కోట్ల విలువైన ఆభరణాలను పోగొట్టుకున్న రియా
బాలీవుడ్ ప్రముఖ స్టైలిస్ట్ మరియు నిర్మాత రియా కపూర్(Rhea Kapoor)కు సంబంధించిన ఖరీదైన ఆభరణాల మాయమైన ఘటన సినీ, ఫ్యాషన్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అంతర్జాతీయ ఫ్యాషన్ వేడుక మెట్ గాలా(Met Gala) కోసం ప్రత్యేకంగా రెంట్ కు తీసుకున్న విలువైన డైమండ్ ఇయర్ రింగ్స్ కనిపించకపోవడంతో ఈ వ్యవహారం పోలీసు దర్యాప్తు దశకు చేరుకుంది. రియా కపూర్ టీమ్‌తో కలిసి ప్రయాణించిన మేకప్ ఆర్టిస్ట్ సవ్లీన్ సింగ్ వద్ద ఈ ఆభరణాలు భద్రపరిచినట్లు సమాచారం. ముంబై నుంచి విదేశీ ప్రయాణం ప్రారంభించిన టీమ్, దుబాయ్ మార్గంగా న్యూయార్క్ చేరుకున్న తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది.
న్యూయార్క్‌లో హోటల్‌కు చేరుకున్న తర్వాత నగల బాక్స్‌లను తెరిచి పరిశీలించిన సమయంలో అవి ఖాళీగా ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం. దీంతో టీమ్ సభ్యులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. మిస్సైన ఆభరణాల్లో విలువైన డైమండ్, ఎమరాల్డ్ రాళ్లతో రూపొందించిన రెండు జతల చెవి పోగులు ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం వాటి విలువ సుమారు రూ.1.35 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ ఘటనతో ఫ్యాషన్ ఈవెంట్ల కోసం అద్దెకు తీసుకునే ఖరీదైన ఆభరణాల భద్రతపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
భారత్‌కు తిరిగి వచ్చిన తర్వాత ఈ విషయంపై రియా కంప్లైంట్ చేయడంతో ముంబై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రయాణంలోని ప్రతి దశను అధికారులు పరిశీలిస్తున్నారు. ముంబై విమానాశ్రయం నుంచి దుబాయ్ ట్రాన్సిట్ వరకు, అక్కడి నుంచి న్యూయార్క్ చేరుకునే వరకూ జరిగిన పరిణామాలను విశ్లేషిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్‌లు, ప్రయాణ రికార్డులు, హోటల్ వివరాలను సేకరిస్తూ ఆభరణాలు ఎక్కడ అదృశ్యమయ్యాయన్న అంశంపై స్పష్టత తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ హైప్రొఫైల్ కేసు బాలీవుడ్‌తో పాటు ఫ్యాషన్ ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షిస్తోంది.








