ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం: గల్ఫ్ భారతీయుల కొంప ముంచుతోందా? ఆ 40% మంది పరిస్థితి ఘోరం!
యుద్ధం అక్కడ… యాతన ఇక్కడ!
—శివ దువ్వూరు
రాత్రి 11 గంటలు…
రోజంతా పని చేసి అలసిపోయిన అతను గల్ఫ్‌లోని తన చిన్న రూమ్‌కి చేరుకున్నాడు. ఫోన్ తీసుకుని ఇంటికి వీడియో కాల్ చేశాడు.
స్క్రీన్ అవతల పిల్లలు నవ్వుతున్నారు. భార్య రోజు జరిగిన విషయాలు చెబుతోంది. కాసేపటికి అమ్మ ఫోన్లోకి వచ్చి, “అన్నీ బాగానే ఉన్నాయిగా బాబూ?” అని అడిగింది.
“అన్నీ బాగానే ఉన్నాయి అమ్మ…” అని నవ్వుతూ చెప్పాడు.
కానీ ఆ నవ్వు వెనుక దాగి ఉన్న భయం… ఆందోళన… అనిశ్చితి మాత్రం ఎవరికీ కనిపించలేదు.
“రేపు ఉద్యోగం ఉంటుందా?”
“ఇంకెన్ని రోజులు ఇంటికి ఇదే భరోసా ఇవ్వగలను?”
“పిల్లల భవిష్యత్తు కోసం పంపే డబ్బు ఆగిపోతే?”
ఇప్పుడు గల్ఫ్‌లో ఉన్న లక్షలాది మంది భారతీయుల మనసులో తిరుగుతున్న ప్రశ్నలు ఇవే.
ఎందుకంటే ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు కేవలం రెండు దేశాల సమస్యగా మిగలడం లేదు. వేల కిలోమీటర్ల దూరంలో జరుగుతున్న ఈ ఘర్షణ ప్రభావం ఇప్పుడు గల్ఫ్‌లో చెమటోడ్చే భారతీయ కార్మికుడి జేబుకు, అతని కుటుంబ భవిష్యత్తుకు చేరుకుంది.
గల్ఫ్‌లో గుబులు… భారత కుటుంబాల్లో బెంగ
యూఏఈ, సౌదీ అరేబియా, ఖతార్, కువైట్, ఒమాన్, బహ్రెయిన్ దేశాల్లో కోట్లాది మంది విదేశీయులు పనిచేస్తున్నారు. వారిలో భారతీయులదే అతిపెద్ద వాటా. ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల కారణంగా హార్ముజ్ జలసంధి ప్రాంతంలో అనిశ్చితి పెరిగింది. ప్రపంచ చమురు, సరుకుల రవాణాకు కీలకమైన ఈ మార్గంలో ఎలాంటి ఆటంకం వచ్చినా దాని ప్రభావం మొత్తం గల్ఫ్ ఆర్థిక వ్యవస్థపై పడుతుంది.
హోటళ్లు, నిర్మాణ రంగం, రవాణా, లాజిస్టిక్స్ వంటి రంగాలు ఇప్పటికే ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయనే సంకేతాలు కనిపిస్తున్నాయి.
డబ్బులు పెరిగాయి… కానీ ధైర్యం తగ్గింది!
2026 తొలి త్రైమాసికంలో భారత్‌కు విదేశాల నుంచి వచ్చే డబ్బు ఇటీవల పెరిగింది. పైకి చూస్తే ఇది మంచి వార్తలా అనిపిస్తుంది. నీ అసలు కారణం వేరే. పరిస్థితులు మరింత దిగజారితే ఏమవుతుందో అన్న భయంతో చాలా మంది గల్ఫ్ ఉద్యోగులు తమ దగ్గనున్న పొదుపులను కూడా కుటుంబాలకు పంపిస్తున్నారు.
అధికారిక లెక్కలు ప్రకారం గల్ఫ్‌లో ఉన్న మొత్తం భారతీయ ప్రవాసులలో దాదాపు 40 శాతం మంది తమకు మిగిలిన అదనపు సంపాదన నుండి కాకుండా, భవిష్యత్తు కోసం దాచుకున్న ‘అత్యవసర నిధులు’ (Emergency Reserves) లేదా ‘వ్యక్తిగత పొదుపు’ (Personal Savings) నుండి డబ్బు తీసి భారతదేశంలోని తమ కుటుంబాలకు పంపుతున్నారు
ఇక్కడ మనం గమనించాల్సింది వారు పంపేది… జీతం నుంచి కాదు… అత్యవసర పరిస్థితుల కోసం దాచుకున్న డబ్బును కూడా ఇంటికి పంపుతున్నారు. అంటే పరిస్థితులు మరింత దిగజారక ముందే తమ డబ్బును భారతీయ బ్యాంక్ ఖాతాల్లోకి తరలిస్తున్నారు. ఇది సంపాదన పెరిగిందనే సంకేతం కాదు… భయం పెరిగిందనే సంకేతం.
ఒకవేళ ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణలు ఇలాగే కొనసాగితే, 2026 మూడో త్రైమాసికం (Quarter 3) నాటికి ఈ 40% మంది వద్ద ఉన్న అత్యవసర నిధులు పూర్తిగా అయిపోతాయని (Depleted) విశ్లేషకులు అంచనా వేశారు
పైకి డబ్బు ప్రవాహం పెరిగినట్లు కనిపిస్తున్నా, లోపల ఆందోళన ప్రవాహం మరింత వేగంగా పెరుగుతోంది.
పెరుగుతున్న ఖర్చులు… తగ్గుతున్న నమ్మకం
యుద్ధ భయంతో సరుకుల రవాణా ఖర్చులు పెరుగుతున్నాయి. బీమా ప్రీమియం లు పెరుగుతున్నాయి. దిగుమతి వస్తువుల ధరలు ఎగబాకుతున్నాయి. దీంతో గల్ఫ్ దేశాల్లో జీవన వ్యయం కూడా పెరుగుతోంది.
ఒక వైపు ఖర్చులు పెరుగుతున్నాయి. మరో వైపు అదే స్దాయిలో జీతాలు పెరగడం లేదు. ఇంకోవైపు కొన్ని ప్రాజెక్టులు ఆలస్యం అవుతున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి.
గల్ఫ్ ఉద్యోగుల అసలు భయం ఇదే!
అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఉద్యోగం కోల్పోయినా కొంతకాలం అక్కడ ఉండే అవకాశం ఉంటుంది. కానీ గల్ఫ్ దేశాల వ్యవస్థ భిన్నం. అక్కడ ఉద్యోగం అంటేనే నివాస హక్కు. ఉద్యోగం పోతే… వీసా ప్రమాదంలో పడొచ్చు. వీసా ప్రమాదంలో పడితే… దేశం విడిచి రావాల్సి రావొచ్చు. అందుకే అక్కడి ఉద్యోగులకు “జీతం” కంటే “ఉద్యోగం” ముఖ్యం.
భారత్‌కు కూడా ఇది హెచ్చరికే!
గల్ఫ్ నుంచి వచ్చే డబ్బు కేవలం లక్షలాది కుటుంబాలకు జీవనాధారం మాత్రమే కాదు. దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా ఒక బలమైన ఆధారం. ఈ నిధులు భారత్ విదేశీ మారక నిల్వలకు బలం చేకూరుస్తాయి. దేశ కరెంట్ అకౌంట్ లోటును సమతుల్యం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
అందుకే గల్ఫ్‌లోని ప్రతి ఆర్థిక కదలిక… భారత్‌లోని ప్రతి కుటుంబాన్ని తాకే శక్తి కలిగి ఉంటుంది.
చివరగా…
ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వార్తలు టీవీ స్క్రీన్‌పై కనిపించవచ్చు. కానీ ఆ ప్రభావం మాత్రం గల్ఫ్‌లో పనిచేస్తున్న ఒక తండ్రి గుండెల్లో, ఒక తల్లి ఎదురు చూపుల్లో, ఒక కుటుంబ భవిష్యత్తులో కనిపిస్తోంది. ఈరోజు అతను నవ్వుతూ “అన్నీ బాగానే ఉన్నాయి” అని చెబుతున్నాడు. కానీ ఆ నవ్వు వెనుక దాగి ఉన్న ప్రశ్న మాత్రం ఇంకా అలాగే ఉంది…
“రేపు కూడా ఇదే మాట చెప్పగలనా?” అని.








