తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడి!
తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికరమైన సమరానికి తెరలేచింది. వచ్చే ఏడాది మార్చి నాటికి ఖాళీ కానున్న రెండు ముఖ్యమైన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకై ప్రధాన రాజకీయ పక్షాలు ఇప్పటినుంచే వ్యూహరచన మొదలుపెట్టాయి. మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ స్థానంతో పాటు వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు వచ్చే ఏడాది మార్చి 29తో పదవీకాలం ముగియనుంది. ప్రస్తుత ఎమ్మెల్సీలు సురభి వాణీదేవి, తీన్మార్ మల్లన్న స్థానాలు ఖాళీ కానున్నాయి. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ మూడో వారంలోనే ఓటర్ల ఎన్రోల్మెంట్ నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు ఉండటంతో, గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు కసరత్తు వేగవంతం చేశాయి.
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, ఈ రెండు పట్టభద్రుల స్థానాలను కైవసం చేసుకుని తమ పట్టును మరింత బలోపేతం చేసుకోవాలని భావిస్తోంది. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించారు. సెప్టెంబర్‌లోనే అభ్యర్థులను ఖరారు చేసి, వారిని క్షేత్రస్థాయికి పంపాలని ఢిల్లీ వేదికగా జరిగిన సమన్వయ కమిటీ భేటీలో నిర్ణయించారు.
నల్గొండ స్థానం నుంచి మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్ రెడ్డి, టూరిజం కార్పొరేషన్ మాజీ చైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి, కీలక ఉద్యోగ సంఘాల నేతలతో పాటు పీసీసీ నేత చనగాని దయాకర్ లతో సహా పలువురు ఆశావహులు టికెట్ రేసులో పోటీ పడుతున్నారు. ఇక హైదరాబాద్ స్థానంలోనూ గట్టి పోటీ నెలకొంది. పీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి, పీసీసీ నేతలు గౌరి సతీశ్, హర్షవర్ధన్ రెడ్డిలతో పాటు భాగ్యనగరానికి చెందిన ఒక జిల్లా అధ్యక్షుడు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్, మంత్రి పొన్నం ప్రభాకర్ ఇప్పటికే స్థానిక నేతల అభిప్రాయాలను సేకరిస్తున్నారు. ఓటర్లతో క్షేత్రస్థాయి అనుబంధం ఉన్నవారికే బి-ఫారమ్ ఇవ్వాలని పార్టీ గట్టి పట్టుదలతో ఉంది.
వరుస ఎన్నికల ఓటములతో ఆత్మరక్షణలో పడిన బీఆర్ఎస్ పార్టీ, ఈ పట్టభద్రుల ఎన్నికల ద్వారా పుంజుకోవాలని చూస్తోంది. విద్యావంతులు, ఉద్యోగులు ఎక్కువగా ఉండే హైదరాబాద్ స్థానంలో ఒక బిసి అధికారిని బరిలోకి దింపేందుకు ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం రైల్వే సర్వీస్‌లో ఉన్న ఉదయ్‌నాథ్ అనే అధికారిని బరిలోకి దింపే దిశగా కేటీఆర్ ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఆయనతో పాటు మరో రిటైర్డ్ బీఆర్ఎస్ అధికారి, సాట్స్ మాజీ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి, సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ కూడా పోటీ రేసులో ఉన్నారు. ఇక నల్గొండ స్థానం నుంచి ప్రజా పోరాటాల్లో చురుగ్గా ఉన్న పిడుగుల రాకేష్ రెడ్డి, దివ్యాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాసుదేవ రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలవారీగా కేటీఆర్ సమీక్షలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు ఓయూ జేఏసీ నేతలు కూడా బీఆర్ఎస్, కాంగ్రెస్ టికెట్ల కోసం తమ ప్రయత్నాలు తీవ్రం చేశారు.
ఇటీవల రెండు టీచర్ ఎమ్మెల్సీ స్థానాలను గెలుచుకోవడంతో పాటు, సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల, మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానాల్లో సాధించిన విజయాలు బీజేపీలో కొండంత ఉత్సాహాన్ని నింపాయి. ఈ క్రమంలో పట్టభద్రుల స్థానంలోనూ పట్టు సాధించాలని బిజెపి కమలం శిబిరం భావిస్తోంది. గతానికి భిన్నంగా ఈసారి హైదరాబాద్ స్థానం నుంచి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు మనవడు, పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్, మాజీ అధికార ప్రతినిధి సారంగల అమర్ నాథ్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వీరితో పాటు ఐటీ ఇంటెలెక్చువల్ సెల్ కన్వీనర్ వెంకట్ రెడ్డి, పార్టీ నేత పవన్ కుమార్ కూడా రేసులో ఉన్నారు. నల్గొండ స్థానానికి పార్టీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ కాసం వెంకటేశ్వర్లు, సీనియర్ నేతలు మనోహర్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. అభ్యర్థుల ఎంపికపై కమలనాథులు ఇప్పటికే ముమ్మర కసరత్తు ప్రారంభించారు.
మరోవైపు, పీఆర్టీయూ టీచర్ సంఘం కూడా ఈసారి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బరిలో నిలవాలని సంచలన నిర్ణయం తీసుకుంది. జనరల్ సెక్రటరీ సుంకరి భుజంగరావును బరిలోకి దించాలని యోచిస్తోంది. ఇప్పటికే టీచర్ ఎమ్మెల్సీగా పీఆర్టీయూ ప్రతినిధి శ్రీపాల్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తుండటంతో, ఉపాధ్యాయులు, వారి కుటుంబాల ఓట్లే లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా సమావేశాలు నిర్వహిస్తూ ఓటర్ల నమోదుపై అవగాహన కార్యక్రమాలు మొదలుపెట్టింది.
మార్చిలో జరగబోయే ఈ ఎమ్మెల్సీ సమరం కేవలం ఒక శాసనమండలి ఎన్నిక మాత్రమే కాదు, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పాలనకు, ప్రతిపక్ష బీఆర్ఎస్ పునరుజ్జీవనానికి, బిజెపి విస్తరణాకాంక్షకు ఒక పరీక్షగా మారనుంది. విద్యార్థి, నిరుద్యోగ, ఉద్యోగ వర్గాల తీర్పు ఏ పార్టీకి అనుకూలంగా ఉండబోతోందో వేచి చూడాలి!








