తెలంగాణ పొలంలో AI సెన్సేషన్! వరల్డ్ బ్యాంక్ మైండ్ బ్లోయింగ్ రిపోర్ట్!
AI అనగానే మనకి టన్నుల కొద్దీ డేటా, బిలియన్ డాలర్ల పెట్టుబడులు, OpenAI, Google లాంటి సిలికాన్ వ్యాలీ దిగ్గజాలే గుర్తొస్తాయి. అదే సమయంలో ఎవరి AI మోడల్ పెద్దది? ఎవరి కంప్యూటింగ్ పవర్ ఎక్కువ? అనే రేసులో ప్రపంచమంతా మునిగిపోయి ఉంది. కానీ, ప్రపంచ బ్యాంకు (World Bank) విడుదల చేసిన ‘వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2026’ ప్రపంచానికి ఒక సరికొత్త పాఠం నేర్పించింది.
ఆ కథ అమెరికా హైటెక్ ల్యాబ్‌లలో కాదు… మన తెలంగాణ పొలాల్లో మొదలైంది!
$560 ఆదా చేసిన చిన్న యాప్!
మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల చిన్న రైతులకు AI ఆధారిత వాతావరణ అంచనాలు అందించారు. ఎప్పుడు వర్షం పడుతుంది, ఎలాంటి వాతావరణ ముప్పులు రాబోతున్నాయో AI ముందుగానే ఖచ్చితంగా హెచ్చరించింది. దాంతో రైతులు ఆ వేళకప్పుడు తమ సాగు నిర్ణయాలు మార్చుకున్నారు. పంట నష్టపోకుండా రక్షించుకోవడమే కాకుండా… ఒక్కో రైతు సగటున 560 డాలర్లు (సుమారు ₹50,000 పైనే) ఆదా చేసుకోగలిగారు!
ఇక్కడ విషయం కేవలం ₹50 వేల పొదుపు మాత్రమే కాదు. ఏ డేటా సెంటర్ లేదా భారీ సర్వర్ల అవసరం లేకుండా… ఫోన్ లోని ఒక చిన్న AI టూల్ ఒక సన్మార్గపు నిర్ణయాన్ని నడిపించింది. అది ఆ రైతు ఆర్థిక పరిస్థితినే మార్చేసింది!
పరిమాణం కాదు.. ప్రభావమే ముఖ్యం: ‘Small AI’ విప్లవం
ప్రపంచ బ్యాంకు నివేదిక ఇదే విషయాన్ని గట్టిగా నొక్కి చెబుతోంది. AI గొప్పతనాన్ని అది ఎంత పెద్ద మోడల్ అనే దాంతో కొలవడం ఆపేసి, అది సగటు మనిషి జీవితంలో ఎంత విలువ సృష్టించిందనే దానితో కొలవాలి.
అభివృద్ధి చెందుతున్న దేశాలు బిలియన్ల డాలర్లు పోసి అతిపెద్ద AI మోడళ్లు నిర్మించడం వెనుక పడాల్సిన పనిలేదు. తక్కువ ఖర్చుతో, నిర్దిష్ట సమస్యలను పరిష్కరించే ‘Small AI’ అప్లికేషన్లను సమాజంలోకి విస్తరింపజేస్తే చాలు:
• రైతుకు సరిగ్గా వాతావరణ సూచనలిచ్చే AI
• చిన్న వ్యాపారికి సరుకుల డిమాండ్‌ను ముందుగా చెప్పే AI
• వరదలు, ప్రకృతి విపత్తులను ముందే గుర్తించే AI
• ప్రభుత్వ పథకాలు, పన్నుల లీకేజీలు అరికట్టే AI
మొదటి పారిశ్రామిక విప్లవాన్ని భారత్ లాంటి దేశాలు మిస్ అయ్యామని, ఆ తప్పును ఈ AI విప్లవంలో పునరావృతం చేయకూడదని వరల్డ్ బ్యాంక్ చీఫ్ ఎకనామిస్ట్ ఇన్డెర్మిట్ గిల్ హెచ్చరిస్తున్నారు.
భారత్‌కు బంగారు అవకాశం!
భారతదేశానికి ప్రపంచస్థాయి AI టాలెంట్ ఉంది. మరోవైపు కోట్లాది మంది రైతులు, చిన్న వ్యాపారులు ఉన్నారు. గ్లోబల్ రేసులో పోటీ పడటంతో పాటు… మన స్థానిక సమస్యలను తీర్చే AI పరిష్కారాలు సృష్టించడమే అసలైన గేమ్ ఛేంజర్.
AI విప్లవం అనేది డేటా సెంటర్ల క్లౌడ్లలో కాకుండా… తెలంగాణ రైతుల పొలాల్లో నిజమైన ప్రభావం చూపిస్తోంది! భవిష్యత్తు AI మోడల్ గొప్పతనంలో కాదు, కోట్లాది మంది చిన్న నిర్ణయాలను మార్చే చిన్న యాప్‌లలోనే ఉంది.
— సూర్య ప్రకాష్ జోశ్యుల








