ఏఐ దెబ్బకు పెద్ద కంపెనీల్లో ఉద్యోగాల కోత: నందన్ నీలేకని
దేశంలో ఉపాధి అవకాశాలు, ఉద్యోగాల భవిష్యత్తుపై ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని (Nandan Nilekani) అత్యంత కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో భారీ కార్పొరేట్ కంపెనీలు కాకుండా, లక్షలాది చిన్న వ్యాపారాలే ఎక్కువ ఉద్యోగాలను సృష్టిస్తాయని ఆయన కుండబద్దలు కొట్టారు. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ (ఎన్సీఏఈఆర్) కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రభావాన్ని విశ్లేషించారు. పెద్ద సంస్థల్లో ఉద్యోగుల పనులు ఒకే మూసలో నిర్దిష్టంగా ఉంటాయని, వాటిని ఏఐ ద్వారా ఆటోమేట్ చేయడం చాలా సులభమని చెప్పారు. దీనివల్ల భవిష్యత్తులో ఇలాంటి భారీ కంపెనీలు నికరంగా ఉద్యోగాలను తగ్గించే పరిస్థితి రావచ్చని ఆయన హెచ్చరించారు.
ఉపాధికి కేంద్రంగా చిన్న వ్యాపారాలు
మరోవైపు చిన్న వ్యాపారాల్లో ఒకే ఉద్యోగి అనేక రకాల బాధ్యతలను ఏకకాలంలో నిర్వహిస్తాడని నీలేకని (Nandan Nilekani) వివరించారు. ఇలాంటి బహుముఖ పనుల కారణంగా అక్కడ ఏఐ ఆటోమేషన్ ప్రభావం చాలా తక్కువగా ఉంటుందని, రాబోయే రోజుల్లో ఉపాధి వృద్ధికి అవే ప్రధాన కేంద్రాలవుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఇందుకోసం చిన్న వ్యాపారాలకు నిబంధనలను మరింత సరళీకరించాలని, వారికి సులభంగా రుణాలు అందేలా చూడాలని సూచించారు. ముఖ్యంగా అకౌంట్ అగ్రిగేటర్ ఫ్రేమ్‌వర్క్ ద్వారా రుణాల లభ్యత మెరుగుపడుతుందని, ఓఎన్డీసీ (ONDC) వంటి ప్లాట్‌ఫామ్స్ చిన్న సంస్థలకు దేశవ్యాప్తంగా సరికొత్త మార్కెట్లను పరిచయం చేస్తాయని ఆయన అంచనా వేశారు.
‘ఏఐ యూజ్ కేస్ క్యాపిటల్’ దిశగా భారత్
కృత్రిమ మేధ విషయంలో భారత వ్యూహం ఇతర దేశాలకు భిన్నంగా ఉండాలని నీలేకని (Nandan Nilekani) సూచించారు. ఆధునిక చిప్స్, డేటా సెంటర్లు లేదా లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (LLMs) తయారీలో ప్రపంచ దేశాలతో పోటీ పడటం కంటే, అప్లైడ్ ఏఐపై దృష్టి పెట్టాలని స్పష్టం చేశారు. విద్య, వ్యవసాయం, ఆరోగ్య రంగాల్లో సామాన్య ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ఏఐని ఎలా వినియోగించాలనే దానిపైనే భారత్ ప్రధానంగా ఆలోచించాలన్నారు. భారతీయ స్థానిక భాషలు, వాయిస్ ఆధారిత ఇంటర్‌ఫేస్‌ల ద్వారా ఏఐని ప్రజలకు చేరువ చేస్తే, భారత్ ప్రపంచంలోనే ‘ఏఐ యూజ్ కేస్ క్యాపిటల్’గా ఎదుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
పోర్టబుల్ సామాజిక భద్రత
రాబోయే రోజుల్లో ఉద్యోగాల స్వరూపం శరవేగంగా మారుతున్న నేపథ్యంలో కార్మికుల భద్రతపై కూడా ఆయన (Nandan Nilekani) ప్రత్యేక దృష్టి సారించారు. ఉద్యోగులకు సంబంధించిన పెన్షన్, బీమా, ఆరోగ్య సంరక్షణ వంటి సామాజిక భద్రతా ప్రయోజనాలతో పాటు విద్యా అర్హత పత్రాలను ఒకే చోట పొందుపరచాలన్నారు. ఉద్యోగి ఏ సంస్థకు, ఏ ప్రాంతానికి మారినా ఆ వివరాలన్నీ వెంట తీసుకెళ్లేలా ఒక పోర్టబుల్ వ్యవస్థను పకడ్బందీగా రూపొందించాలని ప్రభుత్వానికి సూచించారు. దేశంలోని యువ జనాభా సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకోవాలంటే నాణ్యమైన విద్య, నైపుణ్యాల పెంపు, పారిశ్రామిక అవకాశాలు, కొత్త ఉద్యోగాల సృష్టిపై భారత్ ఏకకాలంలో దృష్టి పెట్టాలని ఆయన స్పష్టం చేశారు.








