ఫిలడెల్ఫియాలో మాటా 2వ కన్వెన్షన్-2వరోజు వేడుకలు
మాటా (మన అమెరికన్ తెలుగు అసోసియేషన్) 2వ కన్వెన్షన్ వేడుకల్లో భాగంగా రెండో రోజు శనివారం అత్యంత వైభవంగా కార్యక్రమాలు జరిగాయి. తొలి రోజు జరిగిన బాంక్వెట్ వేడుకలకు 5,000 మందికి పైగా హాజరుకాగా, రెండో రోజు దాదాపు 8,000 మందికిపైగా వచ్చారని నిర్వాహకులు తెలిపారు. భక్తిశ్రద్ధల మధ్య నిర్వహించిన శ్రీ భద్రాచల సీతారామ కళ్యాణం కార్యక్రమంతో రెండో రోజు కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు, యువజన వేదిక, వ్యాపార వేదిక, రాజకీయ వేదిక, న్యాయవాదుల వేదిక, మాట్రిమోనీ సమావేశం, సిఎంఈ కార్యక్రమాలు, జేఎన్టీయూ పూర్వ విద్యార్థుల సమావేశం, కవి సమ్మేళనం తదితర ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి.
మాటా మీడియా మరియు పీఆర్ ఛైర్మన్ ప్రశాంత్ శ్రీపెరంబుదూరు మాట్లాడుతూ, తెలుగు కుటుంబాలు, యువత, వ్యాపారవేత్తలు, వృత్తి నిపుణులు మరియు సామాజిక నాయకులను ఒకే వేదికపైకి తీసుకువచ్చే శక్తివంతమైన కార్యక్రమంగా మాటా మహాసభలు నిలిచాయని తెలిపారు. అమెరికా నలుమూలల నుంచి వస్తున్న విశేష స్పందన తెలుగు సమాజ ఐక్యతకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ (డీఎస్పీ) ప్రత్యక్ష సంగీత విభావరి మహాసభలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఆధ్యాత్మికత, సంస్కృతి, వృత్తిపరమైన చర్చలు, సామాజిక అనుబంధాలు మరియు వినోద కార్యక్రమాల సమ్మేళనంగా జరుగుతున్న మాటా 2వ జాతీయ మహాసభ ఉత్తర అమెరికాలోని ప్రముఖ తెలుగు వేడుకలలో ఒకటిగా ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంటోంది.








