మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభరెడ్డికి తీవ్ర అస్వస్థత..!
కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ(YSRCP) సీనియర్ నాయకుడు ముద్రగడ(Mudragada) పద్మనాభరెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి క్షిణించడంతో మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు ఆయనను శనివారం హైదరాబాద్కు తరలించారు. ప్రస్తుతం హైదరాబాద్లోని ఒక ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయనకు ప్రత్యేక వైద్యుల బృందం పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు.
వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తూ అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ముద్రగడ ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఆందోళన చెందాల్సిన పనిలేదని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. అయితే, వయోభారం మరియు కిడ్నీ సమస్యల రీత్యా ఆయన శరీరం పూర్తిగా కోలుకోవడానికి సమయం పడుతుందని వైద్యులు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఆయనకు కనీసం 10 రోజుల పాటు పూర్తి బెడ్ రెస్ట్ అవసరమని డాక్టర్లు గట్టిగా సూచించారు. ఈ సమయంలో ఎవరినీ కలవడానికి అనుమతించవద్దని కుటుంబ సభ్యులకు స్పష్టం చేశారు.
ముద్రగడ అస్వస్థతకు గురైన వార్త తెలియడంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ఆయన అభిమానులు, కాపు సామాజిక వర్గ నేతలు మరియు వివిధ రాజకీయ పార్టీల ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సోషల్ మీడియా వేదికగా సందేశాలు పంపుతున్నారు. గతంలోనూ ఆయనకు కిడ్నీ సమస్యలతో పాటు షుగర్ లెవెల్స్ పడిపోవడంతో అత్యవసర వైద్యం అందించిన సంగతి తెలిసిందే. ఈ తాజా పరిణామాలపై ముద్రగడ కుటుంబ సభ్యుల నుండి లేదా ఆసుపత్రి యాజమాన్యం నుండి పూర్తిస్థాయి అధికారిక హెల్త్ బులెటిన్ వెలువడాల్సి ఉంది.








