Nethanyahu: ఇరాన్ ప్రభుత్వాన్ని ప్రజలే పడగొడతారు.. ఇజ్రాయెల్..!
ఇరాన్ పై యుద్ధం ప్రకటించి.. దాడులు చేస్తున్న అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధరంగంలో ఆధిపత్యం కోసం శతవిధాలుగా ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే ఇరాన్ ఎయిర్ ఫోర్స్, నావికా దళాన్ని చావు దెబ్బకొట్టామని చెబుతున్న అమెరికా.. ఇజ్రాయెల్.. ఇరాన్ బేషరతుగా లొంగిపోవాల్సిందేనని హెచ్చరిస్తున్నాయి. లేదంటే ఆదేశ ప్రభుత్వం కుప్పకూలేవరకూ తమ దాడులు కొనసాగుతాయని తేల్చి చెబుతున్నాయి. అయితే యుద్ధాన్ని ఆరంభించింది అమెరికా, ఇజ్రాయెల్ దేశాలే అంటున్న ఇరాన్.. ఆ దేశాలే యుద్ధాన్ని విరమించాలని తేల్చి చెబుతోంది.
మరోవైపు…ఇరాన్‌పై భీకర దాడులు కొనసాగుతోన్న నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు (Netanyahu) కీలక వ్యాఖ్యలు చేశారు. ముందు ముందు ఇరాన్‌కు మరిన్ని సర్ప్రైజ్లు ఇస్తామన్నారు. ప్రజలు ఆ దేశంలోని ప్రభుత్వాన్ని పడగొట్టే క్షణం దగ్గరలో ఉందన్నారు. ఈ దాడులతో తాము ఇరాన్‌ను విభజించడానికి ప్రయత్నించట్లేదని.. నిరంకుశ పాలన నుంచి ఆ దేశానికి విముక్తి కలిగించడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఇరాన్ విషయంలో తమ ప్రణాళికలోని తదుపరి దశను త్వరలో చేరుకోబోతున్నామని నెతన్యాహు అన్నారు.
ఇవి కూడా చదవండి
ఇజ్రాయెల్ చేస్తున్న దాడులతో కీలక నేతలను కోల్పోయి.. ఇరాన్ (iran) ప్రభుత్వం ఇప్పటికే తీవ్రంగా నష్టపోయిందని నెతన్యాహు అన్నారు. ఆ దేశంలోని ప్రస్తుత పాలనను అస్థిరపరచడానికి.. ప్రభుత్వంలో మార్పులు తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. అక్కడి పాలక వర్గాన్ని గద్దె దించడానికి ఇదే సరైన సమయమని తెలిపారు. ఆ దేశ ప్రభుత్వాన్ని అక్కడి ప్రజలే స్వయంగా పడగొట్టాలన్నారు. అప్పుడే ఇరాన్-ఇజ్రాయెల్‌లలో శాంతి నెలకొంటుందని తెలిపారు.
అయితే ఇరాన్ దశాబ్దాల నుంచి ఖమేనీ, ఆయన అనుచరవర్గం చేతుల్లోనే ఉంది. ఇప్పుడు యుద్ధం ఆరంభించి, వెంటనే ప్రభుత్వాన్ని గద్దె దించాలని అమెరికా, ఇజ్రాయెల్ చెబితే.. ఇరాన్ ప్రజలు కార్యక్షేత్రంలోకి దూకేస్తారా..? ఇప్పటికే నిరసనల సమయంలో ట్రంప్ ఇచ్చిన షాక్.. ఇరాన్ ప్రజలకు నరకం చూపింది. ఆదేశంలో రోడ్లపై రక్తం పారిందని అంతర్జాతీయ కథనాలు వెల్లడించాయి. అలాంటిది వీరి మాటలు నమ్మి వీధుల్లోకి వస్తే తర్వాతి పరిస్థితి ఏంటి…? ఇప్పుడీ ప్రశ్నలే ఇరానీయులను సైతం వేధిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి








