఉన్నప్పుడు థియేటర్‌కు వెళ్లడానికి ఒక బలమైన కారణం కావాలి.
అందుకే 2026 బాక్సాఫీస్‌లో అసలు పోటీ… స్టార్ vs స్టార్ కాదు. హైప్ vs కంటెంట్ కూడా కాదు. అసలు పోటీ… “థియేటర్‌కు రావడానికి ప్రేక్షకుడికి మీరు ఇచ్చే కారణం” vs “ఇంట్లోనే ఉండిపోవడానికి అతని దగ్గర ఉన్న కారణం.” ఆ పోటీలో ఎవరు గెలుస్తారనేది
మొదటి రోజు కలెక్షన్లు చెబుతాయి. కానీ ఎవరి సినిమా నిజంగా గెలిచిందో మాత్రం మొదటి వీకెండ్ తర్వాత ప్రేక్షకుడి మాట చెబుతుంది.








