భూ సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం! : చంద్రబాబు
కలిదిండి తహసీల్దార్ కార్యాలయంలో రైతులతో సీఎం చంద్రబాబు ముఖాముఖి
22-ఏ నుంచి మాజీ సైనికుల భూముల తొలగింపు
లబ్ధిదారులకు 1-బి ప్రతులు అందజేసిన ముఖ్యమంత్రి
దశాబ్ధాల నాటి సమస్యకు లభించిన పరిష్కారం
కైకలూరు, ఆగస్టు 10: ప్రజల భూ, రెవెన్యూ సమస్యలను స్వయంగా తెలుసుకుని, వాటికి అక్కడికక్కడే పరిష్కార మార్గం చూపుతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం కలిదిండిలో ‘మీ భూమి-మీ హక్కు’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. మొదట స్థానిక తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు. అక్కడ 22ఏ బాధితులతో ముఖ్యమంత్రి ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు తమ భూ, రెవెన్యూ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
మాజీ సైనికులకు ఊరట
మాజీ సైనికులతో సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా మాట్లాడారు. ఉద్యోగ విరమణ అనంతరం తమకు ప్రభుత్వం అందించిన భూములు 22-ఏ జాబితాలో చేర్చడంతో ఎదురవుతున్న ఇబ్బందులను వారు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. సమస్యను సావధానంగా విన్న సీఎం చంద్రబాబు.. సంబంధిత భూములను 22-ఏ జాబితా నుంచి తొలగించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. అదే విధంగా డీ నోటిఫికేషన్ ప్రక్రియను సులభతరం చేసేలా ఆర్డీఓకు అధికారాలను కల్పించాలని సూచించారు. అలాగే అసైన్డ్ భూములను పట్టా భూములుగా వర్గీకరించే ప్రక్రియను చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో తమ భూ సమస్యలకు పరిష్కారం లభించడంతో మాజీ సైనికులు, వారి కుటుంబ సభ్యులు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.
2,745 ఎకరాలకు విముక్తి
లబ్ధిదారులు మాట్లాడుతూ…కొన్నేళ్లుగా తాము ఎదుర్కొంటున్న భూ సమస్యలను ముఖ్యమంత్రికి వివరించారు గతంలో ఎన్నిసార్లు సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం లభించలేదని వివరించారు. ప్రస్తుత ప్రభుత్వం చేపట్టిన ‘మీ భూమి – మీ హక్కు’ కార్యక్రమం ద్వారా తమ భూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. భాస్కరరావుపేట, వైవాక, గురవయ్యపాలెం, ఉనికిలి, కలిదిండి గ్రామస్తులతో సీఎం మాట్లాడారు. వారి ఇబ్బందులను ఓపిగ్గా విన్న ముఖ్యమంత్రి.. సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తక్షణమే తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాలతో అధికారులు ఉనికిలి, కలిదిండి, వైవాకలోని 830 గ్రామాలకు సంబంధించి 2,745 ఎకరాలను రిజిస్ట్రేషన్‌కు విముక్తి కలిగించారు. దీంతో ఇప్పటి వరకు జిల్లాలో 4,977 ఎకరాలు 22ఏ నుంచి ప్రభుత్వం తొలగించింది. ఈ ప్రక్రియ అనంతరం సీఎం చంద్రబాబు నేరుగా లబ్ధిదారులకు 1బి అడంగల్ ప్రతులను అందజేశారు. భూ సమస్యలను స్వయంగా విని, సంబంధిత అధికారులకు అక్కడికక్కడే ఆదేశాలు ఇచ్చి సమస్య పరిష్కరించడంతో ఆయా గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.








