ఇజ్రాయెల్ ప్రయోజనాలే ముఖ్యం.. ట్రంప్ తో విభేదాలు నిజమే అన్న నెతన్యాహు..!
అగ్రరాజ్యం అమెరికాకు గట్టి షాకిచ్చింది ఇజ్రాయెల్. అమెరికా అన్నా, అమెరికా అధినేత ట్రంప్ అన్నా తమకు ఎనలేని గౌరవమన్నారు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు. ఇద్దరం కలిసి పనిచేస్తామన్నారు. పరస్పర ప్రయోజనాలే లక్ష్యంగా ముందుకెళ్తామన్నారు.అలా అని ప్రతీది ట్రంప్ చెప్పినట్లు చేయాలంటే కుదరదన్నారు. తాము రెండు వేర్వేరు దేశాలకు అధిపతులమని గుర్తు చేసిన నెతన్యాహు.. ఎవరి ప్రయోజనాలు వారికుంటాయన్నారు.
పశ్చిమాసియా వ్యవహారాల్లో ఇజ్రాయెల్ తన ఆదేశాలను పాటిస్తోందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై బెంజమిన్ నెతన్యాహు ఘాటుగా స్పందించారు. తామిద్దరం ఒకరి ఆదేశాలను మరొకరు పాటించే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. జెరూసలేం న్యూస్ సిండికేట్ అంతర్జాతీయ విధాన సదస్సు 2026లో నెతన్యాహు మాట్లాడుతూ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.
‘అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేనేది చెబితే అది చేయరు, అలాగే ఆయన చెప్పినవన్నీ నేను చేయను. మేమిద్దరం స్వతంత్ర, గర్వించదగ్గ దేశాలకు నాయకులం. కొన్ని విషయాల్లో మా మధ్య ఒకే రకమైన అభిప్రాయాలు ఉండకపోవచ్చు. నేను ఇజ్రాయెల్ ప్రయోజనాలు, భద్రత కోసం నిలబడతాను. కొన్నిసార్లు మా ఆలోచనలు కలవకపోయినా, ఒకరి సార్వభౌమత్వాన్ని, నాయకత్వాన్ని మరొకరం గౌరవించుకుంటాం’ అని నెతన్యాహు పేర్కొన్నారు.
గత శుక్రవారం ‘ఆక్సియోస్'(Axios)మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. లెబనాన్‌పై దాడులను ఆపేలా ఇజ్రాయెల్ సైనిక చర్యలను మీరు ప్రభావితం చేయగలరా? అన్న ప్రశ్నకు సమాధానంగా.. ‘అవును, నేను చేయగలను. వారికి నాపై చాలా గౌరవం ఉంది. నేను చెప్పినట్లే వారు వింటారు’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. నెతన్యాహుతో తనకున్న సంబంధాలు బాగున్నాయని చెబుతూనే, కొన్నిసార్లు ఆయనను ‘కట్టడి చేయాల్సి వస్తుందని’ అమెరికా మద్దతు లేకపోతే ఇజ్రాయెల్ ఉనికిలోనే ఉండేది కాదని ట్రంప్ వ్యాఖ్యానించారు. దీనికి సమాధానంగా నెతన్యాహు ఇప్పుడు పై విధంగా స్పందించారు.
అమెరికా-ఇరాన్ మధ్య ఒప్పందం కుదిరినా, కుదరకపోయినా టెహ్రాన్‌కు తాము అణ్వాయుధం దక్కనివ్వబోమని నెతన్యాహు తేల్చిచెప్పారు. తాను ఇజ్రాయెల్ ప్రధానిగా ఉన్నంత కాలం ఇరాన్ అణ్వాయుధాన్ని పొందే అవకాశం లేదని ఉద్ఘాటించారు. ఈ అంశంలో ఎలాంటి దౌత్య పరిణామాలు చోటుచేసుకున్నా సరే, తన నిర్ణయం మారదని స్పష్టం చేశారు.








