సిక్కు ఓటు కాపాడుకుంటూ, హిందూ ఓటర్ల ఆకర్షణ.. పంజాబ్ లో కాంగ్రెస్ కొత్త గేమ్
పంజాబ్ లో తిరిగి పాగా వేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ప్రస్తుతం అక్కడ ఆమ్ ఆద్మీ అధికారంలో వుంది. నిజానికి అది కాంగ్రెస్ కంచుకోట. గతంలో కెప్టెన్ అమరీందర్ సింగ్ ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత అమరీందర్ సింగ్ బీజేపీలో చేరిపోవడం, కీలక నేతలు పార్టీని వదిలేయడంతో అక్కడ కాంగ్రెస్ బలహీనపడింది. మళ్లీ ఇప్పుడు పుంజుకోవాలని చూస్తోంది.
ఈ నేపథ్యంలో రాష్ట్ర నాయకత్వంలో సమూల మార్పులు చేసే అంశాన్ని పార్టీ అధిష్టానం పరిశీలిస్తోంది. ఇందులో భాగంగా, రాహుల్ గాంధీ పంజాబ్‌కు చెందిన ఐదుగురు అగ్రనేతలతో ముఖాముఖి సమావేశాలు నిర్వహించారు. అయితే ఈ సారి బీజేపీ పంజాబ్ లో పాగా వేయాలని వ్యూహాలు వేస్తోంది. మరోవైపు ఆప్ తిరిగి అధికారాన్ని చేజిక్కించుకోవాలని పట్టుదలతో వుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పుంజుకోవడం సాధ్యమా? అన్న ప్రశ్న కూడా వస్తోంది.
అయితే.. దీనికి విరుగుడుగా రాష్ట్ర స్థాయిలోని నాయకత్వాన్ని పూర్తిగా మార్చాలని కాంగ్రెస్ అధిష్ఠానం డిసైడ్ అయ్యింది. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులను అంచనా వేయడానికి, అలాగే రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం పంజాబ్ కాంగ్రెస్ నాయకత్వాన్ని ఎవరికి అప్పగించాలనేది నిర్ణయించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేశారు.ఈ కమిటీ తన నివేదికను పార్టీకి సమర్పించింది. ఈ నేపథ్యంలో, రాహుల్ గాంధీ ప్రధాన పోటీదారులుగా ఉన్న ఐదుగురిని విడివిడిగా కలిశారు. ఎవర్ని అధ్యక్షులుగా వుంచాలన్న దానిపై రాహుల్ టీమ్ తర్జన భర్జన పడుతోంది. ఈ కోవలో మొదట మల్లికార్జున ఖార్గేతో, రాహుల్ గాంధీ కీలక నేతలు సమావేశమయ్యారు. ఆ తర్వాత అజయ్ మాకెన్, మీనాక్షి నటరాజన్ తో కూడా భేటీలు జరిగాయి.
పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ, కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకుడు ప్రతాప్ సింగ్ బజ్వా, రైతు నేపథ్యం కలిగిన ఎమ్మెల్యే విజయ్ ఇందర్ సింగ్లా, రాజ్యసభ ఎంపీ అమర్ సింగ్ మరియు మాజీ ఉప ముఖ్యమంత్రి సుఖ్జిందర్ సింగ్ రంధావాతో రాహుల్ చర్చిస్తున్నారు.కాంగ్రెస్ పార్టీ తన సంప్రదాయ సిక్కు ఓటు బ్యాంకును నిలుపుకుంటూనే, హిందూ ఓటర్లను ఆకట్టుకోవడం ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీ నుండి అధికారాన్ని తిరిగి చేజిక్కించుకోవాలని, బీజేపీకి సవాల్ విసరాలని చూస్తోంది.








