విజయవాడలో హైడ్రామా.. సాయికృష్ణ కేసులో ట్విస్ట్..!
ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర సంచలనం సృష్టిస్తున్న గాదె సాయికృష్ణ(Gade Sai Krishna) కస్టోడియల్ డెత్ వ్యవహారంలో మరో భారీ ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ కేసులో విచారణ ఎదుర్కొంటున్న కృష్ణలంక(Krishna Lanka) పోలీస్ స్టేషన్‌కు చెందిన ఆరుగురు కానిస్టేబుళ్లు ఒక్కసారిగా అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. నిన్న మధ్యాహ్నం నుంచి వీరి ఆచూకీ లభించకపోవడం, ఫోన్లు కూడా స్విచ్ఛాఫ్ రావడంతో ఖాకీ వర్గాల్లో తీవ్ర కలకలం రేగుతోంది. సాయికృష్ణ లాకప్ డెత్ వ్యవహారంపై ఐజీ రవిప్రకాష్ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారణను అత్యంత వేగవంతం చేసింది.
మే 9న సాయికృష్ణను మార్కాపురం నుంచి విజయవాడకు తరలించిన టాస్క్ ఫోర్స్ సిబ్బందితో పాటు, ఆ రోజు స్టేషన్లో డ్యూటీలో ఉన్న ఆరుగురు కానిస్టేబుళ్లను విచారించడానికి సిట్ సిద్ధమైంది. సీఐ నాగరాజుపై 302 (హత్య కేసు) నమోదు కావడంతో, తదుపరి అరెస్టులు తమవే ఉంటాయన్న భయంతోనే నిన్న మధ్యాహ్నం నుంచి ఈ ఆరుగురు కానిస్టేబుళ్లు ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసి అండర్‌గ్రౌండ్‌లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. టాస్క్ ఫోర్స్ ఏడీసీపీ లతాకుమారిని కూడా అధికారులు ఇప్పటికే సుదీర్ఘంగా ప్రశ్నించారు.
శ్మశాన వాటిక రికార్డులు, పోలీస్ స్టేషన్ లాగ్‌బుక్స్‌ను పరిశీలిస్తున్న తరుణంలో.. నాటి ఘటనతో సంబంధం ఉన్న కానిస్టేబుళ్లపై సిట్ ఉచ్చు బిగిస్తున్నట్లు లీకులు వచ్చాయి. ఈ క్రమంలోనే అరెస్టులకు భయపడి సదరు కానిస్టేబుళ్లు అండర్‌గ్రౌండ్‌లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో కృష్ణలంక సీఐ నాగరాజుపై హత్య (Section 302), తప్పుడు నిర్బంధం కేసు నమోదు చేసి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. సాయికృష్ణను చిత్రహింసలు పెట్టి చంపేసి, అనాథ శవంగా చిత్రీకరించి గుట్టుచప్పుడు కాకుండా అంత్యక్రియలు చేసేశారన్న ఆరోపణలపై హైకోర్టు కూడా సీరియస్‌గా ఉంది.
ఈ తరుణంలో ఆరుగురు కానిస్టేబుళ్లు అదృశ్యం కావడం ఈ కేసులో మరిన్ని సంచలన నిజాలు బయటకు రాబోతున్నాయనే దానికి సంకేతంగా కనిపిస్తోంది. సాయికృష్ణను చంపేసి గుట్టుచప్పుడు కాకుండా కాల్చేశారన్న తల్లి విజయలక్ష్మి ఆరోపణల నేపథ్యంలో.. పోలీసులు కృష్ణలంకలోని స్వర్గపురి ఎలక్ట్రిక్ శ్మశాన వాటిక రికార్డులను సీజ్ చేసి 11 మంది సిబ్బందిని విచారించారు.








