రాజమౌళి – మహేష్ బాబు ‘వారణాసి’ కథ లీక్?: గ్రహశకలం, గ్లోబల్ వేట.. అసలు నిజమేంటి?
—సూర్య ప్రకాష్ జోశ్యుల
ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’. ఈ సినిమాను గ్లోబల్ ప్రాజెక్టుగా దర్శకధీరుడు తీర్చిదిద్దుతున్నారు. ఈ భారీ అడ్వెంచర్ డ్రామాపై ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఈ సినిమా కథ ఏమై ఉండవచ్చు అనేది సినిమా అభిమానుల్లో డిస్కషన్ గా మారింది.
తాజాగా, ఈ సినిమా కథ కు సంబంధించి ఒక కీలకమైన లీక్ బయిటకు వచ్చింది. అయితే ఈ కథ ఎవరో ఊరు పేరు లేని సైట్ లో ఉంటే పెద్ద విషయం కాదు,ఎవరూ పట్టించుకోపోదురు, కానీ ఈ సినిమా అఫీషియల్ బ్రాండ్ పార్టనర్ అయిన ‘స్కైబ్లూ సినిమాటిక్స్’ వారి వెబ్ సైట్ లో ఉండటంతో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది.
ఈ మూవీకి ప్రపంచస్థాయిలో విస్తృతంగా ప్రచారం కల్పించేందుకు సినిమా ప్రమోషన్స్, బ్రాండ్ పార్టనర్షిప్స్ కోసం ‘స్కైబ్లూ సినిమాటిక్స్’ సంస్థతో ‘వారణాసి’ మేకర్స్ ఒప్పందం కుదుర్చుకున్నారు. అంతేకాకుండా, ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన బ్రాండ్ ఇంటిగ్రేషన్ హక్కులను కూడా ‘స్కైబ్లూ సినిమాటిక్స్’ పొందింది.
వైరల్ అవుతున్న కథేంటి?
ఆ సైట్ లో ఉన్న సినాప్సిస్ ప్రకారం.. కథ 2027 కాలంలో సాగుతుంది. ‘శాంభవి’ అనే భారీ గ్రహశకలం (Asteroid) పుణ్యక్షేత్రమైన వారణాసి వైపు దూసుకొస్తూ భూమికి పెద్ద ముప్పుగా మారుతుంది. ఈ విపత్తు నుంచి ప్రపంచాన్ని కాపాడేందుకు ‘రుద్ర’ అనే సాహసికుడైన పురాతత్వ శాస్త్రవేత్త (మహేష్ బాబు) సీన్ లోకి వస్తాడు. వారణాసి కి సంబంధించి గతంలో దాగి ఉన్న ఒక ప్రాచీన విశ్వ ఖగోళ పరికరాన్ని (Cosmic artefact) వెతికే గ్లోబల్ మిషన్‌ను ఆయన చేపడతారు.
ఈ వేటలో రుద్రకు మందాకిని (ప్రియాంక చోప్రా) అనే చరిత్రకారిణి తోడుగా నిలుస్తుంది. ఆఫ్రికా అడవులు, అంటార్కిటికా మంచు ఖండాలు, యూరప్‌లలో సాగే ఈ అడ్వెంచర్‌లో, ‘కుంభ’ అనే విలన్ (పృథ్వీరాజ్ సుకుమారన్) వీరిద్దరినీ వెంటాడుతుంటాడు.
ఇక్కడే ‘వారణాసి’ కథ ఆసక్తికరంగా మారుతుంది.
సాధారణంగా రాజమౌళి సినిమాలో విలన్ అంటే కేవలం హీరోతో ఫైట్ చేసే వ్యక్తి కాదు. హీరో ప్రయాణానికి పూర్తిగా భిన్నమైన ఆలోచనా విధానం ఉన్న వ్యక్తిగా అతడిని చూపెడుతూంటారు. ఈ కథలో కూడా అలాంటిదే కనిపిస్తోంది. రుద్ర పురాతన ప్రపంచం నుంచి సమాధానం వెతుకుతుంటే.. కుంభ ఆధునిక టెక్నాలజీతో ఆ రహస్యాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్నట్టు తెలుస్తుంది.
అంటే ఒకవైపు Ancient Knowledge.. మరోవైపు Advanced Technology. మధ్యలో ప్రపంచాన్ని నాశనం చేయగల ఆస్టరాయిడ్. ఇదే ‘వారణాసి’ అసలు కాన్ఫ్లిక్ట్ కావచ్చు.
అలాగే ఇంకో విషయం మరింత పెద్దది. ఈ కథ ఒక్క వారణాసిలోనే జరగదు. రాజమౌళి ఇప్పటికే సినిమా ప్రయాణం వారణాసి నుంచి అంటార్కిటికా, ఆఫ్రికా, యూరప్ మీదుగా పురాతన రోమ్ వరకు వెళ్తుందని వెల్లడించారు. అంటే ఒకే కథలో భిన్న భౌగోళిక ప్రాంతాలతో పాటు భిన్న కాలాలను కూడా కలిపే ప్రయత్నం జరుగుతోంది.
అందుకే ‘వారణాసి’ని కేవలం ఒక యాక్షన్ అడ్వెంచర్‌గా చూడటం కంటే.. కాలం, పురాణం, చరిత్ర, టెక్నాలజీ, ప్రపంచ ప్రమాదం అన్నింటినీ ఒకే కథలో కలిపే భారీ అడ్వెంచర్‌గా చూడాల్సి ఉంటుంది.
రుద్ర వెతుకుతున్న ఆ కాస్మిక్ ఆర్టిఫ్యాక్ట్ నిజంగా ప్రపంచాన్ని కాపాడటానికేనా? లేక దాని వెనుక ఇంకా పెద్ద రహస్యం ఉందా?
ఎందుకంటే రాజమౌళి ఇప్పటివరకు చూపించిన ప్రపంచాన్ని చూస్తే.. వారణాసి కథలో ఆస్టరాయిడ్ కేవలం ప్రమాదం మాత్రమే కాకపోవచ్చు. అది వేల సంవత్సరాల క్రితం మొదలైన ఒక కథను మళ్లీ తెరపైకి తీసుకురావడానికి కారణం కావచ్చు.
అదే నిజమైతే.. మహేష్ బాబు రుద్రకు, పృథ్వీరాజ్ కుంభకు మధ్య జరిగేది కేవలం హీరో–విలన్ పోరాటం కాదు. భవిష్యత్తును మార్చేది టెక్నాలజీనా? లేక వేల సంవత్సరాలుగా దాగి ఉన్న జ్ఞానమా? ‘వారణాసి’ అసలు మిస్టరీ బహుశా అక్కడే ఉండొచ్చు.
ఈ కథ ఎంతవరకు నిజం?
అయితే, ఈ సినాప్సిస్ అధికారికంగా (Officially) విడుదల కాలేదు. ఒక అంతర్జాతీయ బ్రాండింగ్ పార్టనర్ వెబ్సైట్ లో ఉన్న సమాచారం ఆధారంగానే ఈ వివరాలు బయటకు వచ్చాయి.
దర్శకుడు రాజమౌళి గానీ, నిర్మాణ సంస్థ ‘శ్రీ దుర్గా ఆర్ట్స్’ గానీ ఇప్పటివరకు ఈ కథాంశంపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.
విజువల్ విందు ఖాయం:
రాజమౌళి గతంలో చెప్పినట్లుగా ఈ చిత్రం ప్రపంచస్థాయి అనుభూతిని ఇవ్వడం ఖాయం. ఆఫ్రికా, అంటార్కిటికాలతో పాటు ప్రాచీన రోమ్ కాలానికి కూడా కథ వెళ్తుందని, 80 శాతం చిత్రీకరణ పూర్తయిందని ముందే వెల్లడించారు.
దాదాపు రూ.1,300 కోట్లతో భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ చిత్రం 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలతో ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఆయన ఇప్పుడు వారణాసితో మరోసారి సంచలనం సృష్టించనున్నారు.ఈ సినిమా కథ, రాజమౌళి మేకింగ్ చూస్తూంటే ఖచ్చితంగా ‘వారణాసి’గ్లోబుల్ స్దాయి ప్రాజెక్ట్ లలో ఒకటిగా నిలుస్తోందని అభిమానులు భావిస్తున్నారు.








