రాంచీలో పట్టువదలని నిరసనకారులు.. లాఠీఛార్జీ, వాటర్ కేనన్స్ ప్రయోగంతో ఉద్రిక్తం
జార్ఖండ్ : రాంచీలో విద్యార్థులు చేపట్టిన ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. ఉద్యోగ నియామక పరీక్షల్లో అవకతవకలు, పేపర్ లీక్‌లపై చర్యలు తీసుకోవాలంటూ జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ అభ్యర్థులు, విద్యార్థులు అసెంబ్లీ ముట్టడికి బయల్దేరారు. సుమారు 6 నుంచి 7 వేల మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేట్లను కూడా తోసేసి, అసెంబ్లీ వైపు పరుగులు తీశారు. దీంతో తీవ్ర గందరగోళం నెలకొంది. వారిని అదుపు చేసేందుకు లాఠీఛార్జ్ కూడా చేశారు. కాగా, ఈ నిరసనల్లో పాల్గొనేందుకు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల నుంచి వేలాది మంది రైళ్లు, బస్సులు, ఇతర వాహనాల్లో రాంచీకి చేరుకున్నారు.
ఓ వైపు లాఠీఛార్జి చేయడంతో పాటు పోలీసులు నిరసనలకారుల్ని అదుపు చేయడానికి వాటర్ కెనన్లను కూడా ఉపయోగించడంతో మరింత వివాదం రేగింది. వాటర్ కేనన్లతో నీళ్లు చిమ్ముతుండగా.. కొందరు విద్యార్థులు నృత్యాలు చేస్తూ తమ నిరసనను కొనసాగించారు. మరోవైపు, లాఠీఛార్జ్ చేయగా పలువురికి తీవ్రగాయాలు అయ్యాయి. పోలీసుల చర్యలను లెక్కచేయని కొందరు విద్యార్థులు బారికేడ్లపైకి ఎక్కి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నియామక పరీక్షల్లో పేపర్ లీక్‌లు, అవకతవకలపై విద్యార్థులు మండిపడుతున్నారు.
ఓ వైపు భారీ వర్షం.. అయినా ఆగని నిరసనలు…
విద్యార్థులు, అభ్యర్థులు నిరసన వ్యక్తం చేస్తున్న సమయంలో విపరీతమైన వర్షం కురిసింది. అయినా సరే.. నిరసనకారులు చెదిరిపోకుండా, తమ నిరసనను వ్యక్తం చేస్తూనే వున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మరో వైపు ఆగస్టు 10 న సీఎం హేమంత్ సోరెన్ బర్త్ డే కూడా కావడంతో నిరసనకారులు.. అసెంబ్లీ ఎదుటే ‘‘హ్యాపీ బర్త్ డే టూ హేమంత్’’ అంటూ నినాదాలు కూడా చేశారు. విద్యార్థి నేత దేవేంద్రనాథ్ మహతో నేతృత్వంలో ఈ నిరసన కొనసాగింది.
ప్రభుత్వ ప్రతినిధి బృందంతో జరిగిన చర్చలలో ఇది రెండవ విడత. నిర్దిష్ట అంశాల విషయానికి వస్తే—ముఖ్యంగా 14వ JPSC, JPSC బ్యాక్లాగ్ 2023 మరియు JPSC బ్యాక్లాగ్ 2025 పరీక్షల విషయంలో—ఆ మూడింటినీ రద్దు చేసే అంశాన్ని పరిశీలించాలని ప్రభుత్వం నిర్ణయించింది.








