వెంకటేష్‌ను ఎగ్జైట్ చేసిన కథ.. కానీ ఒక్క ఫ్లాష్‌బ్యాక్‌తో క్యాన్సిల్!
విక్టరీ వెంకటేష్(venkatesh) కెరీర్లో అనౌన్స్మెంట్ తర్వాత కూడా ఆగిపోయిన సినిమాల లిస్ట్ చిన్నదేమీ కాదు. కథలు ఫైనల్ కావడం, డిస్కషన్స్ పూర్తవడం, ఇండస్ట్రీలో వార్తలు రావడం వరకు వెళ్లిన కొన్ని సినిమాలు చివరికి సెట్స్ మీదికి వెళ్లలేదు. అలాంటి ప్రాజెక్టుల్లో డైరెక్టర్ త్రినాథరావు నక్కిన(Trinadh Rao Nakkina)తో చేయాల్సిన సినిమా కూడా ఒకటి. వరుస కమర్షియల్ సక్సెస్‌ల తర్వాత వెంకటేష్‌తో ఆయన సినిమా దాదాపు ఫిక్స్ అయిందనే ప్రచారం అప్పట్లో బలంగా వినిపించింది.
ఈ ప్రాజెక్టుపై ఇద్దరి మధ్య విస్తృతంగా స్టోరీ డిస్కషన్స్ జరిగాయని త్రినాథరావు తాజాగా వెల్లడించారు. రైటర్ ప్రసన్న కుమార్(Prasanna Kumar Bezawada) రెడీ చేసిన స్క్రిప్ట్ వెంకటేష్‌కు బాగా నచ్చిందని, ముఖ్యంగా తన క్యారెక్టర్ పట్ల ఆయన అసాధారణ ఆసక్తి చూపించారని చెప్పారు. పాత్రకు సంబంధించిన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, మేనరిజమ్స్ వంటి అంశాలపై తరచూ చర్చలు జరిపేవారని, ఇతర సినిమా షూటింగ్లలో కూడా ఆ క్యారెక్టర్ ను మనసులో పెట్టుకుని ప్రాక్టీస్ చేసిన సందర్భాలున్నాయని ఆయన వివరించారు.
అయితే కథలోని ఫ్లాష్‌బ్యాక్ విషయంలో ఇద్దరికీ పూర్తి సంతృప్తి కలగలేదని త్రినాథరావు స్పష్టం చేశారు. ఆ భాగాన్ని మరింత బలంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నించినప్పటికీ, ఆశించిన స్థాయిలో మార్పు రాకపోవడంతో ప్రాజెక్టు ఆలస్యమైందని చెప్పారు. అనంతరం అదే తరహా కథాంశంతో మరో హీరో సినిమా తెరకెక్కడంతో ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లే అవకాశం లేకుండా పోయిందని పేర్కొన్నారు. ప్రస్తుతం త్రినాథరావు నేను రెడీ(Nenu Ready) సినిమాపై దృష్టి సారించగా, వెంకటేష్ తన తదుపరి ప్రాజెక్టులతో బిజీగా కొనసాగుతున్నారు.








