అమెరికా వెళ్లే విద్యార్థులకు బిగ్ షాక్.. లక్షల అప్పులు చేసి వెళ్తే నడిరోడ్డు పైనేనా? -కొత్త రూల్స్ వెనుక అసలు నిజం!
–శివ దువ్వూరు
“ఇంటి పొలం తాకట్టు పెట్టారు. బ్యాంకు లోన్ తీసుకున్నారు. లక్షల రూపాయలు ఖర్చు చేసి కొడుకును అమెరికాకు పంపించారు. “రెండేళ్లు కష్టపడితే చాలు… చదువు పూర్తవుతుంది, ఉద్యోగం వస్తుంది, అప్పులు తీరిపోతాయి” అని ఆ కుటుంబం ఆశ పెట్టుకుంది. ఇప్పుడు ఆ ఆశ నిరాశ అయ్యే పరిస్ధితి కనపడుతోంది.
ఇప్పుడు అమెరికా తీసుకురాబోతున్న కొత్త వీసా నిబంధనలు ఆ లెక్కలన్నింటినీ తారుమారు చేసే ప్రమాదం దూసుకొస్తోంది.
దాంతో డిగ్రీ పూర్తయ్యేలోపు వీసా గడువు ముగిస్తే? రీసెర్చ్ ఆలస్యం అయితే? మరోసారి ప్రభుత్వ అనుమతి కోసం ఎదురుచూడాల్సి వస్తే? ఈ ప్రశ్నలే ఇప్పుడు అమెరికా వెళ్లాలనుకుంటున్న లక్షలాది భారతీయ విద్యార్థులను, వారి కుటుంబాలను కలవరపెడుతున్నాయి.
అమెరికా ఎందుకు వీసా రూల్స్ మార్చాలని చూస్తోంది?
అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (DHS) అంతర్జాతీయ విద్యార్థులకు సంబంధించిన కీలక మార్పులను తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఇన్నాళ్లూ F-1 స్టూడెంట్ వీసాపై అమెరికాకు వెళ్లిన విద్యార్థులు తమ కోర్సు పూర్తయ్యే వరకు అక్కడ ఉండే అవకాశం ఉండేది. కోర్సు ఆలస్యం అయినా, రీసెర్చ్ ఎక్కువ కాలం సాగినా, యూనివర్సిటీ అనుమతిస్తే సమస్య ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఆ విధానాన్ని మార్చాలని అమెరికా భావిస్తోంది.
కొత్త ప్రతిపాదన ప్రకారం విద్యార్థులకు ఒక నిర్దిష్ట కాలపరిమితి మాత్రమే ఇవ్వబడుతుంది. సాధారణంగా నాలుగేళ్ల వరకు అనుమతి ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాత కూడా చదువు కొనసాగించాల్సి వస్తే మళ్లీ ప్రత్యేకంగా ఎక్స్టెన్షన్ కోసం దరఖాస్తు చేయాల్సి రావచ్చు.
భారతీయ విద్యార్థులకు ఎందుకు ఇది పెద్ద సమస్య?
అమెరికాలో ప్రస్తుతం అత్యధిక సంఖ్యలో ఉన్న అంతర్జాతీయ విద్యార్థులు భారతీయులే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అయితే దాదాపు ప్రతి కుటుంబంలో ఎవరో ఒకరు అమెరికా చదువుల గురించి ఆలోచిస్తున్నారు. MS, Masters, PhD, Research, OPT… ఇవి కేవలం కోర్సులు కాదు. చాలా కుటుంబాలకు ఇవి భవిష్యత్తు కోసం వేసే పెద్ద పెట్టుబడి.
20 లక్షలు… 30 లక్షలు… కొన్నిసార్లు 50 లక్షలకు పైగా ఖర్చు చేసి పిల్లలను అమెరికాకు పంపిస్తున్నారు. అలాంటి సమయంలో వీసా గడువుపై కొత్త అనిశ్చితి ఏర్పడటం సహజంగానే ఆందోళన కలిగిస్తోంది.
ఎక్కువగా దెబ్బ తినేది ఎవరు?
ఈ మార్పు అమల్లోకి వస్తే అత్యధిక ప్రభావం PhD విద్యార్థులు, పరిశోధకులపైనే పడే అవకాశం ఉంది.
ఎందుకంటే:
PhDలు సాధారణంగా 5 నుంచి 7 సంవత్సరాలు పడతాయి. STEM రీసెర్చ్ ప్రాజెక్టులు తరచూ ఆలస్యం అవుతాయి. ప్రయోగాలు, పరిశోధనలు ముందుగా చెప్పిన షెడ్యూల్ ప్రకారం పూర్తికావు. ఇప్పటి వరకు చదువు కొనసాగుతున్నంత కాలం అమెరికాలో ఉండే అవకాశం ఉండేది. కానీ కొత్త విధానంలో ప్రతి అదనపు సంవత్సరం కోసం ప్రభుత్వ అనుమతులపై ఆధారపడాల్సి రావచ్చు.
OPT, ఉద్యోగాలపై కూడా ప్రభావమా?
చాలా మంది విద్యార్థులు అమెరికాకు వెళ్లేది కేవలం డిగ్రీ కోసం కాదు. చదువు పూర్తయ్యాక OPT ద్వారా ఉద్యోగ అనుభవం సంపాదించడం, తర్వాత H-1B వంటి వర్క్ వీసాల ద్వారా కెరీర్ నిర్మించుకోవడం వారి లక్ష్యం. కానీ కొత్త ప్రతిపాదన ప్రకారం ప్రస్తుతం ఉన్న 60 రోజుల గ్రేస్ పీరియడ్‌ను 30 రోజులకు తగ్గించే అవకాశం ఉంది.
అంటే ఉద్యోగం వెతకడానికి తక్కువ సమయం. వీసా మార్పులకు తక్కువ అవకాశం. కెరీర్ ప్లానింగ్‌పై ఎక్కువ ఒత్తిడి ఉండే ప్రమాదం ఉంది.
అమెరికా ఇలా చేయటం వెనక ఆలోచన ఏమిటి?
అమెరికా ప్రభుత్వం మాత్రం ఈ మార్పులను భద్రత, వీసా వ్యవస్థ పర్యవేక్షణ, ఓవర్స్టేలను నియంత్రించడం కోసం అవసరమని భావిస్తోంది. కానీ విమర్శకులు మరో ప్రశ్న అడుగుతున్నారు. ప్రపంచం నలుమూలల నుంచి ప్రతిభావంతులైన విద్యార్థులను ఆకర్షించే అమెరికా… ఇప్పుడు అదే విద్యార్థులకు మరిన్ని అడ్డంకులు సృష్టిస్తోందా? అని ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే అమెరికా యూనివర్సిటీలకు, రీసెర్చ్ ల్యాబ్‌లకు, టెక్ రంగానికి విదేశీ విద్యార్థులు కీలక బలం.
లాభపడేది ఎవరు?
అమెరికా కఠిన నిబంధనలు అమలు చేస్తే విద్యార్థుల దృష్టి ఇతర దేశాల వైపు మళ్లే అవకాశం ఉంది.
ప్రస్తుతం:
కెనడా
జర్మనీ
ఆస్ట్రేలియా
యూకే
విదేశీ విద్యార్థులను ఆకర్షించేందుకు పోటీ పడుతున్నాయి. అమెరికా అవకాశాలు కఠినమైతే ఈ దేశాలు మరింత ఆకర్షణీయంగా మారవచ్చని నిపుణులు భావిస్తున్నారు.
భారత్ ఏం చేయగలదు?
ఇది అమెరికా అంతర్గత విధానం కావడంతో భారత్ నేరుగా జోక్యం చేసుకునే అవకాశం పరిమితంగానే ఉంటుంది. అయితే భారతీయ విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా అమెరికాతో చర్చలు జరపడం, విద్యార్థుల సమస్యలను అధికారికంగా ప్రస్తావించడం వంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
ఇంకా తుది నిర్ణయం రాలేదు… కానీ టెన్షన్ మొదలైంది
ప్రస్తుతం ఈ నిబంధన ఇంకా సమీక్ష దశలో ఉంది. తుది రూపంలో మార్పులు వచ్చే అవకాశం కూడా ఉంది. అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. అమెరికా వెళ్లే విద్యార్థులు ఇప్పటి వరకు GRE, IELTS, యూనివర్సిటీ అడ్మిషన్లు, ఫీజుల గురించి ఆలోచించేవారు. ఇకపై వీసా గడువు కూడా వారి భవిష్యత్తును నిర్ణయించే అంశంగా మారే అవకాశం ఉంది.
ఒకప్పుడు అమెరికా కల అంటే అక్కడ విద్యాసంస్దలలో అడ్మిషన్ వస్తే సరిపోయేది. ఇప్పుడు మాత్రం కొత్త ప్రశ్న ఎదురవుతోంది.
“లక్షలు ఖర్చు చేసి అమెరికా వెళ్లాక… చదువు పూర్తయ్యే వరకు అక్కడ ఉండే హామీ కూడా లేకపోతే పరిస్దితి ఏమిటి?”
అదే ప్రశ్న ఇప్పుడు వేలాది భారతీయ కుటుంబాలను కలవరపెడుతోంది.








