చంద్రబాబు చెప్పినా వినని.. ఆక్వా ఫీడ్ కంపెనీలు..!
ఆంధ్రప్రదేశ్లో ఆక్వా సాగు సంక్షోభంలో కూరుకుపోతున్న తరుణంలో, ఆక్వా ఫీడ్(Aqua Feed) తయారీ కంపెనీలు సాగుదారులకు తీవ్ర అన్యాయం చేస్తున్నాయి. నిలకడలేని మార్కెట్ ధరలు, పెరిగిన పెట్టుబడులతో నష్టాల్లో ఉన్న ఆక్వా రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం తీసుకున్న చొరవకు ఫీడ్ కంపెనీలు మొండిచేయి చూపించాయి. ఫీడ్ ధరలను ఆశించిన స్థాయిలో తగ్గించకుండా కంపెనీలు తమ ఏకపక్ష వైఖరిని ప్రదర్శిస్తుండటంపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆక్వా రైతులు తీవ్రంగా మండిపడుతున్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో పెట్టుబడి భారాన్ని తగ్గించేందుకు ఆక్వా ఫీడ్ ధరను కిలోకు కనీసం రూ. 4 చొప్పున తగ్గించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫీడ్ తయారీ కంపెనీలకు స్పష్టమైన సూచనలు చేసింది. అయితే, ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ కంపెనీలు ఇష్టారాజ్యంగా వ్యవహరించాయి. కేవలం రూ. 2 మాత్రమే తగ్గిస్తున్నట్లు పేర్కొంటూ ఫీడ్ తయారీ అసోసియేషన్లు ఒక లేఖను విడుదల చేశాయి. ప్రభుత్వ ప్రతిపాదనలో సగం మాత్రమే తగ్గించి చేతులు దులుపుకోవాలని చూడటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఫీడ్ కంపెనీల ఈ మొండి వైఖరిపై ఆక్వా సాగుదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే విద్యుత్ ఛార్జీలు, విత్తనం ధరలు, రవాణా ఖర్చులు పెరిగిపోయి ఆక్వా సాగు భారంగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో మేత ధరలపై కార్పొరేట్ కంపెనీలు సిండికేట్గా మారి దోపిడీ చేస్తున్నాయని, ప్రభుత్వం చెప్పిన ధర తగ్గింపును అమలు చేయకపోవడం దుర్మార్గమని ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని, కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలని, కిలోకు రూ. 4 ధర తగ్గేలా కఠినమైన ఉత్తర్వులు జారీ చేయాలని ఆక్వా రైతులు డిమాండ్ చేస్తున్నారు.








