గాదె సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో సంచలనం..!
విజయవాడలో(Vijayawada) తీవ్ర సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసు దర్యాప్తులో అత్యంత కీలకమైన మలుపు చోటుచేసుకుంది. ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) అధికారులు కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కు చెందిన సీసీ కెమెరా టెక్నీషియన్ వెంకట్‌ను గురువారం అదుపులోకి తీసుకున్నారు. సాయికృష్ణ మృతికి సంబంధించిన అసలు నిజాలను దాచిపెట్టేందుకు పోలీస్ స్టేషన్‌లోని సీసీటీవీ రికార్డింగులను ఉద్దేశపూర్వకంగానే మాయం చేసినట్లు సిట్ అధికారుల ప్రాథమిక విచారణలో తేలింది.
కృష్ణలంక పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ (CI) నాగరాజు ఇచ్చిన కచ్చితమైన ఆదేశాల మేరకే తాను స్టేషన్‌లోని కీలకమైన సీసీటీవీ ఫుటేజ్‌ను డిలీట్ చేసినట్లు టెక్నీషియన్ వెంకట్ అంగీకరించినట్లు సమాచారం. సాయికృష్ణను విచారించిన సమయంలో పోలీస్ స్టేషన్ లోపల ఏం జరిగిందనే విషయాలు బయటకు రాకుండా ఉండేందుకే ప్లాన్ ప్రకారం ఈ సాక్ష్యాలను నాశనం చేశారని సిట్ నిర్ధారణకు వచ్చింది. ప్రస్తుతం వెంకట్‌ను రహస్య ప్రాంతంలో ఉంచి సిట్ అధికారులు మరింత లోతుగా ప్రశ్నిస్తున్నారు.
గాదె సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో పోలీస్ స్టేషన్ లోపల ఉన్న సీసీ ఫుటేజ్ అత్యంత బలమైన సాక్ష్యంగా మారింది. పోలీసులు చెప్తున్న లాకప్ డెత్ కథనానికి, బాధితుడి కుటుంబ సభ్యులు చేస్తున్న ఆరోపణలకు మధ్య ఉన్న అసలు నిజాన్ని నిరూపించడానికి ఈ దృశ్యాలు ఎంతో కీలకం. డిలీట్ చేసిన ఈ డేటాను తిరిగి రికవర్ (Recover) చేయడం కోసం సిట్ అధికారులు డిజిటల్ ఫోరెన్సిక్ నిపుణుల సహాయం తీసుకుంటున్నారు. సాక్ష్యాలను తారుమారు చేసిన సీఐ నాగరాజుతో పాటు దీని వెనుక ఉన్న ఇతర పోలీస్ సిబ్బందిపై కూడా సిట్ కఠిన చర్యలకు సిద్ధమవుతోంది.








