నోట్లో వేస్తే వెన్నలా కరిగిపోయే బ్రెడ్ హల్వా.. ఇంట్లోనే ఈజీగా చేసేయండి!
ఫంక్షన్లు, పెళ్లిళ్ల విందుల్లో మన మనసును దోచే తీపి పదార్థాల్లో ‘బ్రెడ్ హల్వా’ ప్రత్యేకమైనది. తక్కువ సమయంలో, ఇంట్లో లభించే సాధారణ బ్రెడ్‌తో ఎంతో రుచికరంగా తయారుచేసుకునే ఈ స్వీట్ నోట్లో వేస్తే కరిగిపోతుంది.
కావలసిన పదార్థాలు

బ్రెడ్ స్లైసులు: 6, నెయ్యి: 4 నుండి 5 టేబుల్ స్పూన్లు,పాలు: 1/2 కప్పు (మరిగించినవి), పంచదార: 1/2 కప్పు (రుచికి తగినంత) ,యాలకుల పొడి: 1/2 టీస్పూన్, జీడిపప్పు, బాదం, కిస్మిస్: తగినంత.
బ్రెడ్ ముక్కలను సిద్ధం చేయడం

మొదట బ్రెడ్ స్లైసుల చుట్టూ ఉండే నల్లటి అంచులను తీసివేసి, చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక బాణలిలో నెయ్యి వేడి చేసి, ఈ బ్రెడ్ ముక్కలను బంగారు రంగులోకి వచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి.
డ్రై ఫ్రూట్స్ వేయించడం

అదే బాణలిలో మరికొద్దిగా నెయ్యి వేసి జీడిపప్పు, బాదం, కిస్మిస్ ముక్కలను దోరగా వేయించి వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. ఇవి హల్వాకి మంచి క్రించీ రుచితో పాటు రాయల్ లుక్‌ని ఇస్తాయి.
హల్వా ఉడికించే విధానం

ఇప్పుడు బాణలిలో పాలు, పంచదార వేసి పంచదార కరిగే వరకు మరిగించాలి. పంచదార కరిగిన తర్వాత ముందుగా వేయించిన బ్రెడ్ ముక్కలను వేసి బాగా కలపాలి. బ్రెడ్ పాలను పీల్చుకుని మెత్తగా అయ్యే వరకు సన్నని మంటపై ఉడికించాలి.

మిశ్రమం దగ్గరపడి బాణలికి అంటుకోకుండా వస్తున్నప్పుడు యాలకుల పొడి, వేయించిన డ్రై ఫ్రూట్స్ మరియు మిగిలిన నెయ్యి వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే, ఎంతో నోరూరించే నోటిలో కరిగిపోయే బ్రెడ్ హల్వా సిద్ధమైనట్లే!








