దుబాయ్ లో ఎయిర్ ట్యాక్సీ స్టేషన్..!
ప్రపంచంలో ట్రాన్స్ పోర్ట్ రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. మరీ ముఖ్యం వాయు రవాణ అయితే దినదిన ప్రవర్థమానంగా దూసుకెళ్తోంది. అయితే దీనిలో మరింత సృజనాత్మకంగా .. పెరుగుతున్న రద్దీ తట్టుకునేలా ఎయిర్ ట్యాక్సీలను రంగంలోకి దించేందుకు పలుదేశాలు ప్రయత్నిస్తున్నాయి. త్వరలో తమ పౌరులకు ఈ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు దుబాయ్ ప్రకటించింది. ఇందుకోసం ప్రత్యేకంగా ప్రపంచంలోనే తొలి ఎయిర్‌ట్యాక్సీ స్టేషన్‌ను నిర్మించింది. ఈ విషయాన్ని దుబాయ్ (Dubai) యువరాజు హమ్దాన్ బిన్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ప్రకటించారు. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయ సమీపంలో నిర్మించిన స్టేషన్ ఈ ఏడాది చివరికి ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది.
దుబాయ్ ఎయిర్ ట్యాక్సీ స్టేషన్ .. చాలా విషయాల్లో ప్రత్యేకంగా నిర్మించారు. ముఖ్యంగా 3,100 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఎయిర్‌ట్యాక్సీ స్టేషన్ నిర్మాణం జరిగింది.ఏటా 1,70,000 మంది ప్రయాణించడానికి వీలుగా సౌకర్యాల కల్పన జరుగుతోంది. కార్లలో సుమారు 45 నిమిషాలు పట్టే సమయంతో పోలిస్తే ఎయిర్ ట్యాక్సీల్లో కేవలం 10 నిమిషాల్లోనే గమ్యస్థానానికి చేరే అవకాశం ఉంది. రెండు ల్యాండింగ్ ప్యాడ్లు, ఎలక్ట్రిక్ విమానాల కోసం ఛార్జింగ్ పాయింట్లు, రెండు-స్థాయుల కార్ పార్కింగ్వంటి సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నాయి.
అర్బన్ ఎయిర్ ట్యాక్సీ సేవలతో పాటు కార్గో, లాజిస్టిక్స్, మెడికల్, ఎమర్జెన్సీ సేవల కల్పనకు అవకాశం కలగనుంది. నాలుగు స్టేషన్ల నెట్‌వర్క్‌లో భాగంగా ఈ ఎయిర్ స్టేషన్‌ను నిర్మించినట్లు అధికారులు వెల్లడించారు. 2026 చివరికి డౌన్‌టౌన్ దుబాయ్, పామ్ జుమేరా, దుబాయ్ మెరీనాలలోనూ ఎయిర్ స్టేషన్ల నిర్మాణం పూర్తి చేసి, అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. నూతన, సుస్థిరమైన రవాణా విధానాలను అవలంబించడంలో భాగంగా ఈ చర్యలు తీసుకున్నామన్నారు. ఈ ప్రాజెక్టును స్కైపోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ భాగస్వామ్యంతో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. నగరాల మధ్య ప్రయాణ సమయాలను గణనీయంగా తగ్గించడానికి ఎయిర్ టాక్సీ సేవలు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.
ఎయిర్ ట్యాక్సీలు అంటే..
ప్రస్తుతం సరకు రవాణాకు ఉపయోగపడుతున్న డ్రోన్ల కంటే కాస్త పెద్ద పరిమాణంలో ఉండే క్వాడ్ కాప్టర్ల వంటి వాటిని ఎయిర్ టాక్సీలు అంటారు. ఇవి ఆకాశమార్గంలో ఇద్దరి నుంచి ఆరుగురిని స్వల్ప దూరాలకు తీసుకెళ్లగలవు. తక్కువ సమయంలో గమ్యాన్ని చేరుకోవటానికి ఈ సేవలు ఉపయోగపడతాయి.








