మారుమూల పల్లెల కోసం పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్..!
ఆంధ్రప్రదేశ్లోని మారుమూల గ్రామాలకు రవాణా కష్టాలు తీరబోతున్నాయి. రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Pawan Kalyan) పక్కా ప్రణాళికలతో రాష్ట్రంలో ‘ప్రగతి బాట’ పనులు ఊపందుకున్నాయి. ఇప్పటివరకు కనీసం సరైన దారి లేక ఇబ్బంది పడుతున్న రాష్ట్రంలోని మరో 158 ఆవాసాలకు తొలిసారిగా పక్కా రహదారి సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో నడిచే ‘ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన’ (PMGSY) పథకం కింద ఈ పనుల కోసం ఏకంగా రూ. 422.10 కోట్ల భారీ నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది.
ఈ నిధులతో రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలలో కనెక్టివిటీని పెంచేందుకు సమగ్ర కార్యాచరణ సిద్ధమైంది. ఈ భారీ నిధులతో మారుమూల పల్లెలను అనుసంధానిస్తూ మొత్తం 347 కిలోమీటర్ల పొడవున 146 కొత్త రోడ్లను నిర్మించనున్నారు. వీటితో పాటు రవాణాకు ఆటంకంగా మారిన వాగులు, వంకలపై 19 కొత్త వంతెనల నిర్మాణాన్ని చేపట్టబోతున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే గ్రామీణ ప్రజలకు రవాణా సౌకర్యాలు మెరుగవ్వడమే కాకుండా, అత్యవసర వైద్య సేవలు, విద్యా సదుపాయాలు వేగంగా అందుతాయి.
ఈ గ్రామీణ రహదారుల నిర్మాణంలో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులను మరియు కాంట్రాక్టర్లను ఖరాఖండిగా ఆదేశించారు. గతంలో లాగా నాసిరకం రోడ్లు వేస్తే సహించేది లేదని, ప్రతి పనిని పర్యవేక్షించాలని ఉన్నతాధికారులకు స్పష్టం చేశారు. నిర్దేశిత గడువులోనే ఈ పనులన్నీ పూర్తి చేసి పల్లె ప్రజల కష్టాలను తీర్చాలని ఆయన పిలుపునిచ్చారు.








