నోరెళ్లబెట్టే లెక్కలు! ఒక ఎమ్మెల్యే లేదా ఎంపీ కావాలంటే నిజంగా ఎన్ని కోట్లు కావాలి?
— శివ దువ్వూరు
మనం ఎప్పుడూ కొన్ని తప్పుడు ప్రశ్నలు అడుగుతూంటాం.
ఒక ఎంపీ జీతం ఎంత?
ఒక ఎమ్మెల్యేకు ఎన్ని అలవెన్సులు వస్తాయి?
ప్రజాప్రతినిధులకు ఎన్ని సౌకర్యాలు ఉన్నాయి? ఇలాంటివే…
సోషల్ మీడియాలో, వాట్సాప్ గ్రూపుల్లో, టీ స్టాళ్ల దగ్గర… ఈ చర్చ ఎక్కువగా జరుగుతుంది. కానీ ఈ క్రమంలో అవసరమైన ఓ ప్రశ్న మాత్రం ఎక్కడో మిస్సవుతోంది. అదేంటో తెలుసా?
ఒక ఎంపీ కావడానికి ఎంత ఖర్చవుతుంది? ఒక ఎమ్మెల్యే సీటు గెలవడానికి ఎంత డబ్బు ఖర్చవుతుంది అని. ఎందుకంటే ..2024 ఎన్నికల్లో భారతదేశం ఖర్చు చేసిన మొత్తం అమెరికా ఎన్నికల ఖర్చును కూడా దాటిపోయింది. అదెంత..అలా ఎలా జరిగింది అంటారా?
₹1.35 లక్షల కోట్లు
దేశం మొత్తం కలిపి 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఖర్చైన మొత్తం డబ్బు దాదాపు ₹1.35 లక్షల కోట్లు అని నివేదికలు చెబుతున్నాయి. ఈ సంఖ్య ఎంత పెద్దదంటే… భారత్ ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం మాత్రమే కాదు… ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ప్రజాస్వామ్యంగా కూడా మారుతోందా అనే ప్రశ్నను లేవనెత్తే స్థాయిలో ఉంది.
ఎన్నికల ఖర్చు గ్రాఫ్
2014 → ₹30,000 కోట్లు
2019 → ₹60,000 కోట్లు
2024 → ₹1,35,000 కోట్లు
అంటే… కేవలం 10 ఏళ్లలో ఎన్నికల ఖర్చు నాలుగు రెట్లు పెరిగింది
లక్షల లెక్కలు కాగితాలపై… కోట్ల లెక్కలు క్షేత్రస్థాయిలో!
ఎన్నికల సంఘం ప్రకారం ఒక లోక్‌సభ అభ్యర్థి గరిష్టంగా ₹95 లక్షలు మాత్రమే ఖర్చు చేయాలి. ఎమ్మెల్యే అభ్యర్థులకు కూడా పరిమితి ఉంది. కాగితాలపై చూస్తే అంతా బాగానే కనిపిస్తుంది. కానీ రాజకీయాలను దగ్గరగా గమనించే వారికి ఒక విషయం స్పష్టంగా తెలుసు.
ఎన్నికలు నామినేషన్‌తో మొదలవ్వవు. దానికి నెలల ముందు నుంచే మొదలవుతాయి. ప్రచారానికి టీమ్ లు , సోషల్ మీడియా టీమ్‌లు, సర్వేలు, వ్యూహకర్తలు, కార్యకర్తల నిర్వహణ, సమావేశాలు, ర్యాలీలు… ఇవన్నీ అధికారిక లెక్కల్లో కనిపించవు.
అందుకే ఒక తీవ్రమైన పోటీ ఉన్న ఎంపీ స్థానం కోసం ₹30 కోట్ల నుంచి ₹50 కోట్ల వరకు ఖర్చవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. కొన్ని అసెంబ్లీ స్థానాల్లో కూడా ఖర్చు ₹10 కోట్ల నుంచి ₹25 కోట్ల వరకు వెళ్తోందని అంచనాలు ఉన్నాయి.
ఎందుకింత ఖర్చు?
ఒకప్పుడు ఎన్నికల ప్రచారం అంటే పోస్టర్లు, పాంప్లేట్లు, కొన్ని సభలు. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. డిజిటల్ వార్ రూమ్స్. డేటా అనలిటిక్స్. మీడియా ప్రకటనలు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు. ప్రత్యేక పీఆర్ టీమ్ లు. హెలికాప్టర్లు. భారీ కాన్వాయ్‌లు. వేలాది మంది కార్యకర్తల నిర్వహణ. ఇవన్నీ చూస్తే… ఎలక్షన్స్ ఇప్పుడు కార్పొరేట్ మార్కెటింగ్ క్యాంపెయిన్ గా అనిపిస్తున్నాయి.
ఖచ్చితంగా చెప్పాలంటే …ఒక కంపెనీ తన ఉత్పత్తిని అమ్మడానికి ఎంత ప్లాన్ చేస్తుందో… రాజకీయ పార్టీలు కూడా ఓటును పొందడానికి అంతే ప్రణాళికతో పనిచేస్తున్నాయి.
₹1.35 లక్షల కోట్లు అంటే ఎంత?
సంఖ్య వినడానికి పెద్దగా అనిపిస్తుంది. కానీ దాని పరిమాణం అర్థం కావాలంటే మరో కోణంలో చూడాలి. ఆ డబ్బుతో వేలాది ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరించవచ్చు. వందలాది ప్రభుత్వ ఆసుపత్రులను నిర్మించవచ్చు. లక్షల మంది విద్యార్థులకు ఉన్నత విద్య అవకాశాలు కల్పించవచ్చు. కానీ ఆ మొత్తం డబ్బు కేవలం కొన్ని వారాల ఎన్నికల ప్రచారంలో ఖర్చయిందంటే ఆశ్చర్యం వేస్తుంది. ఇవి లేకుండా ఎన్నికలలో పోటీ చెయ్యలేమా అంటే..పోటీ ప్రపంచంలో తప్పదు అంటారు.
పట్టుబడిన డబ్బే ఇంతుంటే…
ఎన్నికల సమయంలో నగదు, మద్యం, బంగారం, బహుమతులు పట్టుబడ్డాయనే వార్తలు మనం తరచూ చూస్తుంటాం. కానీ వాటి మొత్తం విలువ ఎప్పుడైనా గమనించారా?
2019 ఎన్నికల్లో సీజ్ చేసిన నగదు, బంగారం, మద్యం, డ్రగ్స్ తదితర వస్తువుల విలువ ₹3,477 కోట్లు.
2024లో అది ₹10,000 కోట్లకు పైగా చేరింది.
అంటే ఐదేళ్లలో దాదాపు మూడు రెట్లు పెరిగింది. ఇక్కడ మరో ప్రశ్న కూడా ఉంది. పట్టుబడింది ఇంత ఉంటే… పట్టుబడనిది ఎంత ఉంటుంది? ఒక్క సారి ఆలోచించండి.
ఓటు విలువ ఎంత?
మనం ఓటు వేయడానికి పోలింగ్ బూత్‌కు వెళ్తాం. కొన్ని నిమిషాల్లో పని అయిపోతుంది. కానీ ఆ ఒక్క ఓటు కోసం రాజకీయ వ్యవస్థ ఎంత ఖర్చు పెడుతోందో లెక్కలు తెలిస్తే మతిపోతుంది.
CMS అంచనాల ప్రకారం 2024 ఎన్నికల్లో ఒక్కో ఓటరుపై సగటున దాదాపు ₹1,400 ఖర్చయింది. అంటే నలుగురు ఓటర్లు ఉన్న ఒక కుటుంబం కోసం సగటున ₹5,600.
ఇది వింటే మరో ప్రశ్న వస్తుంది.
ఒక ఓటు కోసం ఇంత ఖర్చు పెట్టే వ్యవస్థ… ఆ ఓటు వెనుక ఉన్న పౌరుడి జీవితాన్ని మెరుగుపరచడానికి ఎంత ఖర్చు పెడుతోంది? అని.
అసలు ప్రమాదం ఇక్కడే ఉంది
ప్రజాస్వామ్యం అందరికీ అవకాశం ఇవ్వాలి. కానీ ఎన్నికలు రోజు రోజుకీ మరింత ఖరీదైనవిగా మారుతున్న కొద్దీ ఒక ప్రమాదం పెరుగుతోంది. సామర్థ్యం ఉన్నవాళ్లు కాదు… సంపద ఉన్నవాళ్లు ముందుకు వచ్చే పరిస్థితి ఏర్పడుతోంది.
ఎన్నికలు అంటే అభ్యర్ధుల మధ్య పోటీగా కాకుండా… ఆర్థిక శక్తుల పోటీగా మారే ప్రమాదం వచ్చేసింది. ఈ క్రమంలో రాజకీయాల్లోకి రావాలనుకునే ఒక సాధారణ ఉపాధ్యాయుడు, ఒక రైతు, ఒక సామాజిక కార్యకర్తకు నిజంగా అవకాశం ఉంటుందా?
అందుకే ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే నాయకుల జీతాలను మాత్రమే కాదు… ఎన్నికల్లో ప్రవహిస్తున్న డబ్బును కూడా ప్రశ్నించాలి.








