చంద్రబాబు హయాంలో ఆర్టీసీకి ఎప్పుడూ ముప్పే..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) ప్రైవేటీకరణ దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (APCC) అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నాడు అద్దె బస్సుల విధానం తీసుకొచ్చిన చంద్రబాబు, నేడు వాయు కాలుష్యం సాకుతో ఈ-బస్సుల (E-Buses) రూపంలో సంస్థను సమాధి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. పేదవాడి రవాణా వ్యవస్థ అయిన ఆర్టీసీని కాపాడుకోవడానికి కార్మికులు చేస్తున్న పోరాటానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
అడ్వాన్స్డ్ టెక్నాలజీతో వస్తున్న ఎలక్ట్రికల్ బస్సులను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడాన్ని షర్మిల తీవ్రంగా తప్పుపట్టారు. కాలుష్య నివారణ పేరుతో రూట్లను ప్రైవేటు రవాణాదారులకు కట్టబెట్టడం సరికాదన్నారు. ఆర్టీసీ యాజమాన్యమే నేరుగా ఆయా ఈ-బస్సులను కొనుగోలు చేసి, సొంతంగా నిర్వహించాలని ఆమె డిమాండ్ చేశారు. లాభసాటి మార్గాలను ప్రైవేటు పరం చేసి, ఆర్టీసీని కేవలం అద్దె బస్సులకు అడ్డాగా మార్చాలనే కుతంత్రాలను సహించేది లేదని హెచ్చరించారు.
సంస్థను బలోపేతం చేసేందుకు ఆర్టీసీలో ఖాళీగా ఉన్న 10,000 ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. దీంతో పాటు, ఆర్టీసీకి ఉన్న అత్యంత విలువైన భూములు, స్థలాలను ప్రైవేటు శక్తులకు లీజుల పేరుతో అప్పగించే కుట్రలను తక్షణమే నిలిపివేయాలన్నారు. ఉద్యోగుల దీర్ఘకాలిక డిమాండ్ అయిన వేతన సవరణ (PRC) ఆర్థిక అంశాలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లాభాలు వచ్చే ప్రధాన రూట్లను ప్రైవేటు ఆపరేటర్లకు ఇవ్వకుండా ప్రభుత్వ పరిధిలోనే ఉంచాలి అని డిమాండ్ చేసారు. సంస్థ మనుగడను ప్రశ్నార్థకం చేసే ఏ నిర్ణయాన్నైనా ప్రజాక్షేత్రంలో అడ్డుకుంటాం. అని హెచ్చరించారు.








