15 శాతం వృద్ధిరేటు లక్ష్యమన్న ముఖ్యమంత్రి చంద్రబాబు
స్వర్ణాంధ్ర లక్ష్యాలపై ప్రణాళికా విభాగం ఎంఓయూ
ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ రీసెర్చ్‌తో ఒప్పందం
స్వర్ణాంధ్ర 2047 విజన్‌లో భాగంగా 15 శాతం వృద్ధిరేటు లక్ష్యంగా పెట్టుకున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. 2014-19 మధ్య 13.5 శాతం మేర సీఏజీఆర్ సాధించామని.. వివిధ కారణాల వల్ల ప్రస్తుతం 11 శాతం మేర వృద్ధి రేటు నమోదైందని తెలిపారు. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో రాష్ట్ర ప్రణాళికా విభాగం-కేఆర్ఈఏ యూనివర్సిటీ ఆధ్వర్యంలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ రీసెర్చ్ మధ్య అవగాహనా ఒప్పందం కుదిరింది. స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాల సాధనలో పది సూత్రాల అమలుపై ఈ ఎంఓయూ కుదుర్చుకున్నారు. రాష్ట్ర ప్రణాళికా విభాగం ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్, ఐఎఫ్ఎంఆర్ సంస్థ ప్రతినిధి కపిల్ విశ్వనాధన్ ఒప్పందాలు మార్చుకున్నారు.
రాష్ట్ర స్థూల ఉత్పత్తి, వృద్ధిరేటు సాధనలో పది సూత్రాల మిషన్ సెల్స్ ఏర్పాటుతో పాటు కార్యక్రమం అమలుపై ఐఎఫ్ఎంఆర్ సంస్థ పర్యవేక్షణ చేయనుంది. జీరో పావర్టీ మిషన్, వాటర్ సెక్యూరిటీ, డీప్ టెక్ మిషన్లపై ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ రీసెర్చి సంస్థ రాష్ట్రంలో ప్రభుత్వంతో పనిచేయనుంది. ఈ ఒప్పందంలో భాగంగా క్షేత్రస్థాయిలో అధ్యయనం, విధాన పరమైన సూచనలు అందిస్తుంది. ఈ 10 సూత్రాలకు సంబంధించి కొత్త పద్దతులకు సిఫారసు చేస్తుంది. తదుపరి దశల్లో మిగిలిన అంశాలపై పనిచేయాలని నిర్ణయించారు. పది సూత్రాల అమలుపై రాష్ట్రస్థాయి కమిటీతో పాటు మిషన్ వర్కింగ్ గ్రూప్‌లను కూడా ఏర్పాటు చేయనున్నారు.

రాష్ట్రంలోని వివిధ రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు డీప్ టెక్‌ను ఇంటిగ్రేషన్ చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. ఏఐ స్కిల్లింగ్, డ్రోన్ మ్యాపింగ్ ఆటోమొబైల్, మెటల్స్, స్టీల్, రేర్ ఎర్త్ మినరల్స్, సెమీ కండక్టర్స్, డిఫెన్స్ లాంటి రంగాల్లో ప్రాజెక్టులు ఏపీకి వచ్చాయని అన్నారు. ఏఐ, క్వాంటం టెక్నాలజీని కూడా రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి పయ్యావుల కేశవ్, కేఆర్ఈఏ, ఐఎఫ్ఎమ్ఆర్ ప్రతినిధులు, ప్రణాళికా విభాగం అధికారులు హాజరయ్యారు.








