రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎలాంటి రాజీపడబోం : మంత్రి లోకేష్
గత ప్రభుత్వంలో వ్యవస్థలన్నీ పతనం అయ్యాయి
చట్టాన్ని ఉల్లంఘించిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు
టీడీపీ ఎప్పుడూ ప్రతీకార రాజకీయాలను ప్రోత్సహించలేదు
ప్రజా సమస్యలు అర్థం చేసుకోవడానికి పాదయాత్ర దోహదపడింది
ఇన్విజిబుల్ గవర్నమెంట్, ఎఫెక్టివ్ గవర్నెన్స్ మా నినాదం
పరీక్షల నిర్వహణలో కాలానుగుణంగా సంస్కరణలు అవసరం
టీడీపీ కాలపరీక్షను తట్టుకుని నిలిచింది
ఫార్చ్యూన్ 500 కంపెనీలకు 99 పైసలకే భూమి కేటాయిస్తాం
ఢిల్లీలో ది ఇండియన్ ఎక్స్ ప్రెస్ నిర్వహించిన ఎక్స్ ప్రెస్ అడ్డాలో మంత్రి లోకేష్
న్యూఢిల్లీ: గత ప్రభుత్వంలో రాష్ట్రంలోని వ్యవస్థలన్నీ పతనం అయ్యాయి. చట్టాన్ని ఉల్లంఘించిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. టీడీపీ ఎప్పుడూ ప్రతీకార రాజకీయాలను ప్రోత్సహించలేదని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో ది ఇండియన్ ఎక్స్ ప్రెస్ నిర్వహించిన ఎక్స్ ప్రెస్ అడ్డా కార్యక్రమంలో మంత్రి లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ది ఇండియన్ ఎక్స్ ప్రెస్ నేషనల్ ఒపీనియన్ ఎడిటర్ వందిత మిశ్రా వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ సందర్భంగా పలు ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇస్తూ.. రియల్ టైం గవర్నెన్స్ విషయంలో.. ఏపీలో మేం వివిధ శాఖల నుంచి సేకరించిన డేటాతో ఒక డేటా లేక్ ను ఏర్పాటుచేశాం. దీని వల్ల నిర్ణయాలను మరింత అర్థవంతంగా, సమర్థవంతంగా తీసుకునే అవకాశం ఏర్పడింది. తద్వారా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని అమలు చేయగలుగుతున్నాం. ఇప్పుడు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దీనిని మరొక మెట్టు పైకి తీసుకువెళ్లి ముందుకు తీసుకెళ్లి ‘ఈజ్ ఆఫ్ లివింగ్’ అనే భావనను ముందుకు తీసుకొచ్చారు. ఎందుకంటే ప్రజలు, ప్రభుత్వానికి మధ్య సంబంధాలలో ఎప్పటినుంచో అనేక అంతరాలు, ఘర్షణలు ఉన్నాయి. సాంకేతికత ద్వారా ఆ అవరోధాలను ఎలా తొలగించాలనేదే మా ఆలోచన. ఉదాహరణకు రాష్ట్ర ప్రభుత్వంలోని ప్రతి సేవను ఒకే వాట్సాప్ నంబర్లో అందుబాటులోకి తీసుకొచ్చాం. ప్రస్తుతం దాదాపు వెయ్యి ప్రభుత్వ సేవలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. ఎవరైనా నాకు ఈ సమస్య ఉందని చెబితే.. మీరు కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదని. వాట్సాప్ నంబర్‌కు సందేశం పంపితే.. మీ సమస్య పరిష్కారమవుతుందని అని చెబుతాను. సర్టిఫికెట్లు కావాలన్నా, ఇతర సేవలు కావాలన్నా, అన్నీ డిజిటలైజ్ చేసి మొబైల్ ఫోన్ ద్వారానే అందిస్తున్నాం. ఇది రియల్ టైమ్ గవర్నెన్స్‌కు ఒక ఉదాహరణ మాత్రమే. అన్ని శాఖలను, అన్ని డేటా సెట్లను సమన్వయం చేసి సమర్థవంతమైన పాలన అందించడంలో రియల్ టైమ్ గవర్నెన్స్ కీలక పాత్ర పోషిస్తోంది. ఇన్విజిబుల్ గవర్నమెంట్, ఎఫెక్టివ్ గవర్నెన్స్ మా నినాదం.
సమాజంలో ఏ మార్పు కావాలన్నా అది విద్యతోనే ప్రారంభం కావాలి
నాకు ఇష్టమైన శాఖ విద్యాశాఖ. పిల్లలంటే నాకు ఎంతో ఇష్టం. అంతేకాదు.. నిజమైన మార్పు విద్య ద్వారానే వస్తుందని నేను బలంగా నమ్ముతున్నాను. ఒక దేశంగా మనం ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ విశ్వవిద్యాలయాలపై తగినంత దృష్టి పెట్టడం లేదని నా అభిప్రాయం. సమాజంలో ఏ మార్పు కావాలన్నా అది విద్యతోనే ప్రారంభం కావాలి. ఒక ఉదాహరణ చెబుతాను. మనం అందరం లింగ సమానత్వం గురించి మాట్లాడుతుంటాం. నేను విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పాఠ్యపుస్తకాల్లో మార్పులు చేపట్టాను. ఇంటి పనుల చిత్రాల్లో 50 శాతం పురుషులు, 50 శాతం మహిళలు ఉండేలా చేశాం. ఇది చాలా చిన్న విషయంగా అనిపించవచ్చు. కానీ విలువల ఆధారిత విద్యా శక్తిని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనకు ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు గారు ఉన్నారు. ఆయన వ్యక్తిగతంగా ఎంతోమంది ప్రజలకు విలువల ఆధారిత జీవన విధానాన్ని బోధిస్తూ అనేక ప్రసంగాలు చేశారు. ఆయన సహకారంతో మేం కొన్ని పుస్తకాలను రూపొందించాం. అలాగే పాఠశాలలు, విశ్వవిద్యాలయాలకు వెళ్లి విలువల ఆధారిత విద్యపై విద్యార్థులతో మాట్లాడే కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నాం. ఒకసారి ఆయన ప్రసంగంలో నేను విన్న ఒక అద్భుతమైన మాట నాకు ఇప్పటికీ గుర్తుంది. నీ జీవితంలో తల్లికి చెప్పలేని పని ఏదీ చేయకూడు అని. ఈ ఒక్క నియమాన్ని పాటిస్తే నువ్వు విజయవంతమైన పౌరుడివి అవుతావు. చాలా సరళమైన మాట. కానీ ఎంతో శక్తివంతమైన సందేశం.
పరీక్షల నిర్వహణలో కాలానుగుణంగా సంస్కరణలు అవసరం
నీట్ వంటి పరీక్షల నిర్వహణ వ్యవస్థలో మరిన్ని సంస్కరణలు చేయాల్సిన అవసరం కచ్చితంగా ఉంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. మనమందరం దీనిని అంగీకరిస్తాం. రాష్ట్రంగా మేం ఈఏపీసెట్ సహా వివిధ ప్రవేశ పరీక్షలను పూర్తిగా కంప్యూటర్ ఆధారిత విధానానికి మార్చాం. అయితే నేను ఇంకో అడుగు ముందుకు వెళ్లాలని భావిస్తున్నాను. ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న విద్యార్థుల భవిష్యత్తు ఒకే రోజు జరిగే పరీక్షపై ఆధారపడకూడదు. ఒక చెడు రోజు మొత్తం సంవత్సరాన్ని, కొన్నిసార్లు వారి భవిష్యత్తునే ప్రభావితం చేయవచ్చు. అందుకే నేను నా శాఖ కార్యదర్శులు, కమిషనర్లతో ఎప్పుడూ ఒకటే చెబుతుంటాను. ఈ సమస్యను మీ సొంత పిల్లల కోణంలో ఆలోచించాలి అని. ఏం తప్పు జరిగిందో తెలుసుకోవడం నాకు చాలా ముఖ్యం. సీబీఎస్ఈ పరీక్షలు, కంప్యూటర్ ఆధారిత పరీక్షా విధానాన్ని కూడా నేను పరిశీలించాను. మంత్రి దృష్టితో చూస్తే వ్యవస్థ చాలా బాగానే కనిపిస్తుంది. ప్రశ్నాపత్రాలు యాదృచ్ఛికంగా పంపిణీ అవుతాయి. పరీక్షలు జరుగుతాయి. కానీ ఫలితాలు వచ్చిన తర్వాత అది రెండు వైపులా పదునున్న కత్తిలా మారింది. అందుకే ఏం తప్పు జరిగిందో, ఎలాంటి సవరణలు అవసరమో తెలుసుకోవడం నాకు ముఖ్యమైంది. ఎందుకంటే సంపూర్ణమైన వ్యవస్థ అనేది ఏదీ ఉండదు. కాలానుగుణంగా సంస్కరణలు చేస్తూ.. మెరుగుపరుచుకుంటూ వెళ్లాలి.
టీడీపీ కాలపరీక్షను తట్టుకుని నిలిచింది
తెలుగుదేశం పార్టీ ఒక ప్రాంతీయ పార్టీగా రాజకీయాల్లో కాలపరీక్షను తట్టుకుని నిలిచింది. 1984లో ఇందిరాగాంధీ గారు, సంపూర్ణ మెజారిటీతో అధికారంలో ఉన్న ఎన్టీఆర్ గారి ప్రభుత్వాన్ని గవర్నర్‌ను ఒక సాధనంగా ఉపయోగించి తొలగించారు. అంతకుముందు కూడా కొన్ని ప్రాంతీయ పార్టీల ప్రభుత్వాలు మారాయి. అయితే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే తిరిగి పునరుద్ధరించడం జరిగింది. దీనికి కారణం మా నాయకత్వం, మా కార్యకర్తల పట్టుదల. ఈ రోజు చుట్టూ జరుగుతున్న పరిణామాలను చూస్తే ఒక విషయం స్పష్టంగా తెలుస్తోంది. ఒక ప్రాంతీయ పార్టీగా మన సిద్ధాంతాల కోసం నిలబడాలి. మన కార్యకర్తల కోసం నిలబడాలి. ఆ నిబద్ధతను మరింత బలోపేతం చేయాలి. అనేక ఎన్నికలు గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత తమ సిద్ధాంతాలను కోల్పోయిన కొన్ని పార్టీలు ఇబ్బందులను ఎదుర్కొన్నాయి. కానీ తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో గెలిచినా, ఓడినా ఎప్పుడూ తన సిద్ధాంతాల విషయంలో దృఢంగానే నిలిచింది. గతంలో మా పార్టీ ఎంపీలు ఫిరాయించినా మేం పోరాడాం, ప్రజల పక్షాన నిలిచాం. అందుకే 44 సంవత్సరాల తరువాత కూడా తెలుగుదేశం పార్టీ బలంగా నిలిచి ఉంది.
ఎన్డీయేకు భేషరతుగా మద్దతు ఇచ్చాం
ఎన్డీయే మా మద్దతు ఎప్పుడూ బేషరతుగానే ఉంటుంది. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ దేశానికి స్థిరమైన నాయకత్వం అవసరమని ప్రాథమికంగా విశ్వసిస్తారు. నేడు ప్రపంచం భారతదేశాన్ని స్థిరత్వానికి ప్రతీకగా చూస్తోంది. అలాంటి సమయంలో దేశానికి స్థిరమైన నాయకత్వం అవసరం. 2024లో మేం ఎన్డీయేలో తిరిగి చేరినప్పుడు ఎలాంటి షరతులు పెట్టలేదు. ఇప్పటికీ మా మద్దతు బేషరతుగానే కొనసాగుతోంది. అయితే విధానాల విషయంలో మాకు అభిప్రాయాలు ఉంటాయా అంటే కచ్చితంగా ఉంటాయి. కానీ వాటిని నాలుగు గోడల మధ్య, అంతర్గత చర్చల ద్వారానే వ్యక్తం చేస్తాం. వక్ఫ్ బిల్లుపై కూడా మా అభిప్రాయాలను తెలియజేశాం. దానిని సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపారు. విస్తృత సంప్రదింపులు జరిగాయి. మేం ముఖ్యమని భావించిన కొన్ని సూచనలు చేర్చిన తర్వాతే అది ఓటింగ్‌కు వచ్చింది. డీలిమిటేషన్ అంశంలో కూడా బిల్లు వచ్చిన వెంటనే అర్థరాత్రి వరకు దానిని పరిశీలించి, చట్టపరమైన అంశాలను అధ్యయనం చేసి, మా నాయకుడు చంద్రబాబునాయుడు గారికి నివేదిక పంపాను. అనంతరం ఎన్డీయే ఈ విషయాన్ని చర్చించాం. కాబట్టి మాకు అభిప్రాయాలు ఉన్నాయి.
రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎలాంటి రాజీపడబోం
తెలుగు ప్రజల ప్రయోజనాలను కాపాడటంలో ఎలాంటి రాజీ లేదు. కానీ వాటిని బాధ్యతాయుతంగా, అంతర్గత చర్చల ద్వారానే వ్యక్తపరుస్తాం. మా అభిప్రాయాలకు కేంద్రంలో ఎప్పుడూ ప్రాధాన్యం లభించింది. ఏ అంశంపైనానా మా అభిప్రాయాన్ని వ్యక్తపరచాలి అనుకున్నప్పుడు.. కేంద్ర నాయకత్వం తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంచింది. రాష్ట్ర ప్రయోజనాల కోసం, దేశ ప్రయోజనాల కోసం అవసరమైన సంస్కరణల విషయంలో కూడా మా సూచనలకు ప్రాధాన్యం లభించింది. ఇందుకు ఒక ఉదాహరణ చెబుతాను. గూగుల్‌తో మా చర్చలు సుమారు 13 నెలల క్రితమే ప్రారంభమయ్యాయి. వారు శాశ్వత స్థాపన పన్ను విధానంలో కొన్ని మార్పులు కోరారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు నేరుగా ప్రధాని నరేంద్ర మోదీ గారితో మాట్లాడారు. తన అభిప్రాయాలు చెప్పారు. ప్రధాని కూడా అంగీకరించారు. అనంతరం ప్రధాని కార్యాలయమే ఆ సంస్కరణలను ముందుకు తీసుకెళ్లింది. అందువల్ల ఒక ప్రాంతీయ పార్టీగా మా స్వరం వినబడుతోందని నేను నిజాయితీగా నమ్ముతున్నాను.
జీవితంలో కష్టమైన మార్గాన్నే ఎంచుకున్నాను
నేను జీవితంలో ఎప్పుడూ సులభమైన మార్గాన్ని కాకుండా కష్టమైన మార్గాన్నే ఎంచుకున్నాను. 1985 నుంచి మా పార్టీ గెలవని నియోజకవర్గం నుంచి నేను పోటీ చేశాను. 2019లో నేను ఓడిపోయాను. అయినప్పటికీ ఐదేళ్ల పాటు నా నియోజకవర్గాన్ని విడిచి వెళ్లలేదు. ప్రజలకు నా సామర్థ్యం గురించి పూర్తిగా వివరించే అవకాశం నాకు రాలేదని భావించాను. ఐదేళ్ల తరువాత అదే నియోజకవర్గంలో 91 వేల ఓట్ల మెజారిటీతో గెలిచాను. అది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మూడో అతిపెద్ద మెజారిటీ. ఆసక్తికరంగా.. అత్యధిక మూడు మెజారిటీలు కూడా ఈ ఎన్నికలలోనే నమోదయ్యాయి. అలాగే నేను స్వయంగా హెచ్ఆర్డీ శాఖను ఎంచుకున్నాను. సాధారణంగా చాలా మంది విద్యాశాఖను కోరుకోరు. కానీ సమాజంలో మార్పు తీసుకురావాలంటే విద్య ద్వారానే సాధ్యమని నేను నమ్ముతాను. ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయ నియామకాలు వంటి ఎన్నో వివాదాస్పద అంశాలతో కూడిన శాఖను మేం చాలా సమర్థవంతంగా నిర్వహించగలిగాం.
ప్రజా సమస్యలు అర్థం చేసుకోవడానికి పాదయాత్ర దోహదపడింది
స్టాన్ఫోర్డ్ నాకు ఐక్యూ ఇచ్చింది.. పాదయాత్ర నాకు ఈక్యూ నేర్పింది. పాదయాత్ర నా రాజకీయ జీవితంలో ఎంతో కీలకమైంది. ప్రజల సమస్యలను అర్థం చేసుకోవడానికి అది నాకు చాలా ఉపయోగపడింది. ప్రతి నియోజకవర్గంలో ప్రజలతో మాట్లాడాను. రెండు మూడు రోజులు అక్కడే గడిపాను. అందువల్ల ఇప్పుడు ఏ సమస్య వచ్చినా దాంతో నాకు ప్రత్యక్ష అనుభవం ఉన్నట్టే అనిపిస్తుంది. అందుకే నేను తరచూ చెబుతుంటాను.. వ్యాపారానికి స్టాన్ఫోర్డ్ ఎంబీయే ఎంత ఉపయోగపడిందో, రాజకీయాలకు పాదయాత్ర అంత ఉపయోగపడింది అని. స్టాన్ఫోర్డ్ నాకు ఐక్యూ ఇచ్చింది, పాదయాత్ర నాకు ఈక్యూ ఇచ్చింది.
గత ప్రభుత్వంలో వ్యవస్థలన్నీ పతనం అయ్యాయి
రెడ్ బుక్ గురించి మాట్లాడుతూ.. 2019-2024 మధ్య వ్యవస్థల పతనాన్ని ప్రత్యక్షంగా చూశాను. నేను పుట్టినప్పటి నుంచే రాజకీయ వ్యవస్థను చూస్తూ పెరిగాను. ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దాదాపు 14 రోజుల తర్వాత నేను జన్మించాను. కార్యకర్తలు ఎలా పనిచేస్తారో, ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు ఎలా వ్యవహరించేవారో చిన్నప్పటి నుంచే చూశాను. కానీ 2019 నుంచి 2024 మధ్య కాలంలో నేను తొలిసారిగా సంస్థాగత వ్యవస్థల పతనాన్ని చూశాను. నాపై 23 కేసులు పెట్టారు. అందులో హత్యాయత్నం కేసు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా ఉన్నాయి. చట్టాన్ని ఉల్లంఘించిన వారిని నేను బాధ్యుల్ని చేయకపోతే, దీనికి అంతం ఎక్కడ ఉంటుంది? రాజ్యాంగాన్ని పరిరక్షించడానికే కదా మనం ఎన్నికయ్యాం? 2019 నుంచి 2024 మధ్య జరిగిన విషయాలను యూట్యూబ్‌లో చూసినా తెలుస్తుంది. కొన్ని రోజుల పాటు చంద్రబాబు నాయుడు గారు తన ఇంటి బయటకు కూడా రావడానికి అనుమతి ఇవ్వలేదు. పోలీసులు ఆయన ఇంటి గేటుకు తాళ్లు కట్టి అడ్డుకున్నారు. కానీ ఈరోజు జగన్ ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళుతున్నారు. మేం ఎక్కడా అడ్డుకోవడం లేదు.
టీడీపీ ఎప్పుడూ ప్రతీకార రాజకీయాలను ప్రోత్సహించలేదు
చట్టాన్ని ఉల్లంఘించినవారు చట్ట ప్రకారం శిక్ష అనుభవించాల్సిందే. రెడ్ బుక్ గురించి నేను బహిరంగంగానే మాట్లాడాను. ప్రతి బహిరంగ సభలో నేను రెడ్ బుక్‌ను చూపిస్తూ.. చట్టాన్ని ఉల్లంఘించిన వారిని న్యాయస్థానాల ముందు నిలబెడతామని ప్రజలకు చెప్పాను. నిజంగా ప్రతీకార రాజకీయాలు చేయాలనుకుని ఉంటే జగన్ ఈరోజు బయట ఉండేవారా? చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ ప్రతీకార రాజకీయాలను విశ్వసించరు. 44 ఏళ్ల చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీ కూడా అలాంటి రాజకీయాలను ఎప్పుడూ ప్రోత్సహించలేదు. కానీ నేరం చేసినవారు, చట్టాన్ని ఉల్లంఘించినవారు చట్టం ముందు సమాధానం చెప్పాల్సిందే. ఇది వ్యక్తిగత ద్వేషం కాదు.
డేటా సెంటర్లే కొత్త రిఫైనరీలు
డేటా కొత్త చమురు అయితే.. డేటా సెంటర్లు కొత్త రిఫైనరీలు. ప్రపంచంలో ఇప్పుడు డేటానే కొత్త చమురు. డేటా సెంటర్లే కొత్త రిఫైనరీలు. దీనిని ఎంత త్వరగా అంగీకరిస్తామో, అంత త్వరగా వాస్తవాలకు దగ్గరవుతాం. మన మొబైల్ ఫోన్లు, డిజిటల్ సేవలన్నీ డేటా సెంటర్లపైనే ఆధారపడి ఉన్నాయి. ప్రతి సంవత్సరం గోదావరి నది నుంచి సుమారు 3వేల టీఎంసీల నీరు సముద్రంలో కలిసిపోతుంది. ఇది బ్రెజిల్ లేదా వియత్నాం దేశాల వార్షిక నీటి వినియోగం కంటే ఎక్కువ. ఆంధ్రప్రదేశ్‌లో 6 గిగావాట్ల డేటా సెంటర్ సామర్థ్యాన్ని ఏర్పాటు చేయాలని మేం భావిస్తున్నాం. దానికి కేవలం ఒకటిన్నర నుంచి రెండు టీఎంసీల నీరు మాత్రమే అవసరం. ఇక ఒక గిగావాట్ థర్మల్ పవర్ ప్లాంట్‌కు, ఒక గిగావాట్ డేటా సెంటర్‌తో పోలిస్తే ఏడు రెట్లు ఎక్కువ నీరు అవసరం. విద్యుత్ అవసరమని అందరూ అంగీకరిస్తారు. మరి డేటా సెంటర్లను ఎందుకు ప్రశ్నించాలి? ఆంధ్రప్రదేశ్‌లో సౌరశక్తి, పవనశక్తి, పంప్ స్టోరేజ్, జలవిద్యుత్ ప్రాజెక్టులు ఉన్నాయి. అందుకే డేటా సెంటర్లకు అవసరమైన పునరుత్పాదక శక్తిని అందించగలుగుతున్నాం.
డేటా సెంటర్ల ద్వారా ఉద్యోగాల కల్పన జరుగుతుంది
డేటా సెంటర్లు ఉద్యోగాల సృష్టికి ఉత్ప్రేరకాలుగా పనిచేస్తాయి. డేటా సెంటర్లు ఒక్కటే ఉద్యోగాలను సృష్టించవు. కానీ అవి ఉద్యోగాల సృష్టికి ఒక ఉత్ప్రేరకంగా పనిచేస్తాయి. డేటా సెంటర్ల చుట్టూ మొత్తం ఎకోసిస్టమ్‌ను ఆంధ్రప్రదేశ్‌కు తీసుకురావాలనేది మా లక్ష్యం. ఉదాహరణకు క్యారియర్ అనే ఎయిర్ కండీషనింగ్ సంస్థ, డేటా సెంటర్లకు అవసరమైన శీతలీకరణ పరికరాల అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టింది. పవర్ ఎలక్ట్రానిక్స్, బ్లేడ్ సర్వర్లు, ర్యాక్‌లు వంటి మొత్తం వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నాం. దీని ద్వారా పెద్ద ఎత్తున ఉద్యోగాలు సృష్టించవచ్చు.
ఉద్యోగాల సృష్టే మా ప్రధాన లక్ష్యం
ఉద్యోగాల సృష్టే మా ప్రధాన లక్ష్యం. రాష్ట్రాలు పరస్పరం పోటీ పడాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో మేం చేసే ప్రతి పనిలో ప్రధాన లక్ష్యం ఉద్యోగాల కల్పనే. కొంతమంది మేం తొందరపాటుగా నిర్ణయాలు తీసుకుంటున్నామని అంటారు. నేను దాన్ని స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటాను. పక్క రాష్ట్రంలో దశాబ్దాలుగా నిలిచిపోయిన ఒక ఉక్కు ప్రాజెక్టును మేం 17 నెలల్లో పూర్తి చేశాం. భారతదేశానికి చెందిన అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (AMCA) ప్రాజెక్టును కేవలం 37 రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌కు తీసుకురాగలిగాం. దీనినే నేను స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటాను.
ఫార్చ్యూన్ 500 కంపెనీలకు 99 పైసలకే భూమి కేటాయిస్తాం
ఆంధ్రప్రదేశ్‌లో లిఫ్ట్ పాలసీ అనే ఒక విధానం ఉంది. ఫార్చ్యూన్ 500 కంపెనీలు తమ గ్లోబల్ కెపబిలిటీ సెంటర్లను (GCC) ఏర్పాటు చేయాలనుకుంటే, వారికి 99 పైసలకు భూమిని కేటాయిస్తాం. ఈ విధానం ద్వారా కాగ్నిజెంట్, టీసీఎస్, ఇన్ఫోసిస్, ఐబీఎం వంటి సంస్థలను ఆంధ్రప్రదేశ్‌కు తీసుకురాగలిగాం. మరికొన్ని కంపెనీలు కూడా త్వరలో రానున్నాయి. నా ఆలోచన చాలా సరళమైంది. భూమిని మార్కెట్ ధరకు విక్రయించి డబ్బు తీసుకోవచ్చు. కానీ 99 పైసలకు ఇచ్చి, ఆ కంపెనీలు క్యాంపస్‌లు నిర్మించి ఉద్యోగాలను సృష్టిస్తే, వాటి ద్వారా ఏర్పడే ఆర్థిక ప్రభావం, పన్నుల రూపంలో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ప్రతి సంవత్సరం ఆ భూమి విలువ కంటే ఎక్కువగా ఉంటుంది. వ్యాపారవేత్తల దృష్టిలో చూస్తే, ఆ పెట్టుబడిపై నా లాభాల రేటు 100 శాతం. అయితే ఇలాంటి ధైర్యమైన నిర్ణయాలు తీసుకునే నాయకత్వం ఉండాలి. లేకపోతే భారత్ ఎలా ముందుకు సాగుతుంది. ఈ విధానం కోసం నేను నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారినే ఒప్పించాల్సి వచ్చింది. మొదట్లో ఆయనకు కూడా ఈ విధానంపై సందేహాలు ఉండేవి. దీనిపై కోర్టుకు కూడా వెళ్లారు. కానీ న్యాయస్థానం దానిని స్వీకరించలేదు. ఎందుకంటే ఫార్చ్యూన్ 500 కంపెనీలు రాష్ట్రానికి వస్తే అందులో తప్పేముందని కోర్టు ప్రశ్నించింది. మేం చేసే ప్రతి పని కాలపరీక్షను, రాజకీయ పరీక్షను తట్టుకునే విధంగానే ఉంటుంది. ఇది ఎవరికైనా వ్యక్తిగత ప్రయోజనాలు కల్పించడం కాదు. నా కంపెనీకి గానీ, నా స్నేహితుల కంపెనీలకు గానీ లాభాలు చేకూర్చడం కాదు. ఇవి ప్రపంచస్థాయి ప్రమాణాలు కలిగిన ఫార్చ్యూన్ 500 కంపెనీలు. భారత్‌కు అవసరమైన విధానపరమైన విప్లవం ఇదే. దేశం ముందుకు సాగాలంటే ఇలాంటి ధైర్యమైన నిర్ణయాలు అవసరమని మంత్రి పేర్కొన్నారు.








