ఆ డైరెక్టర్ ఫోటో బెడ్రూమ్ లో పెట్టుకున్నా!
తమిళ, తెలుగు చిత్ర పరిశ్రమల్లో సుదీర్ఘ కాలంగా తనదైన గుర్తింపుతో కొనసాగుతున్న సీనియర్ నటుడు ఆనంద్(Anand) తాజాగా చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. స్టార్ ఇమేజ్ దక్కకపోయినా నటుడిగా ప్రత్యేక ముద్ర వేసుకున్న ఆయన, డైరెక్టర్ వెంకటేష్ మహా రూపొందించిన కేరాఫ్ కంచరపాలెం(C/o Kancherapalem) తన సినీ జీవితంలో చూసిన అత్యుత్తమ సినిమాల్లో ఒకటని పేర్కొన్నారు. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆ సినిమా తనపై చూపిన ప్రభావాన్ని గుర్తు చేసుకుంటూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా సినిమా క్లైమాక్స్‌లో నాలుగు ప్రేమకథలు ఒకే వ్యక్తి జీవితానికి చెందినవని తెలిసిన క్షణం తనను పూర్తిగా షాక్‌కు గురి చేసిందని చెప్పారు.
ఆ ట్విస్ట్ చూసిన వెంటనే చేతిలో ఉన్న రిమోట్‌ను అనుకోకుండా విసిరేశానని ఆనంద్ తెలిపారు. తర్వాత విరిగిపోయిన రిమోట్ భాగాలను, బ్యాటరీలను మళ్లీ కలుపుతుంటే సినిమాలోని నాలుగు పాత్రలను ఒక్కటిగా కలిపిన అనుభూతి గుర్తుకు వచ్చిందన్నారు. సినిమా పూర్తయ్యాక కొంతసేపు ఏం మాట్లాడాలో అర్థం కాక బాల్కనీలోకి వెళ్లి ఆలోచిస్తూ నిలబడ్డానని చెప్పారు. తన భార్య కూడా తన రియాక్షన్ చూసి ఆశ్చర్యపోయిందని, ఆ క్షణంలో తాను పూర్తిగా సినిమా మత్తులో ఉన్నానని ఆనంద్ వెల్లడించారు.
అంతటితో ఆ అభిమానం ఆగిపోలేదట. ఒకప్పుడు మణిరత్నం(Maniratnam) దర్శకత్వంలో నటించాలని కలలు కన్నానని చెప్పిన ఆనంద్, ఆ తర్వాత తప్పకుండా పని చేయాలనిపించిన డైరెక్టర్ వెంకటేష్ మహా(Vekatesh Maha)నే అని అన్నారు. ఆయన ఫోన్ నంబర్ సంపాదించి సంప్రదించి ప్రయత్నించినా ఆయన రెస్పాండ్ కాలేదని, అయినా ఆయనపై ఉన్న అభిమానంతో వెంకటేష్ మహా ఫొటోను ప్రింట్ తీసుకుని తన బెడ్రూంలో అతికించుకున్నానని చెప్పారు. అనంతరం వెంకటేష్ మహా స్వయంగా సంప్రదించి రావు బహదూర్(Rao Bahadur) సినిమాలో కీలక పాత్ర ఆఫర్ చేయగా, ఆ సినిమా స్క్రిప్ట్ విన్న తర్వాత కూడా తనకు అదే స్థాయిలో ఉత్సాహం కలిగిందని ఆనంద్ వెల్లడించారు.








