స్టాక్ మార్కెట్‌ను ‘బుల్’, ‘బేర్’ అని ఎందుకు పిలుస్తారో తెలిస్తే షాక్ అవుతారు!
—సూర్య ప్రకాష్ జోశ్యుల
ప్రతిరోజూ ఉదయాన్నే బిజినెస్ న్యూస్ తిరగేసినా, టీవీ ఛానెల్స్ చూసినా మనకు రెండు పదాలు పదే పదే వినిపిస్తుంటాయి—ఒకటి ‘బుల్ మార్కెట్’, ఇంకోటి ‘బేర్ మార్కెట్’. మార్కెట్ లాభాల్లో ఉంటే ఎద్దు లాగా దూసుకెళ్తోందంటారు, పతనమవుతుంటే ఎలుగుబంటి లాగా పంజా విసిరిందని చెప్తారు.
సరే, రోజూ కోట్ల రూపాయలు చేతులు మారే ప్రపంచ ఆర్థిక వ్యవస్థను వర్ణించడానికి ఈ రెండు జంతువులే దొరికాయా? అసలు ‘అప్ మార్కెట్’, ‘డౌన్ మార్కెట్’ అని సూటిగా అనకుండా, ఈ కోపదారి జంతువుల పేర్లు ఎందుకు పెట్టారో ఎప్పుడైనా ఆలోచించారా?
దీని వెనుక ఏవో కార్పొరేట్ సూత్రాలు లేవు… శతాబ్దాల నాటి చరిత్ర, కొందరు వ్యాపారుల తెలివితో కూడిన జిత్తులు ఉన్నాయి!
కథ మొదలైంది ఇక్కడే!
మనం అనుకునేలా ఇది అమెరికాలోని వాల్ స్ట్రీట్ ఇచ్చిన పేరు కాదు. దీని కథ 18వ శతాబ్దం నాటి లండన్ వీధుల్లో Exchange Alley మొదలైంది.ఆ మార్కెట్లో ‘బేర్స్కిన్ జోబర్స్’ (Bearskin jobbers) అని వ్యాపారులు ఉండేవారు. “ఇంకా పట్టుకోని ఎలుగుబంటి చర్మాన్ని ముందే అమ్మేయడం” అనే పాత సామెత ఆధారంగా వీరికి ఆ పేరు వచ్చింది.
వారి దగ్గర అసలు షేర్లు ఉండేవి కావు. కానీ, “రాబోయే రోజుల్లో ఫలానా షేర్ ధర పడిపోతుంది” అని ఊహించి, కాస్త తక్కువ ధరకు ముందే అమ్మకపు ఒప్పందాలు చేసుకునేవారు. ధర నిజంగానే పడిపోయాక, తక్కువ ధరకు కొని ఆ ఒప్పందాన్ని పూర్తి చేసి మధ్యలో లాభం జేబులో వేసుకునేవారు.
అలా తమ దగ్గర లేని దాన్ని ముందే అమ్మేసే వ్యాపారులను ‘బేర్స్కిన్ జోబర్స్’ (Bearskin Jobbers) అని పిలిచేవారు. కాలక్రమేణా ‘బేర్స్కిన్’ పోయి ‘బేర్’ మిగిలింది. మార్కెట్ పడిపోతుందని అంచనా వేసే ప్రతీ ఒక్కరినీ ‘బేర్’ అనడం, అలా మార్కెట్ 20% కంటే ఎక్కువ పడిపోతే దాన్ని ‘బేర్ మార్కెట్’ అని పిలవడం అలవాటుగా మారింది.
ఆసక్తికరమైన నిజం: ఎలుగుబంటి తన పంజాతో పైనుంచి కిందికి దాడి చేస్తుంది కాబట్టి, మార్కెట్ పతనానికి ఇది సూచిక అని మనం అనుకుంటాం. కానీ అది తర్వాత కాలంలో వచ్చిన ఊహాచిత్రం మాత్రమే! అసలు మూలం ఆ వ్యాపారుల ఎత్తుగడలే.
మరి ఈ ‘బుల్’ ఎలా రంగంలోకి వచ్చింది?
ఎలుగుబంటి కథ ఓ కొలిక్కి వచ్చింది సరే, మరి ఈ ఎద్దుల కథేంటి?
‘బేర్’ వ్యాపారులకు సరిగ్గా వ్యతిరేకంగా ఆలోచించే ఇంకో వర్గం ఉండేది. “రేపు మార్కెట్ రాకెట్లా పైకి లేస్తుంది!” అని నమ్మి, దొరికినంత వరకు షేర్లను కొని పోగేసేవారు. ధరలు పెరిగాక అమ్మి సొమ్ము చేసుకునేవారు.
ఆ కాలంలో ఆవేశంగా, ధైర్యంగా ముందుకు దూసుకెళ్లే మనుషులను వర్ణించడానికి ‘బుల్లిష్’ (Bullish) అనే పదాన్ని వాడేవారు. ఎద్దు ఎలాగైతే తన కొమ్ములతో దేన్నైనా పైకి ఎగరేస్తుందో, అలాగే మార్కెట్ ధరలను పైకి తీసుకెళ్లే వ్యాపారులను ‘బుల్’ అని పిలవడం మొదలుపెట్టారు. అలా మార్కెట్ కనిష్ఠ స్థాయిల నుంచి 20% లేదా అంతకంటే ఎక్కువ పెరిగితే దాన్ని ‘బుల్ మార్కెట్’ అనడం మొదలైంది.
శతాబ్దాలు దాటినా ఈ పేర్లు ఎందుకు మారలేదు?
ఫైనాన్స్, స్టాక్ మార్కెట్ అంటేనే సంక్లిష్టమైన లెక్కలు, గ్రాఫ్‌లు. కానీ ఈ ‘బుల్’, ‘బేర్’ అనే రూపకాలు ఎంతటి సామాన్యుడికైనా సులభంగా అర్థమవుతాయి.
ఎద్దులా దూసుకెళ్లడం అంటే—ఆశావాదం, లాభాలు, ఊపు!
ఎలుగుబంటిలా కిందికి నొక్కడం అంటే—భయం, నష్టాలు, మందగమనం!
శతాబ్దాల కిందట లండన్ వీధుల్లో పుట్టిన ఒక వ్యాపార సంభాషణ, ఈరోజు గ్లోబల్ మార్కెట్‌ను నడిపించే ఒక శక్తివంతమైన భాషగా మారిపోయింది. ఇకపై ఎప్పుడైనా బుల్, బేర్ మార్కెట్ అనే పదాలు వింటే… మీకు ఖచ్చితంగా 18వ శతాబ్దపు ఆ వ్యాపారుల జిత్తులే గుర్తుకొస్తాయి!








