విదేశాలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్.. ఇక దుబాయ్‌లో దిగాల్సిన అవసరం లేదా? -కేంద్రం కొత్త ప్లాన్ హాట్ టాపిక్!
–శివ దువ్వూరు
మీరు ఎప్పుడైనా గమనించారా? హైదరాబాద్ లేదా వైజాగ్ నుండి అమెరికాకో, లండన్‌కో వెళ్లాలంటే.. మనవాళ్లు ఎక్కువ శాతం దుబాయ్, సింగపూర్ లేదా దోహా ఎయిర్‌పోర్టుల్లోనే ఎందుకు ఆగుతారు? ఎందుకంటే.. అంతర్జాతీయ ప్రయాణాలు చేయాలంటే ఇప్పటివరకు మనకు అవే ప్రధానమైన గేట్‌వేలుగా మారిపోయాయి.
కట్ చేస్తే… ప్రయాణికులు మనవాళ్లు, డబ్బు మనది.. కానీ లాభం మాత్రం విదేశీ విమానయాన సంస్థలకి! మన ప్రయాణికులతో ఆ దేశాలు ఏటా వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాయి. కానీ ఈ ‘మైండ్ గేమ్’కు ఎండ్ కార్డ్ వేయడానికి.. ఇండియా ఇప్పుడు ఒక మైండ్ బ్లోయింగ్ మెగా స్కెచ్ వేసింది.
గల్ఫ్ దేశాల గుత్తాధిపత్యాన్ని నడిబజార్లో దెబ్బకొడుతూ, ఇకపై గ్లోబల్ ట్రాన్సిట్ హబ్‌గా ఇండియా మారబోతోంది. ప్రపంచ విమానయాన రంగంలోనే ప్రకంపనలు సృష్టిస్తున్న ఆ సంచలన మాస్టర్ ప్లానే.. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన “ఈజీ కనెక్ట్” పాలసీ!
దుబాయ్ vs ఇండియా…
ప్రపంచ విమానయాన మ్యాప్‌లో దుబాయ్ ఒక సామ్రాజ్యం. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే ప్రయాణికులు అక్కడ దిగుతారు. అక్కడి నుంచి మరో దేశానికి వెళ్తారు. ఈ ట్రాన్సిట్ ప్రయాణికుల వల్లే దుబాయ్ ఎయిర్పోర్ట్ ప్రపంచంలోనే అత్యంత రద్దీగా మారింది.
కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే… ఆ ప్రయాణికుల్లో భారీ శాతం భారతీయులే. భారత్ నుంచి బయలుదేరే అంతర్జాతీయ ప్రయాణికుల్లో దాదాపు 35 శాతం మంది ఇప్పటికీ విదేశీ హబ్‌ల మీదే ఆధారపడుతున్నారు.
అంటే… ప్రయాణికులు భారతీయులే. డబ్బు భారతీయులదే. కానీ లాభాలు మాత్రం దుబాయ్, దోహా, సింగపూర్‌లకే వెళ్తున్నాయి. ఇప్పుడు ఇదే లీకేజీని ఆపాలని కేంద్రం భావిస్తోంది.
“ఈజీ కనెక్ట్”
ఇప్పటివరకు అంతర్జాతీయ ప్రయాణాల్లో దుబాయ్ (Emirates), కతార్ (Qatar Airways) రాజులుగా వెలిగిపోయాయి. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ కాబోతోంది. కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ “ఈజీ కనెక్ట్” (Easy Connect) పేరుతో ఒక సరికొత్త బ్రహ్మాస్త్రాన్ని రంగంలోకి దించింది.
ఢిల్లీ, ముంబై, బెంగళూరు విమానాశ్రయాలను ప్రపంచ స్థాయి మెగా హబ్‌లుగా మార్చి, దుబాయ్, చాంగి (సింగపూర్) ఎయిర్‌పోర్టులకు వచ్చే ఇంటర్నేషనల్ ట్రాఫిక్‌ను ఇండియా వైపు తిప్పుకోవడమే దీని టార్గెట్. గల్ఫ్ కారిడార్లలో జరుగుతున్న ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాలను క్యాష్ చేసుకుంటూ, సేఫ్ అండ్ డైరెక్ట్ రూట్‌గా ఇండియా బెట్ కాస్తోంది.
భారతీయుల డబ్బు విదేశాలకు ఎందుకు వెళ్తోంది?
ఒక ప్రయాణికుడు దుబాయ్‌లో నాలుగు గంటలు ఆగితే ఏమవుతుంది? ఆ ప్రయాణీకుడు కాఫీ తాగుతాడు. షాపింగ్ చేస్తాడు. రెస్టారెంట్లో తింటాడు. ఎయిర్పోర్ట్ ఫీజులు చెల్లిస్తాడు. ఎయిర్‌లైన్స్ కూడా ఆ ట్రాన్సిట్ ప్రయాణికుల ద్వారా భారీ ఆదాయం సంపాదిస్తాయి. అంటే ప్రతి భారతీయ ప్రయాణికుడు విదేశీ ఎయిర్పోర్ట్ ఎకానమీని బలోపేతం చేస్తున్నాడన్న మాట.
ఇవి కూడా చదవండి
ఇదే కారణంగా Emirates, Qatar Airways, Singapore Airlines వంటి సంస్థలు భారత మార్కెట్ నుంచి భారీ లాభాలు సంపాదిస్తున్నాయి.
ఇప్పుడు కేంద్రం లక్ష్యం ఒక్కటే.
“భారతీయ ప్రయాణికుడు భారతీయ ఎయిర్‌పోర్ట్‌లోనే ట్రాన్సిట్ కావాలి.” గేమ్ ఛేంజర్ ప్లాన్ ఇదే. కొత్త Easy Connect పాలసీ ప్రకారం… ఇకపై చిన్న నగరాల నుంచే అంతర్జాతీయ ప్రయాణానికి అవసరమైన ప్రక్రియలు పూర్తి చేసే అవకాశం ఉంటుంది.
ఉదాహరణకు…
రాజమండ్రి నుంచి లండన్ వెళ్లే ప్రయాణికుడు ముందుగా ఢిల్లీకి వస్తాడు. కానీ ఢిల్లీలో మళ్లీ బ్యాగులు తీసుకోవాల్సిన అవసరం ఉండదు. మళ్లీ ఇమ్మిగ్రేషన్ క్యూల్లో నిలబడాల్సిన అవసరం ఉండదు. బ్యాగ్ నేరుగా లండన్ ఫ్లైట్‌కు వెళ్తుంది. ప్రయాణికుడు కూడా నేరుగా కనెక్టింగ్ ఫ్లైట్ ఎక్కేస్తాడు. ఇప్పటి వరకు దుబాయ్, సింగపూర్లలో లభిస్తున్న సౌకర్యాన్ని ఇండియాలోనే ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది.
సరికొత్త హుబ్-అండ్-స్పోక్ మోడల్.
సింగిల్ పాయింట్ ఇమ్మిగ్రేషన్: ఇకపై చిన్న నగరాల్లోనే ఇమ్మిగ్రేషన్, లగేజ్ బోర్డింగ్ పూర్తయిపోతుంది.
వారణాసి-ఢిల్లీ పైలట్ ప్రాజెక్ట్: జూన్ 25, 2026 నుండి ఎయిర్ ఇండియా ఈ సంచలన మార్పుకు శ్రీకారం చుడుతోంది. వారణాసిలో ఫార్మాలిటీస్ ముగించుకుని ఢిల్లీ వస్తే.. మళ్లీ సెక్యూరిటీ చెక్స్ లేకుండానే, లగేజ్ రీ-చెక్ చేసుకోకుండానే కేవలం 4 గంటల్లో లండన్, దుబాయ్, సింగపూర్ వంటి 17 అంతర్జాతీయ నగరాలకు ఎగిరిపోవచ్చు.
ఢిల్లీలో ఎయిర్ ట్రైన్: టెర్మినల్స్ మారే తలనొప్పి లేకుండా ₹4,000 కోట్లతో నిర్మిస్తున్న 7.7 కిలోమీటర్ల ‘ఆటోమేటెడ్ ఎయిర్ ట్రైన్’ 2027 కల్లా అందుబాటులోకి రానుంది.
తెలుగు రాష్ట్రాల వారికి అసలు లాభం ఏమిటి?
ఇదే ఈ కథలో మనకు ముఖ్యమైన అంశం. విజయవాడ, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం వంటి నగరాల నుంచి విదేశాలకు వెళ్లే వారికి ఇప్పటి వరకు చాలా ఇబ్బందులు ఉండేవి.
బ్యాగేజీ సమస్య. పొడవైన వెయిటింగ్ క్యూ. రెండు సార్లు చెక్-ఇన్. ఇమ్మిగ్రేషన్ తంటాలు. కనెక్టింగ్ ఫ్లైట్ మిస్ అవుతుందేమో అనే భయం. కొత్త విధానం పూర్తిగా అమల్లోకి వస్తే ఈ సమస్యలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.
కలిసిరానున్న విమాన ఛార్జీలు: ఇండియన్ హబ్స్ యాక్టివ్ అయితే, కాంపిటీషన్ పెరిగి ఇంటర్నేషనల్ టికెట్ ధరలు తగ్గే అవకాశం క్లియర్ గా కనిపిస్తోంది. గల్ఫ్ ఎయిర్‌లైన్స్ విధించే భారీ ఛార్జీల నుండి మన తెలుగు ప్రయాణికులకు విముక్తి లభిస్తుంది.
అంటే…
విశాఖ నుంచి సింగపూర్. రాజమండ్రి నుంచి లండన్. విజయవాడ నుంచి ఫ్రాంక్ఫర్ట్. తిరుపతి నుంచి రోమ్. ఇలాంటి ప్రయాణాలు మరింత సులభం కావచ్చు.
దుబాయ్‌ను నిజంగానే ఈ విషయంలో గెలవగలమా?
ఇదే అసలు సవాల్. దుబాయ్ విజయానికి కారణం కేవలం ఎయిర్పోర్ట్ కాదు. వేగవంతమైన సేవలు. ప్రపంచ స్థాయి కనెక్టివిటీ. వందలాది లాంగ్-హాల్ విమానాలు. అత్యాధునిక మౌలిక సదుపాయాలు. ఇండియా ఇప్పుడే ఆ స్థాయికి చేరలేదు. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ఇప్పటికీ టెర్మినల్ కనెక్టివిటీ సమస్యలు ఉన్నాయి. ఎయిర్ ఇండియా వద్ద Emirates స్థాయి లేదు. పాలసీ ప్రకటించడం ఒక విషయం. దాన్ని ప్రపంచ స్థాయిలో అమలు చేయడం మరో విషయం.
ఏదైమైనా
ప్లాన్ అయితే అదిరిపోయింది.. కానీ విదేశీ మెగా క్యారియర్లను ఢీకొట్టే స్థాయిలో మన దేశీయ ఎయిర్‌లైన్స్ వైడ్‌బాడీ విమానాల సామర్థ్యాన్ని పెంచుకోగలవా? ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ విభాగాలు అంతర్జాతీయ స్థాయి వేగాన్ని అందుకోగలవా? అనేది చూడాలి. ఏదేమైనా, దుబాయ్ ఎయిర్పోర్ట్ క్రేజ్‌కు ఇండియా గట్టి పోటీ ఇవ్వబోతుందనేది మాత్రం అక్షర సత్యం!
మీరేమంటారు? ఇండియా వేసిన ఈ మాస్టర్ ప్లాన్ వర్కవుట్ అవుతుందా?








