రష్యాకు ఉక్రెయిన్ డ్రోన్స్ షాక్.. మాస్కోను హడలెత్తిస్తున్న కీవ్ స్ట్రాటజీస్..!
రష్యాతో పోలిస్తే పిట్టలా ఉండే ఉక్రెయిన్.. అగ్రరాజ్యంగా చెప్పుకునే రష్యాకు చమటలు పట్టిస్తోంది. యుద్ధరంగంలో పోరాడేవాడిదే విజయమన్నట్లు ఫైట్ చేస్తోంది. దీంతో భారీ ఆయుధాలు.. పటిష్టమైన రక్షణ వ్యవస్థ చేతిలో ఉన్నప్పటికీ రష్యా.. యుద్ధరంగంలో ఎదురుదెబ్బలు తగిలించుకుంటోంది. లేటెస్టుగా రష్యా రాజధాని గుండెలపైకి కీవ్ యుద్ధాన్ని తీసుకొచ్చింది. దీంతో ఎటు చూసిన తగులబడిన ట్యాంకర్లతో పరిస్థితి బీభత్సంగా మారింది.
ఆక్రమిత క్రిమియాకు రష్యా ప్రధాన భూభాగం నుంచి ఎలాంటి సరకులు, ఇంధనం చేరకుండా ఉక్రెయిన్ దళాలు కట్టడి చేస్తున్నాయి. దీంతో యుద్ధం సెగ రష్యాకు బలంగా తాకుతోంది. ప్రపంచంలోనే అత్యధిక చమురు ఉత్పత్తి చేసే దేశాల జాబితా టాప్-3లో ఉండే రష్యా.. దేశీయంగా ఇంధన కొరత ఎదుర్కొనే పరిస్థితి నెలకొంది.
రష్యా ప్రధాన భూభాగంలోని రోస్టవ్ ఆన్ డాన్ పట్టణం నుంచి ఆక్రమిత మారియపోల్, మెలిటోపోల్ మీదుగా క్రిమియాకు వెళ్లే ప్రధాన హైవేను ఆర్-280గా పిలుస్తారు. ఈ మార్గం నుంచే సైనిక దళాలు, ఇంధనం, ఇతర సరకులు రష్యా ఆక్రమిత ప్రాంతాలకు చేరేవి. కెర్చి వంతెనపై దాడులు పెరగడంతో దానికి ప్రత్యామ్నాయంగా క్రెమ్లిన్ వ్యూహకర్తలు ఆర్-280 ఎంచుకొన్నారు. ఉక్రెయిన్ సైన్యంలోని 412 నెమిసోవ్ (గ్రీకు భాషలో ప్రతీకారానికి దేవత పేరు) బ్రిగేడ్‌లోని అన్ మ్యాన్డ్ సిస్టమ్స్ ఫోర్స్ ఈ విషయాన్ని గ్రహించింది. అమెరికా తయారీ హార్నెట్ , స్థానికంగా తయారు చేసిన మోరిగన్ డ్రోన్లను వాడి భారీగా దాడులు చేసింది. ఫలితంగా ఈ మార్గంలో ఆర్-280 మీద ట్రాఫిక్ 70% పైగా పడిపోయింది. ట్యాంకర్లు, సైనిక వాహనాలు ఈ మార్గంలో వెళ్లాలంటే భయపడిపోతున్నాయి. ముఖ్యంగా ఈ డ్రోన్లు రష్యాలోని ఓ హైవేను దాదాపు నిర్మానుష్యంగా మార్చేశాయి.
ఇవి కూడా చదవండి
ఇక ఎఫ్పీ-2, బెహెమోత్ డ్రోన్లను కూడా ఉక్రెయిన్ వాడుతోంది. ఇవి 50-300 కిలోమీటర్ల దూరంలో లక్ష్యాలను ఛేదించగలవు. వీటి రాకతో మిడ్ రేంజిలో రష్యాపై దాడులు గతేడాది 28 రెట్లు పెరిగాయని అంచనా. ఇవి కేవలం లాజిస్టిక్స్నే కాకుండా రష్యా ఎయిర్ డిఫెన్స్‌లను కూడా దెబ్బతీస్తున్నాయి.
చమురు క్షేత్రాలు, కర్మాగారాలే లక్ష్యం..
యుద్ధం మొదలైన ఫిబ్రవరి 2022 నుంచి 2026 ఏప్రిల్ చివరి వారం వరకు ఉక్రెయిన్ దళాలు ఇంధన రిఫైనరీలే లక్ష్యంగా 158 దాడులు చేశాయి. వీటిల్లో రష్యాలోని అతిపెద్ద 33 రిఫైనరీల్లో కనీసం 24 రిఫైనరీలపై దాడులు చేశాయి. ర్యాజన్, సరటోవ్ రిఫైనరీలపై ఏకంగా దాదాపు 15 చొప్పున దాడులు జరిగాయి. సిజ్రాన్పై మే చివరికి 11వ సారి దాడి జరిగింది.
ఈ ఏడాది జనవరి నుంచి మే లోపు 16 చమురు శుద్ధి కర్మాగారాలు ఉక్రెయిన్ దాడుల్లో దెబ్బతిన్నాయి. ఈ దాడుల్లో రోజుకు 7,00,000 బ్యారెళ్ల రిఫైనింగ్ సామర్థ్యం పడిపోయింది. రష్యాలో చమురు శుద్ధి సామర్థ్యం 2009 తర్వాత తొలిసారి కనిష్ఠానికి పడిపోయింది. ఇక జనవరి నుంచి 30కి పైనున్న రిఫైనరీల్లో చూస్తే ఇది రోజుకు 2.8 మిలియన్ బ్యారెళ్లకు పైగా ఉత్పత్తిలో కోత పడినట్లైంది.
యుద్ధాల్లో దళాలకు అవసరమైన మందుగుండు, ఇంధనం, ఆహారం, బ్యాకప్ పంపడం చాలా ముఖ్యం. వీటిని కట్ చేస్తే ఎంతటి సైన్యమైనా కొన్ని వారాల్లో చేతులెత్తేస్తుంది. తాజాగా ఉక్రెయిన్ రష్యా విషయంలో లాజిస్టిక్స్ లాక్డౌన్ ప్లాన్ అమలుచేస్తోందని నిపుణులు అంటున్నారు. నేరుగా రష్యా దళాలపై దాడులు తగ్గించి.. వారి సరఫరాలను అడ్డుకోవడంపై దృష్టిపెట్టింది. దేశీయంగా తయారుచేసిన మధ్య శ్రేణి డ్రోన్లను ఇందుకోసం రంగంలోకి దింపింది. సరిహద్దులకు దూరంగా రష్యా లోపలి ప్రాంతాల్లోని ఇంధన కాన్వాయ్‌లు, మిలిటరీ ట్రక్కులు, రైళ్లు, ఇతర వాహనాలపై దాడులు చేసింది. ముఖ్యంగా రష్యా స్వాధీనం చేసుకొన్న క్రిమియాకు సరఫరాలను తెంపేస్తోంది. ఇటువంటి 150 దాడులను అమెరికా విశ్లేషకులు రికార్డు చేశారు. ఈ ఏడాది జనవరి నుంచే ఇంధనం తరలిస్తున్న కనీసం 20 రైళ్లను ధ్వంసం చేసిందంటే అర్థం చేసుకోవచ్చు. యుద్ధంలో విజయాలు సాధిస్తున్నామని రష్యా ఎంత చెబుతున్నా.. ఆ విజయాలకు భరించలేనంత మూల్యం చెల్లించుకొనేలా ఉక్రెయిన్ చేస్తోంది.








