బ్రిటన్ లో మహర్షి సుశ్రుతుడి విగ్రహం ఆవిష్కరణ
ఆధునిక ప్లాస్టిక్ సర్జరీకి ఆద్యుడు, శస్త్రచికిత్స పితామహుడు మహర్షి సుశ్రుతుడి 90 కిలోల కాంస్య విగ్రహాన్ని యూకేలో ఆవిష్కరించారు. 1505 లో స్థాపించిన అతి పెద్ శస్త్ర చికిత్స సంస్థగా పేరు గాంచిన రాయల్ కాలేజీ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఎడిన్ బరోలోని ప్లేఫెయిర్ ఆడిటోరియంలో ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. తెలుగు మూలాలున్న బ్రిటన్ శస్త్రచికిత్స నిపుణుడు ప్రొఫెసర్ చంద్ర చెరువు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ప్రొఫెసర్ చెరువు, ఆయన కుటుంబ సభ్యులతో పాటు, సిద్ధార్థ్ మల్లిక్ (ఎడిన్బర్గ్ భారత కాన్సుల్ జనరల్), ప్రొఫెసర్ రోవాన్ పార్క్స్ (మాజీ ప్రెసిడెంట్), ప్రొఫెసర్ క్లేర్ మెక్నాట్ (రాయల్ కాలేజ్ ఆఫ్ ఎడిన్బర్గ్ ప్రెసిడెంట్), ప్రొఫెసర్ మార్క్ హాల్పెర్న్ (కాలిఫోర్నియా కాలేజ్ ఆఫ్ ఆయుర్వేద వ్యవస్థాపకుడు)లతోపాటు అమెరికా, భారత్, యూకే నుంచి అనేకమంది ప్రముఖులు హాజరయ్యారు. ప్రపంచానికి నిజమైన చరిత్రను తెలియజేయడం, సుశ్రుతుడిని తొలి శస్త్రచికిత్స నిపుణుడిగా గౌరవించడం ఈ చర్య ముఖ్య ఉద్దేశమని తెలిపారు.
ఈ విగ్రహాన్ని తిరువణ్ణామలైకి చెందిన ఓ శిల్పి రూపొందించారు. అలాగే మహర్షి సుశ్రుత : ఎ కంపెండియం ఫాదర్ ఆఫ్ సర్జరీ పేరుతో 280 పేజీల సమగ్రమైన, ఆధారాలతో కూడిన పుస్తకాన్ని కూడా విడుదల చేశారు.
ప్రపంచానికి ప్లాస్టిక్ సర్జరీని పరిచయం చేసిన తొలి శస్త్ర చికిత్సకుడు సుశ్రుతుడే. ఆయన క్రీ.పూ. 6 వ శతాబ్దికి చెందిన వారుగా చెబుతుంటారు. కాశీ రాజ్యం జన్మస్థలం. వారణాసి ఆయన చికిత్స కేంద్రం. వైద్య ప్రపంచం నేడు సుశ్రుతుడిని ప్లాస్టిక్ సర్జరీకి పితామహునిగా పిలుస్తోంది. ఆయుర్వేద శాస్త్రంలో శల్యతంత్రం అని పిలిచే అంటే సర్జరీకి ఈయన రచించిన ‘‘సుశ్రుత సంహిత’’ అత్యంత ప్రామాణిక గ్రంథం.
ప్రపంచవ్యాప్తంగా ఆయుర్వేదం, ఆధునిక వైద్య రంగాలకు చెందిన 36 మంది నిపుణులు మహర్షి సుశ్రుత పద్ధతులు, ఆచరణలు 21వ శతాబ్దానికి ఎంతగానో ఉపయోగపడతాయనే అంశంపై ఈ పుస్తకంలో సమగ్ర చర్చలు చేశారు. ఆధునిక వైద్యం హిప్పోక్రేటిస్ ప్రమాణాన్ని అనుసరిస్తున్నప్పటికీ ఆ కాలానికి కొన్ని శతాబ్దాల ముందే సుశ్రుతుడు ఆ ప్రమాణాన్ని కనిపెట్టారని ఈ పుస్తకం ఆధారాలతో సహా తెలిపింది. ఆయన శస్త్రచికిత్స, ప్లాస్టిక్ సర్జరీ, వైద్యం, ఆర్థోపెడిక్స్, గైనకాలజీ, టాక్సికాలజీ, యూరాలజీ వంటి అనేక వైద్య విభాగాలను క్రమబద్ధీకరించారు. ఈ పుస్తకం ఆన్లైన్లో ఈ-బుక్ రూపంలో కూడా (అమెజాన్, గూగుల్ బుక్స్, కిండిల్ వంటి వేదికలపై) అందుబాటులోకి వచ్చింది.
ప్రపంచానికి ప్లాస్టిక్ సర్జరీని పరిచయం చేసిన తొలి శస్త్ర చికిత్సకుడు సుశ్రుతుడే.








