ఒంగోలు పాలిటిక్స్‌లో హైడ్రామా.. సీరియస్ అయిన కూటమి అధిష్టానం..!
ఒంగోలు నియోజకవర్గంలో జనసేన(Janasena) సీనియర్ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, తెలుగుదేశం పార్టీ (TDP) ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్ మధ్య రేగిన రాజకీయ రగడ తీవ్ర స్థాయికి చేరింది. గత కొన్ని రోజులుగా ఇరువురు నేతలు ఒకరిపై ఒకరు మద్యం, ఇసుక వ్యాపారాలు, మున్సిపల్ కార్పొరేషన్ అవినీతిపై బహిరంగంగా ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. చివరికి కాణిపాకం ఆలయంలో ప్రమాణాల వరకూ ఈ వివాదం వెళ్లడం మరియు ఒకరినొకరు జైలుకు పంపుతామంటూ సవాళ్లు విసురుకోవడంతో కూటమి పరువు బజారున పడింది. దీంతో టీడీపీ, జనసేన పార్టీల అధినాయకత్వాలు ఈ వ్యవహారాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.
ఈ నేపథ్యంలో ఇరు పార్టీల సీనియర్ నేతలతో కూడిన కూటమి సమన్వయ కమిటీ అత్యవసరంగా టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి ఇద్దరి వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. టీడీపీ తరపున రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు, పల్లా శ్రీనివాస్.. అలాగే జనసేన తరపున మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ పంచాయితీలో కీలక పాత్ర పోషించారు. మంత్రి అచ్చెన్నాయుడు వెంటనే ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్‌తో ఫోన్లో మాట్లాడగా, జనసేన అగ్రనేతలు బాలినేని శ్రీనివాసరెడ్డికి ఫోన్ చేసి గట్టిగా క్లాస్ పీకారు.
స్థానికంగా ఎలాంటి సమస్యలు లేదా ఆరోపణలు ఉన్నా వాటిని నేరుగా పార్టీల అధినాయకత్వాల దృష్టికి తీసుకురావాలే తప్ప, మీడియా ముందు ఇలాంటి బహిరంగ విమర్శలు చేయడం తగదని సమన్వయ కమిటీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా, కూటమి శ్రేణుల్లో విభేదాలు సృష్టించేలా వ్యవహరిస్తే సహించేది లేదని ఇరు పార్టీల అధిష్టానాలు గట్టిగా హెచ్చరించాయి. భవిష్యత్తులో ఒంగోలు రాజకీయాల్లో ఇలాంటి ఘటనలు ఏమాత్రం పునరావృతం కాకూడదని, ఇద్దరు నేతలూ సంయమనం మరియు సమన్వయం పాటించాలని ఆదేశించాయి. హైకమాండ్ ఇచ్చిన ఈ గట్టి వార్నింగ్‌తో ప్రస్తుతానికి ఇరు వర్గాలు మౌనం దాల్చినప్పటికీ, ఈ ఇద్దరు కీలక నేతలు తమ వాదనలను వినిపించేందుకు త్వరలోనే అమరావతిలో అధిష్టాన పెద్దలను కలవడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం.








