వాహనంలో మార్పులు చేస్తున్నారా? బీమా క్లెయిమ్‌లో ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
కొత్త వాహనం కొనుగోలు చేసిన తర్వాత దానికి అదనపు హంగులు అద్దడం, మరింత ఆకర్షణీయంగా కనిపించేలా మార్పులు చేయడం సహజం. అయితే ‘చిన్నచిన్న మార్పులే కదా.. ఏమవుతుందిలే’ అని నిర్లక్ష్యం చేస్తే, భవిష్యత్తులో ప్రమాదాలు జరిగినప్పుడు బీమా (Insurance) క్లెయిమ్‌లు తిరస్కరణకు గురయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి ఆర్థిక నష్టాల బారిన పడకుండా ఉండాలంటే వాహనదారులు కొన్ని కీలక సూచనలు పాటించాలి.
ముందస్తు చర్యలు తప్పనిసరి
ఆర్సీలో నమోదు: వాహనం కొనుగోలు చేసినప్పుడు ఉన్న మాన్యుఫ్యాక్చరింగ్ వివరాలే రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (RC)లో ఉంటాయి. ఏవైనా అదనపు మార్పులు చేసినా వెంటనే ఆర్సీలో అప్డేట్ చేయాలి.
బీమా సంస్థకు సమాచారం: వాహనంలో మార్పులు చేయాలనుకుంటే, ముందుగా బీమా సంస్థకు తెలియజేసి పాలసీలో కూడా ఆ మార్పుల వివరాలను కచ్చితంగా నమోదు చేయించాలి.
కీలక మార్పులు: పెట్రోల్ లేదా డీజిల్ కారును ఎల్పీజీ/సీఎన్జీకి మార్చినప్పుడు రవాణాశాఖ అధికారులను సంప్రదించి ఆ వివరాలను ఆర్సీలో నమోదు చేసి, బీమా కంపెనీ దృష్టికి తీసుకెళ్లాలి. ఇలా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదం జరిగినప్పుడు ఎలాంటి ఆటంకం లేకుండా (Insurance) క్లెయిమ్ వస్తుంది.
క్లెయిమ్ రిజెక్ట్ అయ్యే పొరపాట్లు ఇవే..
అద్దెకు తిప్పితే నష్టమే: సొంత (వ్యక్తిగత) అవసరాల కోసం కొన్న వాహనాలను అద్దెకు నడుపుతుంటే, ప్రమాదం జరిగినప్పుడు బీమా సంస్థలు పరిహారం చెల్లించవు. అద్దెకు నడిపే వాహనాలు కమర్షియల్ కేటగిరీ కిందకు వస్తాయి కాబట్టి వాటికి కమర్షియల్ బీమా తీసుకోవాలి.
బస్సుల్లో మార్పులు: ట్రావెల్స్ కోసం బస్సులను కొనుగోలు చేసి వాటిని స్లీపర్‌గా మారుస్తుంటారు. కానీ ఆర్సీలో సీటింగ్ కెపాసిటీ ఉండి, వాస్తవానికి స్లీపర్‌గా ఉంటే ప్రమాదం జరిగినప్పుడు బీమా (Insurance) వర్తించదు.
పాలసీ వివరాలు స్పష్టంగా తెలుసుకోవాలి
రెన్యువల్ మర్చిపోవద్దు: కొత్త కారు కొనేటప్పుడు మూడేళ్ల కాలవ్యవధికి బీమా (Insurance) చేస్తారు. అయితే ప్రీమియం తగ్గించుకోవడానికి కొందరు తొలి ఏడాది సమగ్ర (Comprehensive) బీమా, ఆపై రెండేళ్లు థర్డ్ పార్టీ బీమా తీసుకుంటారు. ఆ తర్వాత బీమాను రెన్యువల్ చేయడం మర్చిపోతుంటారు. ఇలాంటి సందర్భాల్లో ప్రమాదం జరిగితే వాస్తవం తెలిసి పూర్తిస్థాయిలో నష్టపోతారు.
కస్టమర్ల ఇష్టం: డీలర్ల ఒత్తిడి మేరకు కాకుండా, తమకు నచ్చిన, సరైన కవరేజీ ఇచ్చే బీమా కంపెనీని ఎంచుకునే పూర్తి వెసులుబాటు వాహనదారులకు ఉంటుంది. ఒకవేళ తొలి ఏడాది కాంప్రహెన్సివ్ తీసుకున్నా, తర్వాత ఏడాదికి దాన్ని పూర్తిస్థాయి ఇన్సూరెన్స్‌గా మార్చుకునే అవకాశం కూడా ఉంటుంది.
బీమా పునరుద్ధరణపై నిర్లక్ష్యం
కొత్త బైక్ కొన్నప్పుడు ఐదేళ్ల కాలానికి, కారుకు మూడేళ్ల పాటు బీమా (Insurance) చేయించడం తప్పనిసరి. కానీ, ఆ గడువు ముగిసిన తర్వాత దాదాపు 40 శాతం మంది వాహనదారులు బీమాను పునరుద్ధరించడం (Renewal) లేదని గణాంకాలు చెబుతున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ నిర్లక్ష్యం ఎక్కువగా కనిపిస్తోంది. కాబట్టి సకాలంలో వాహన బీమాను రెన్యువల్ చేసుకోవడం అత్యంత ఆవశ్యకం.








