రాయలసీమలో ‘పసిడి’ పంట..!
రాయలసీమ గడ్డపై సరికొత్త పారిశ్రామిక విప్లవానికి తెరలేవబోతోంది. నిన్నటివరకు కేవలం సాగు పంటలకే పరిమితమైన ఈ ప్రాంతంలో, ఇకపై ‘పసిడి'(Gold) పంట పండనుంది. కర్నూలు జిల్లాలోని తుగ్గలి మండలం జొన్నగిరి గ్రామం ఇకపై ‘స్వర్ణగిరి’గా మారబోతోంది. ఈ ప్రాంతంలో భారీ ఎత్తున బంగారాన్ని వెలికితీసేందుకు ప్రతిష్టాత్మక గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టు సిద్ధమైంది. రూ.405 కోట్ల భారీ పెట్టుబడితో ‘జియో మైసూర్ సర్వీసెస్’, ‘డెక్కన్ గోల్డ్ మైన్స్’ సంస్థలు సంయుక్తంగా ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా చేపట్టాయి.
ఈ భారీ బంగారు వెలికితీత ప్రాజెక్టును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) రేపు అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టు ప్రారంభంతో పాటు, మైనింగ్ విస్తరణలో భాగంగా ఏర్పాటు చేయనున్న రెండో యూనిట్‌కు కూడా సీఎం చంద్రబాబు అదే వేదికపై నుంచి శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమంతో రాయలసీమ పారిశ్రామిక చిత్రపటంలో జొన్నగిరి సరికొత్త చరిత్రను లిఖించనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా తొలి ఏడాదిలోనే 400 కేజీల బంగారాన్ని వెలికితీయాలని మైనింగ్ సంస్థలు లక్ష్యంగా పెట్టుకున్నాయి.
ఆ తర్వాత రెండో దశలో 900 కేజీలు, ఆపై మూడో దశకు చేరుకునేసరికి ఏడాదికి ఏకంగా 2 టన్నుల బంగారాన్ని ఉత్పత్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇక్కడ ఉత్పత్తి అయ్యే మొత్తం బంగారం విలువలో 4 శాతం రాయల్టీ రూపంలో నేరుగా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు చేరనుంది. ఇది ఏపీ ప్రభుత్వానికి ఒక స్థిరమైన, భారీ ఆదాయ వనరుగా మారనుంది.
ఈ గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టు కేవలం ప్రభుత్వ ఆదాయానికే పరిమితం కాకుండా, రాయలసీమ యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను కల్పించనుంది. మైనింగ్ రంగంలో నైపుణ్యం కలిగిన స్థానిక యువతకు ఉద్యోగాలు లభించనున్నాయి. పారిశ్రామికంగా వెనుకబడిన రాయలసీమ ప్రాంతంలో ఇంతటి భారీ ప్రాజెక్టు రావడం వల్ల స్థానిక ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని, రాబోయే రోజుల్లో మరిన్ని అనుబంధ పరిశ్రమలు ఇక్కడికి తరలివచ్చే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.








