శిబి కథకు కమల్ గ్రీన్ సిగ్నల్
కోలీవుడ్ లో ఎన్నో దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న సూపర్ స్టార్లు రజినీకాంత్(rajinikanth), కమల్ హాసన్(kamal Haasan) మరోసారి ఒకే సినిమాలో కనిపించనున్న విషయం తెలిసిందే. వీరిద్దరూ కలిసి నటించే భారీ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే చర్చలు జరుగుతుండగా, అంతకుముందే కమల్ హాసన్ నిర్మాణంలో రజినీకాంత్ హీరోగా ఓ ప్రత్యేక సినిమా రూపొందించాలనే ప్రయత్నాలు వేగం పుంజుకున్నాయి. అయితే ఈ ప్రాజెక్ట్ ప్రారంభ దశలోనే పలువురు దర్శకులు మారడం ఆసక్తికరంగా మారింది. మొదట సుందర్ సి(Sundar C), ఆ తర్వాత శిబి చక్రవర్తి(Cibi Chakravarthy) పేర్లు వినిపించినా, చివరకు ఓ మై కడవులే(Oh My Kadavule), డ్రాగన్(Dragon) సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న అశ్విన్ మారిముత్తు(Ashwin Maarimuthu) దర్శకత్వ బాధ్యతలు చేపట్టినట్లు తెలుస్తోంది.
ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాకపోయినా, ఈ సినిమా సైలెంట్ గా సెట్స్ మీదికి వెళ్లిందన్న వార్తలు కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి. చెన్నైలో ప్రారంభమైన తొలి షెడ్యూల్లో రజినీకాంత్ పాల్గొనకపోయినా, ఇతర నటీనటులతో షూటింగ్ కొనసాగుతున్నట్లు సమాచారం. గతంలో పలుమార్లు మార్పులు చోటుచేసుకున్న ఈ ప్రాజెక్ట్ ఎట్టకేలకు పట్టాలెక్కడం కమల్ నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఇంటర్నేషనల్(Raj kamal international)కు ఊరటనిచ్చే పరిణామంగా భావిస్తున్నారు. రజినీ- కమల్ కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ సినిమా మీద ఇప్పటికే మంచి ఆసక్తి నెలకొంది.
మరోవైపు రజినీకాంత్ కోసం రెడీ చేసిన కథ ఆగిపోవడంతో శిబి చక్రవర్తి ప్రాజెక్ట్ పూర్తిగా ముగిసిపోయిందని భావించాల్సిన అవసరం లేదని తెలుస్తోంది. రజినీకి నచ్చని ఆ కథ కమల్ హాసన్‌ను ఆకట్టుకుందని సమాచారం. అందుకే శిబిని రాజ్ కమల్ ఇంటర్నేషనల్ పరిధిలోనే కొనసాగిస్తూ స్క్రిప్ట్‌ను మరింత మెరుగుపరుస్తున్నారట. కమల్ స్వయంగా నటించే అవకాశంతో పాటు, మరో సీనియర్ హీరోతో కూడా ఆ సినిమాను తెరకెక్కించే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. డాన్(Don) వంటి సక్సెస్ఫుల్ మూవీని తెరకెక్కించిన శిబి నుంచి కమల్ కొత్త తరహా ప్రయోగాత్మక కథను ఆశిస్తున్నట్లు ఈ పరిణామాలు సూచిస్తున్నాయి.








